అంపైర్‌తో కోహ్లీ గొడవ.. డోర్‌ పగలగొట్టిన అంపైర్‌!

Tue,May 7, 2019 12:06 PM

బెంగళూరు: ఇంగ్లీష్‌ సీనియర్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ వివాదంలో చిక్కుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో అంపైర్‌ గది డోర్‌ను నిగెల్‌ ధ్వంసం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్టేడియం నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో బీసీసీఐ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ వేదికగా మే 12న జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు లాంగ్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నారు.


అసలేం జరిగిందంటే..

ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను ఆర్‌సీబీ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఉమేశ్‌ సరైన డెలివరీ వేసినప్పటికీ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించారు. రీప్లేలో అది లీగల్‌ డెలివరీ అని తేలడంతో దీనిపై ఉమేశ్‌తో పాటు ఆర్‌సీబీ సారథి విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబాల్‌ ఎలా అవుతుందని ప్రశ్నించిన ఉమేశ్‌పై అంపైర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బౌలింగ్‌ వేయడానికి వెళ్లూ అంటూ సూచించారు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో స్టేడియంలో అంపైర్లకు కేటాయించిన రూమ్‌కు ఆగ్రహంతో వెళ్లిన లాంగ్‌ డోర్‌ను కాలితో గట్టిగా తన్ని ధ్వంసం చేశాడు. దీనిపై బీసీసీఐ అంతర్గత విచారణ చేస్తున్నప్పటికీ అతన్ని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అంపైరింగ్‌ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

డోర్‌ పగలగొట్టినందుకు 50ఏండ్ల లాంగ్‌ జరిమానా కట్టారని కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సుధాకర్‌రావు తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. స్టేడియం అధికారులతో గొడవ తర్వాత లాంగ్‌ రూ.5వేలను చెల్లించి.. తాను చేసిన పేమెంట్‌కు రషీదు ఇవ్వాలని అంపైర్‌ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్‌గా సుధీర్ఘ అనుభవం ఉన్న లాంగ్‌ ఇప్పటి వరకు 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించారు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో ఆరంభంకానున్న వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీకి అతడు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

5031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles