రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

Sat,March 23, 2019 11:04 PM

chennai super kings win over royal challengers bangalore

- బెంగళూరుపై బోణీ హర్భజన్, తాహిర్ విజృంభణ
- 70కే కుప్పకూలిన కోహ్లీసేన


చెన్నై..చెన్నై..నామస్మరణతో చిదంబరం స్టేడియం హోరెత్తిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్..ఐపీఎల్‌ను అదిరిపోయే బోణీతో ఆరంభించింది. సొంత ఇలాఖాలో ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంటూ విజయదుందుభి మోగించింది. వేలాది మంది ప్రేక్షకుల మద్దతు మధ్య బెంగళూరుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఘనవిజయంతో లీగ్‌లో శుభారంభం చేసింది. హర్భజన్‌సింగ్, ఇమ్రాన్ తాహిర్, జడేజా స్పిన్ విజృంభణతో 70 పరుగులకే కోహ్లీసేన కుప్పకూలింది. భారీ హిట్టర్లకు పేరుగాంచిన బెంగళూరును వందలోపే కుప్పకూలుస్తూ చెన్నై మీసం మేలేసింది. చెన్నై స్పిన్ త్రయం ధాటికి కెప్టెన్ కోహ్లీతో సహా డివిలీయర్స్, హెట్మెయిర్, అలీ సింగిల్ డిజిట్ స్కోర్లకే చాపచుట్టేశారు. భజ్జీ టాపార్డర్ భరతం పడితే..మిడిలార్డర్‌ను తాహిర్, జడేజా కుప్పకూల్చారు. ఫలితంగా లీగ్ చరిత్రలోనే బెంగళూరు ఆరో అత్యల్ప స్కోరును మూటగట్టుకుంది. స్వల్ప లక్ష్యఛేదనలో రాయుడు, రైనా రాణింపుతో చెన్నై గట్టెక్కింది. కోహ్లీసేన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.

చెన్నై: ఐపీఎల్ 12వ సీజన్‌కు శనివారం తెరలేసింది. గత సీజన్లకు భిన్నంగా నిరాడంబరంగా మొదలైన లీగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 70 పరుగల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో ఛేదించింది. రాయుడు(28), రైనా(19) జట్టు విజయంలో కీలకమయ్యారు. పిచ్ పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తూ జట్టు విజయంలో భాగమయ్యారు. చాహల్(1/6), అలీ(1/19), సిరాజ్(1/5) ఒక్కో వికెట్ తీశారు. తొలుత హర్భజన్‌సింగ్(3/20), తాహిర్(3/9), జడేజా(2/15) ధాటికి బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్‌పటేల్(29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్భజన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

బెంగళూరు బేజారు

ఈసారైనా కప్ గెలిచి తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకుందామనుకున్న బెంగళూరు ఆశలు అడిఆశలయ్యేలా కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఏమాత్రం తడబాటు లేకుండా లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పిచ్ పరిస్థితులను తగ్గట్లుగా హర్భజన్ సింగ్(3/ 20), తాహిర్(3/9), జడే జా(2/15) విజృంభణతో బెంగళూరు 70 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. జట్టు లో పార్థిప్‌పటేల్(29) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. భీకరమైన బ్యాట్స్‌మెన్‌కు మారుపేరైనా బెంగళూరు.. చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చిగురుటాకులా వణికిపోయింది. తొలి రెండు ఓవర్లలో 15 పరుగులకే పరిమితమైన ఆర్‌సీబీకి మూడో ఓవర్లో కెప్టెన్ కోహ్లీ(6) రూపంలో షాక్ తగిలింది. హర్భజన్‌సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కోహ్లీ..డీప్ మిడ్‌వికెట్‌లో జడేజా చేతికి చిక్కాడు. విరాట్ నిష్క్రమణతో చెన్నై చిదంబరం స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మొయిన్ అలీ(9) సిక్స్‌తో ఊపుమీద కనిపించినా..భజ్జీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. పిచ్‌పై పూర్తి పట్టు సాధించిన హర్భజన్...అదే జోరులో ఎనిమిదో ఓవర్లో ఏబీ డివిలీయర్స్(9)ను పెవిలియన్‌కు పంపాడు.

అంతకుముందు బంతికే ఔట్ నుంచి బయటపడ్డ డివిలీయర్స్..భారీ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్ చివరి బంతికి హెట్మెయిర్(0) రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రైనా సూపర్‌త్రోతో హెట్మెయిర్ పరుగుల ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ఇలా దాదాపు ఓవర్‌కో వికెట్ చొప్పున కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. భజ్జీ జోరును అందిపుచ్చుకున్న తాహిర్ సుడులు తిరిగే స్పిన్‌తో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తన తొలి ఓవర్ రెండో బంతికే దూబే(2)ను ఔట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు. మరోవైపు జడేజా కూడా జత కలువడంతో బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆదుకుంటాడనుకున్న ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమీ(4)ని జడేజా ఔట్ చేయడంతో ఆర్‌సీబీ ఖేల్ ఖతమైంది. ఆ తర్వాత నవదీప్‌సైనీ(2), చాహల్(4), ఉమేశ్(1) వెంటవెంటనే నిష్క్రమించగా, పటేల్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

రాయుడు రాణించగా

స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలో కలిసిరాలేదు. చాహల్ తన తొలి ఓవర్‌ను మెయిడిన్ చేసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు. ఏడో బంతికి స్కోరుబోర్డు ఖాతా తెరిచిన ధోనీసేనకు మూడో ఓవర్లో వాట్సన్(0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. చాహల్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోని వాట్సన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓవైపు పరుగుల రాక మందగించడంతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి అంతకంతకు పెరుగుకుంటూపోయింది. ఈ క్రమంలో భారీ షాట్ ఆడబోయిన రాయుడు(28) ఇచ్చిన క్యాచ్‌ను స్కేర్ లెగ్‌లో ఉమేశ్ విడిచిపెట్టడంతో బతికిపోయాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 16 పరుగులకే పరిమితమైంది. చెన్నై ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే మొత్తమ్మీద ఒకే ఒక సిక్స్ నమోదు కావడం విశేషం. కెప్టెన్ కోహ్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాట్స్‌మెన్ చేసేదేమి లేక చేష్టలుడిగిపోయారు. అయితే మొయిన్ అలీ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో ఆకట్టుకున్న రైనా (19).సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ దగ్గర దూబేకు దొరికిపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్‌లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. రైనా తర్వాత రంగంలోకి దిగిన కేదార్ జాదవ్(13నాటౌట్) రాయుడికి జతకలిశాడు.

ఉమేశ్ 11వ ఓవర్ చివరి బంతిని జాదవ్ బౌండరీగా మలిచిన తీరు మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. కోహ్లీ అదే రీతిలో ఒత్తిడి పెంచుకుంటూ పోవడంతో అడపాదడపా బౌండరీలు మినహా సింగిల్స్ రాక కష్టమైంది. ముఖ్యంగా చాహల్ తనదైన రీతిలో చెన్నై జోరును అడ్డుకోవడంలో కీలకమయ్యాడు. నాలుగోవర్లలో ఒక మెయిడిన్‌తో పాటు వికెట్ తీసి 6 పరుగులే ఇచ్చుకున్నాడు. బౌలింగ్ మార్పు గా వచ్చిన మహ్మద్ సిరాజ్ (1/5) రాయుడును క్లీన్‌బౌల్డ్ చేశాడు. జాదవ్‌తో కలిసి జడేజా(5 నాటౌ ట్) గెలుపు తీరాలకు చేర్చాడు. నిర్దేశించింది స్వల్ప లక్ష్యమైనా..బెంగళూరు కడదాకా పోరాడిన తీరు ఆకట్టుకుంది.

8 బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు పడగొట్టిన వికెట్లు. 2012లో దక్కన్ చార్జర్స్‌పై తాము నమోదు చేసిన రికార్డును చెన్నై తిరిగి సమం చేసింది.

1 ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా సురేశ్ రైనా(5004) నిలిచాడు. 177 మ్యాచ్‌ల్లో రైనా ఈ ఫీట్ అందుకున్నాడు.

స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ(సి)జడేజా(బి)హర్భజన్‌సింగ్ 6, పార్థివ్‌పటేల్ (సి)జాదవ్(బి)బ్రావో 29, అలీ(సీ&బీ) హర్భజన్ 9, డివిలీయర్స్(సి)జడేజా(బి)హర్భజన్ 9, హెట్మెయిర్(రనౌట్) 0, దూబే(సి)వాట్సన్(బి)ఇమ్రాన్ తాహిర్ 2, గ్రాండ్‌హోమ్(సి)ధోనీ(బి)జడేజా 4, సైనీ(సి)వాట్సన్(బి)తాహిర్ 2, చాహల్(సి)హర్బజన్(సి)తాహిర్ 4, ఉమేశ్ (బి) 1, సిరాజ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17.1 ఓవర్లలో 70 ఆలౌట్; వికెట్ల పతనం: 1-6, 2-28, 3-38, 4-39, 5-45, 6-50, 7-53, 8-59, 9-70, 10-70; బౌలింగ్: చాహర్ 4-0-17-0, హర్భజన్‌సింగ్ 4-0-20-3, రైనా 1-0-6-0, తాహిర్ 4-1-9-3, జడేజా 4-0-15-2, బ్రావో 0.1-0-0-1.

చెన్నై: వాట్సన్(బి)చాహల్(0), రాయు డు 28, రైనా(సి)దూబే(బి)అలీ 19, జాదవ్ 13 నాటౌట్, జడేజా 6 నాటౌట్, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17.4 ఓవర్లలో 71/3; వికెట్ల పతనం: 1-8, 2-40, 3-59; బౌలింగ్: చాహల్ 4-1-6-1, సైనీ 4-0-24-0, అలీ 4-0-19-1, ఉమేశ్ 3-0-13-0, సిరాజ్ 2-1-5-1, దూబే 0.4-0-3-0.

3439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles