నికర ఆదాయానికి మునగ సాగు మేలు

Thu,August 22, 2019 01:31 AM

Agriculture
పోషకాల గని మునగ. అందుకే ఈ పంటకు వాణిజ్యంగా మంచి ఆదరణ ఉన్నది. ఈ పంట ఆకులు, పూల కోసం ప్రధానంగా సాగు చేయబడుతున్నది. ఈ పంట విత్తన జిగురు, నూనె విత్తనాలు వివిధ ఔషధ పరిశ్రమలలో ఇప్పటికే వాడుతున్నారు. మానవ శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు మునగ నుంచి అందుతాయి. 100 గ్రాముల ఉడకబెట్టిన మునగ ఆకులతో వ్యక్తికి రోజూ కావలసిన కాల్షియం, 75 శాతం ఇనుము, సగం ప్రోటీన్‌, ఇతర అమైనో ఆమ్లాలతో పాటు ఏ, సీ విటమిన్లు కూడా అందుతాయి.అందుకే కాయగూర పంటగా దీనికి డిమాండు ఉన్నది. అయితే బహువార్షిక రకాల పూత, కాతకు ఎక్కువ సమయం తీసుకోవడంతో దిగుబడులు తక్కువ. ఇటీవల కాలంలో పరిశోధనలతో ఏకవార్షిక రకాలు అంటే ఆరు నెలల్లోపే పూతకు, కాతకు వచ్చే రకాలు అభివృద్ధి చేయబడినాయి. వాటి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మునగలో నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందడానికి సాగులో కిటుకులు పాటించాలి.

నేలలు

మునగ అన్నిరకాల నేలల్లో వచ్చే పంట. 6.5-8 మధ్య ఉదజని సూచి క కలిగిన ఇసుక, రేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

పంట సీజన్‌

ఆగస్టు మొదలుకొని అక్టోబర్‌ వరకు విత్తుకోవచ్చు. అయితే ఏడాదిలో ఏ సమయంలో విత్తినా ఎండాకాలంలోనే అంటే జనవరి-ఏప్రిల్‌ మధ్య పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది.

విత్తనమోతాదు

ఎకరాకు 200 గ్రాముల విత్తనం అవసరం. ఒక గుంతకు రెండు విత్తనాల చొప్పున 2.5-3 సెం.మీ లోతులో వేయాలి. లేదంటే ముందు గా పాలీ బ్యాగులలో పెంచి, 35-40 రోజుల సమయంలో గుంతలలో నాటాలి. గుంతలను 2-2.5 మీటర్ల దూరంలో 45 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 45 సెం.మీ లోతులో తవ్వాలి. ఒక్కో గుంతకు 15 కిలోల చొప్పు న కంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.
Agriculture1

అంతర సేద్యం

ఒక నెల వ్యవధిలో మొలకలు పరిశీలించి, మొలకలులేని గుంతల్లో మళ్లీ విత్తనాలు నాటాలి. మొక్కలు 75 సెం.మీ ఎత్తు పెరిగినప్పుడు మొదలు పైచివర్లను తుంచితే, పక్క కొమ్మలు ఎక్కువ సంఖ్యలో వస్తా యి. టమాటా, మిరప, బెండ, బొబ్బర్ల పంటలను అంతర పంటలు గా సాగు చేసుకోవచ్చు. అయితే మక్కజొన్నను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరాదు.

ఎరువులు

విత్తిన 3 నెలల్లో గుంతకు 45:15:30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌లను ఇచ్చే ఎరువులు వేయాలి. ఆరు నెలలకు పంట పూతకు వస్తుంది. ఆ సమయంలో మరో దఫాగా 45 గ్రాముల నత్రజ ని ఎరువులను ఒక్కో గుంతలో వేయాలి. విత్తిన మూడోరోజు మొదటి తడిని, ఆ తర్వాత 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి.

సస్యరక్షణ

పండు ఈగ యాజమాన్యం: మునగలో ప్రధానంగా ఆశించి నష్టపరిచే ఈగ పండు ఈగ. ఇది నాటిన 150,180, 210 రోజుల్లో పంటను ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరాకు 80 గ్రాముల ‘థయోమిథాక్సోమ్‌ 25 డబ్ల్యూజీ’ని నేలలో వేయాలి. ఎకరాకు 10 కుళ్లిన టమాటాతో కూడిన ఫ్రూట్‌ టాప్‌ 500 లీటర్ల నీటిలో కలిపివేయాలి. ఎకరా కు స్పైనోశాడ్‌ 45 ఎస్‌సీని 22 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. మరోదఫా ఎకరాకు 500 లీటర్ల నీటిలో 100 గ్రాముల ప్రొఫెనోఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి.

బొంత పురుగు యాజమాన్యం :

బొంత పురుగులు మునగ కాండంపై గుంపులుగా చేరి, బెరడును తొలి చి తింటాయి. ఆకులను తొలిచి వేస్తాయి. దీనివల్ల ఆకులు విపరీతంగా రాలిపోతాయి. దీని సమర్థ నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలి. పురుగు గుడ్లను, లార్వాలను సేకరించి ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచా లి. లార్వాలను చంపే ‘బర్నింగ్‌ టార్చి’ వాడాలి. లీటరుకు రెండు గ్రాముల చొప్పున లేదా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బరిల్‌ పౌడర్‌ను వాడి నివారించవచ్చు.

దిగుబడి: హెక్టారుకు 50-55 టన్నుల కాయలు. సాలీనా సరాసరి చెట్టుకు 220 మునగ కాయల దిగుబడి వస్తుంది.

కార్సి పంట

మునగలో కార్సి పంటగా కూడాసాగు చేసుకోవచ్చు. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ ఎత్తులో కత్తిరించాలి. 4,5 నెలల్లో చెట్టు కాపునకొస్తుంది. మూడేండ్ల వరకు కార్సి పంట తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45,15,30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పు న నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులు వేయాలి. ప్రతి సంవత్సరం 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.

ఏక వార్షిక మునగ రకాలు

కేఎం-1: విత్తనాలతో సాగు చేయాలి. సాలీనా ఒక చెట్టుకు సరాసరిన 400-500 కాయలు వస్తాయి. నాటిన ఆరు నెలలకే కాపునకొస్తుంది. కాయలు 25-30 సెం.మీ పొడవు ఉంటాయి. మొక్కలు పొదలుగా ఉంటాయి. కాబట్టి కాయ కోత చాలా సులభం. మొదటి కోత తర్వాత భూ మట్టానికి ఒక మీటరు మందం కాండం వదిలి మిగతా భాగం కత్తిరించాలి. కార్సి పంటగా 2-3 ఏండ్లు దిగుబడిని ఇస్తుంది.

పీకేఎం-1: రకం విత్తిన 5-6 నెలలకు పూతకు వస్తుంది. 7-8 నెల ల్లో కోతకు వస్తుంది. మార్చి-ఆగస్టు మధ్యలో దిగుబడి ఎక్కువ. ఒక ఏడాదిలో 4-6 మీటర్ల పొడవు పెరుగుతుంది. 6-12 కొమ్ములు వస్తాయి. కాయలు 75 సెం.మీ పొడవు, 6.3 సెం.మీ వ్యాసార్థంతో ఉండి, 150 గ్రాముల బరువు తూగుతాయి. సాలీనా మొక్కకు 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 52 టన్నుల కాయల దిగుబడి ఉంటుం ది. తోటలలో అంతర పంటగా, ఈ రకం మునగలో మిరప, వేరుశనగ, ఉల్లి పంటలను అంతరపంటగా పండించవచ్చు.

పీకేఎం-2: ఇది సంకర రకం. విత్తనాల ద్వారా సాగు చేసుకోవాలి. నాటిన ఆరు నెలల్లో కాతకు వస్తుంది. వివిధ పంటల సరళిలో సాగుకు అనుకూలం. కాయలు 120 సెం.మీ పొడవు, 8.3 సెం.మీ వ్యాసార్థం తో ఉండి 70 శాతం కండతో 280 గ్రాముల బరువు తూగుతుంది. కాయలలో విత్తనాలు తక్కువ. కండ ఎక్కువగా ఉంటుంది. సాలీనా చెట్టుకు సరాసరిన 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 98 టన్నుల దిగుబడి వస్తుంది. కార్సి పంటను మూడేండ్ల వరకు సాగు చేయవచ్చు.

చిన్న, సన్నకారు రైతులకు లాభం

- ఏకవార్షిక మునగ సాగుకు తక్కువ మొత్తంలో నీరు అవసరం.
- ఎక్కువమంది కూలీల అవసరం లేదు. కుటుంబసభ్యులే వివిధ పనులు పూర్తి చేసుకోవచ్చు.
- ఎరువులు, పురుగు మందులు తక్కువే.
- ఒక హెక్టారు కంటే తక్కువే సాగు విస్తీర్ణం. కాబట్టి మునగ కాయలను సులభంగా, తక్కువ కాలంలోనే స్థానిక మార్కెట్లకు తరలించవచ్చు.
- మునగ చెట్టు వ్యర్థాలు, కత్తిరించిన కొమ్మలు, ఇతరాల గుజ్జులను వాణిజ్యంగా పేపర్‌ తయారీలో వాడుతున్నారు. కాబట్టి వీటి ద్వారా అదనపు ఆదాయం రైతులకు లభిస్తుంది.
Agriculture2

అధిక సాంద్ర పద్ధతిలో సాగు

మొక్కల సంఖ్య పెంచటం ద్వారా అధిక దిగుబడిని పొందే అధునాతన పద్ధతి ‘అధిక సాంద్ర పద్ధతిలో సాగు’. సాధారణ పద్ధతికి బదులుగా గుంతలు 1.5 మీటర్ల వరుసలు, ఒక మీటరు దూరంలో వరుసలో మొక్కలు నాటేలా తీసుకోవాలి. దీంతో హెక్టారుకు 13,333 మొక్కలు ఉంటాయి. మొక్కల సాంద్రత పెరుగుతుంది. దీంతోపాటు బిందు సేద్యం పాటించి, ఒక మొక్కకు ఫెర్టిగేషన్‌ ద్వారా 135:23:45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‌లను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్‌ ఎరువులను యూరియా, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో డ్రిప్‌ ద్వారా అందించాలి.

- డాక్టర్‌ కె. రవీందర్‌రెడ్డి
8333981352
రిజిస్ట్రార్‌,రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం

293
Tags

More News