చాంపియన్‌ చెన్నై

Mon,May 28, 2018 12:47 AM

-ఐపీఎల్‌ సూపర్‌కింగ్స్
-వాట్సన్ సూపర్ సెంచరీ
-ఫైనల్లో హైదరాబాద్‌పై అద్భుత విజయం
-ఐపీఎల్ మూడో టైటిల్ కైవసం
-మహేంద్రుడి ఖాతాలో మూడో టైటిల్..
-రైజ్‌కాని హైదరాబాద్ బౌలర్లు
రెండేండ్ల నిరీక్షణ.. గుండె అనుక్షణం తట్టిలేపిన ప్రతిష్ట.. స్పాట్ ఫిక్సింగ్‌తో మంటకలిసిన పరువు.. వయసు ఎక్కువైందన్న సూటిపోటి మాటలు.. కుర్రాళ్లతో రంకెలేసిన మిగతా ఫ్రాంచైజీలు.. ఇన్ని అపప్రదల మధ్య ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్.. పెను సంచలనం సృష్టించింది. చేజారిపోయిన చరిత్రకు తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ.. రికార్డుల రారాజులమనే పేరును సార్థకం చేసుకుంటూ.. వాంఖడేలో పరుగుల తుఫాన్‌ను సృష్టించింది. లక్ష్యం పెద్దదే అయినా.. ఓటమి భయం వెంటాడినా.. భావోద్వేగాల్లో భాగమై.. సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ.. మాజీ చాంపియన్‌గా తన అనుభవాన్ని రంగరించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మిషేన్ గన్‌గా వాట్సన్ సృష్టించిన భీభత్సానికి సన్ రైజింగ్ కాకుండా మేఘాల్లోకి వెళ్లిపోయింది. విజిల్ పొడు అంటేనే పూనకం వచ్చేలా చెలరేగే చెన్నై అభిమానుల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ.. మహేంద్రుడు ఆడిన మహాన్నాటకంలో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది..!
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చమక్కుమంది. రెండేండ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన చెన్నై తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. లీగ్ ఆద్యంతం సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ తమకు మరెవరు పోటీరారని సాటిచెప్పింది. మిగతా జట్లకు సాధ్యం కాని రీతిలో ఏడోసారి ఫైనల్ చేరిన ధోనీసేన కప్‌తో తమ కలను సాకారం చేసుకుంది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది. హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలోనే అందుకుంది. ఓపెనర్ వాట్సన్(57 బంతుల్లో 117 నాటౌట్, 11ఫోర్లు, 8సిక్స్‌లు) అజేయసెంచరీతో కదం తొక్కాడు. వాట్సన్ విజృంభణతో హైదరాబాద్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తొలుత కెప్టెన్ విలియమ్సన్(47), యూసుఫ్ పఠాన్(45 నాటౌట్) రాణింపుతో హైదరాబాద్ 20 ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. శార్దుల్, కర్ణ్‌శర్మ, బ్రావో, జడేజా, ఎంగ్డీ ఒక్కో వికెట్ తీశారు.
Chennai-Super-Kings
ముంబై: ఆల్‌రౌండ్ షోతో అదురగొట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్-11 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆది నుంచి అంతం వరకు తానొక్కడిగా నిలబడి షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించిన పరుగుల సునామీ హైదరాబాద్‌ను ఉప్పెనలా కమ్మేసింది. దీంతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ధవన్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. తర్వాత చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఈ సీజన్‌లో దుర్భేద్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన సన్ కీలకమైన టైటిల్ పోరులో ఆకట్టుకోలేకపోయింది. వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Watson

దక్కని శుభారంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆకట్టుకునే ఆరంభం దక్కలేదు. చెన్నై బౌలర్ల లైన్‌ను అర్థం చేసుకోలేకపోయిన గోస్వామి (5) రెండో ఓవర్‌లోనే రనౌట్ కావడం.. తర్వాత ధవన్, విలియమ్సన్ కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. చాహర్ వేసిన ఐదో ఓవర్‌లో విలియమ్సన్ ఓ సిక్స్, ఫోర్‌తో 13 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఆ వెంటనే ధవన్ లాంగాన్‌లో చూడముచ్చటగా ఓ సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 7 పరుగుల రన్‌రేట్‌తో 42/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో కర్ణ్ శర్మ (1/25)ను తీసుకొచ్చిన ధోనీ.. కొత్త వ్యూహాన్ని అమలు చేశాడు. రెండోఎండ్‌లో బ్రేవో (1/46)ను విలియమ్సన్ ఓ సిక్స్, ఫోర్‌తో ఉతికేయడంతో వెంటనే జడేజా (1/24)ను రంగంలోకి దించాడు. ఈ వ్యూహం ఫలించి.. 9వ ఓవర్ మూడో బంతికి ధవన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 40 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షకీబ్.. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచినా.. 10 ఓవర్లలో చాహర్ మూడు పరుగులే ఇవ్వడంతో జట్టు స్కోరు 73/2కు చేరింది. 11వ ఓవర్ నుంచి కాస్త సీన్ మారినట్లు కనిపించినా.. విలియమ్సన్ ఔట్‌తో మళ్లీ దెబ్బపడింది.

ఈ ఓవర్‌లో జడేజా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 17, తర్వాత బ్రేవో రెండు ఫోర్లతో 11 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ 13వ ఓవర్ తొలి బంతికే విలియమ్సన్ ఔట్‌కావడంతో మూడో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 101/3 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన యూసుఫ్ పూనకం వచ్చినట్లు చెలరేగాడు. చివరి ఓవర్‌కు క్రీజులో ఉండి దంచి కొట్టాడు. శర్మ, ఠాకూర్ (1/31) బంతులను బౌండరీకి తరలించడంతో 15 ఓవర్లలో హైదరాబాద్ 126 పరుగులు చేసింది. అయితే 16వ ఓవర్‌లో షకీబ్, మరో ఏడు బంతుల తర్వాత దీపక్ హుడా (3) ఔటైనా.. అవతలి వైపు యూసుఫ్ పూర్తిగా గేర్ మార్చాడు. ఇతనికి తోడుగా బ్రాత్‌వైట్ (11 బంతుల్లో 21; 3 సిక్సర్లు) సిక్సర్లతో చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 6, 6, 4, 6, 6తో చివరి నాలుగు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నారు. షకీబ్‌తో నాలుగో వికెట్‌కు 32 పరుగులు జోడించిన యూసుఫ్.. బ్రాత్‌వైట్‌తో కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులు సమకూర్చడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.

Kane-Williamson

మిషేన్ గన్

భారీ లక్ష్యం కండ్ల ముందున్నా.. చెన్నై ఓపెనర్ వాట్సన్ మాత్రం దంచికొట్టాడు. ఆరంభంలో భువనేశ్వర్, సందీప్ (1/52) కొద్దిగా కట్టడి చేసినా.. మ్యాచ్ ముందుకు సాగేకొద్ది తనలోని విశ్వరూపాన్ని చూపెట్టాడు. తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే రావడంతో డు ఫ్లెసిస్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. నాలుగోఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సందీప్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సూపర్‌కింగ్స్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కానీ ఆరో ఓవర్ నుంచి వాట్సన్ మెల్లగా బాదడం షురూ చేశాడు. ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం తీసుకుంటూ తన మజిల్ పవర్‌తో గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లతో బెంబెలేత్తించాడు. రైనా కూడా చేయి వేయడంతో 6, 7 ఓవర్లలో 31 పరుగులు సమకూరాయి. స్కోరు బోర్డులో వేగం పెరుగుతుండటంతో విలియమ్సన్.. రషీద్ చేతికి బంతి ఇచ్చాడు. కానీ ఈ ప్రయోగం ఫలితానివ్వలేదు. కౌల్‌ను లక్ష్యంగా చేసుకుని వాట్సన్ మరో సిక్స్, ఫోర్ బాదడంతో పవర్‌ప్లేలో 35 పరుగులే చేసిన చెన్నై.. తర్వాతి నాలుగు ఓవర్లలో 45 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వాట్సన్ డీప్ బ్యాక్‌వర్డ్ స్కేర్ లెగ్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీ (33 బంతులు) పూర్తి చేసుకున్నాడు. 11.5 ఓవర్లలో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. సందీప్ వేసిన 13వ ఓవర్‌లో వాట్సన్ విధ్వంసం పరాకాష్టకు చేరింది.

ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్, రెండు ఫోర్లతో 27 పరుగులు రాబట్టి చెన్నై శిబిరంలో ఎనలేని ఆనందాన్ని నింపాడు. ఈ జంటను విడదీసేందుకు విలియమ్సన్ వేసిన ఎత్తులు 14వ ఓవర్‌లో ఫలించాయి. బ్రాత్‌వైట్ వేసిన బౌన్సర్‌కు రైనా వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 9.2 ఓవర్లలో 117 పరుగులు జతయ్యాయి. రషీద్ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన రాయుడు (16 నాటౌట్) భువీ బౌలింగ్‌లో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చాడు. వెంటనే రషీద్ బంతిని కవర్స్‌లోకి పంపి వాట్సన్ (51 బంతుల్లో) సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ ఫైనల్ ఛేదనలో ఇదే మొదటి శతకం కావడం విశేషం. అన్ని ఐపీఎల్ ఫైనల్స్‌లో ఇది రెండోది. ఆ వెంటనే వాట్సన్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో చెన్నై విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఏమాత్రం జోరు తగ్గని వాట్సన్ కౌల్ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా, రాయుడు మరో ఫోర్‌తో విజయ లాంఛనాన్ని ముగించాడు. ఓవరాల్‌గా వాట్సన్ ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Sunrisers-hyderabad
ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలి. అదే బ్యాటింగ్‌లో అయితే ఎవరి శైలి వాళ్లకు ఉంటుంది. ఎవరైనా క్రీజులో ఇబ్బందిపడుతుంటే.. రాబోయే బ్యాట్స్‌మన్‌కు కొద్దిగా కష్టమవుతుందని అర్థం. భువీ, రషీద్ చాలా ప్రమాదకారులు. మిడిల్ ఓవర్లలో మా వాళ్లు దంచికొడతారనే నమ్మకం ఉంది. రాయుడు ప్రధాన బ్యాట్స్‌మన్ కాబట్టి బ్రేవోను ముందుగా పంపించాలన్న ప్రణాళికలు లేవు. ప్రతి విజయం ప్రత్యేకమైందే.
- ధోనీ

ఇది పోటి ఇచ్చే స్కోరే. కానీ పిచ్ నుంచి పెద్దగా సహకారం లేదు. మేం మెరుగ్గానే ఆడినా వాట్సన్ ప్రదర్శన అద్భుతం. ఇందుకు సీఎస్‌కేను అభినందించాలి. వాళ్లు అనుభవాన్ని రంగరించారు. మా కుర్రాళ్లు కూడాబాగా పోరాడారు. ఓడినా మాకు ఎన్ని సానుకూల అంశాలు బయటకు వచ్చాయి. మా బౌలింగ్ అటాక్ సూపర్బ్. ఇది మాకు గొప్ప ఆస్థి. అయితే బ్యాట్‌కు, బంతికి సమతూకం తేవడం చాలా కష్టం. ఇందులో మేం కొంతవరకే విజయం సాధించాం.
- విలియమ్సన్
ipl-prizes
prize-money

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: గోస్వామి రనౌట్ 5, ధవన్ (బి) జడేజా 26, విలియమ్సన్ (స్టంప్) ధోనీ (బి) శర్మ 47, షకీబ్ (సి) రైనా (బి) బ్రేవో 23, యూసుఫ్ నాటౌట్ 45, హుడా (సి) (సబ్) షోరే (బి) ఎంగిడి 3, బ్రాత్‌వైట్ (సి) రాయుడు (బి) ఠాకూర్ 21, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 178/6. వికెట్లపతనం: 1-13, 2-64, 3-101, 4-133, 5-144, 6-178. బౌలింగ్: చాహర్ 4-0-25-0, ఎంగిడి 4-1-26-1, ఠాకూర్ 3-0-31-1, కర్ణ్ శర్మ 3-0-25-1, బ్రేవో 4-0-46-1, జడేజా 2-0-24-1.

చెన్నై సూపర్‌కింగ్స్: వాట్సన్ నాటౌట్ 117, డు ఫ్లెసిస్ (సి అండ్ బి) సందీప్ 10, రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 32, రాయుడు నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 18.3 ఓవర్లలో 181/2. వికెట్లపతనం: 1-16, 2-133. బౌలింగ్: భువనేశ్వర్ 4-1-17-0, సందీప్ 4-0-52-1, కౌల్ 3-0-43-0, రషీద్ ఖాన్ 4-1-24-0, షకీబ్ 1-0-15-0, బ్రాత్‌వైట్ 2.3-0-27-1.

4439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles