స్టోక్స్ 135 నాటౌట్.. ఒక వికెట్ తేడాతో గెలిచిన ఇంగ్లాండ్

Sun,August 25, 2019 09:16 PM

Ben Stokes delivers miraculous win with unbeaten 135 as England keep series alive

లీడ్స్: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. ఒంటిచేత్తో పోరాడిన ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(135 నాటౌట్: 219 బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) ఇంగ్లీష్ జట్టుకు సంచలన విజయాన్నందించాడు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొని అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరి బ్యాట్స్‌మన్ జాక్ లీచ్(1 నాటౌట్: 17 బంతుల్లో)తో కలిసి 76 పరుగులు జోడించాడు.

ఆఖరి వికెట్ తీసి ఆతిథ్య జట్టుపై విజయం సాధించాలని భావించిన ఆస్ట్రేలియాకు ఇంగ్లీష్ స్టార్ ఆల్‌రౌండ్ గట్టి స్ట్రోక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌కు అద్భుత విజయం అందించిన స్టోక్స్‌పై అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ విన్నర్ స్టోక్స్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఛేదనలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలి టెస్ట్‌లో ఆసీస్‌ గెలవగా.. రెండో టెస్ట్‌ వర్షం కారణంగా రద్దైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆతిథ్య జట్టుపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఆసీస్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 15 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో కెప్టెన్ జో రూట్(77), జో డెన్లీ(50) నిలువడంతో ఇంగ్లీష్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. వీరిద్దరు ఔటవడంతో మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ టెయిలెండర్లతో కలిసి అద్భుతమే సృష్టించాడు. ఈ క్రమంలో జానీ బెయిర్‌స్టో(36) ఆసీస్ బౌలర్ల ముందు నిలువలేకపోయాడు. జోష్ హేజిల్‌వుడ్(4/85), నాథన్ లైయన్(2/114) ఇంగ్లాండ్‌ను తమ పదునైన బంతులతో ఇబ్బందిపెట్టారు.

ఆస్ట్రేలియా: 179, 246
ఇంగ్లాండ్: 67, 362/9 (125.4)

2171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles