రాజస్థాన్‌పై 6 వికెట్లతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

Tue,April 23, 2019 04:31 AM

Delhi Capitals beat Rajasthan Royals by 6 wickets

-ఢిల్లీ ‘వన్’
-రాజస్థాన్‌పై 6 వికెట్లతో నెగ్గిన క్యాపిటల్స్
-మెరిసిన పంత్, ధవన్
-రహానే సెంచరీ వృథా
టెస్టు బ్యాట్స్‌మన్ అని ముద్రపడ్డ అజింక్యా రహానే (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసినా.. యంగ్ గన్స్‌తో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఆ లక్ష్యం సరిపోలేదు. ఒకరి తర్వాత ఒకరు వంతులేసుకొని బాదడంతో పెద్ద లక్ష్యం కూడా చిన్నబోయింది. ధవన్ (27బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు పృథ్వీ షా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడ.. రిషబ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో క్యాపిటల్స్ అలవోకగా నెగ్గి టేబుల్ టాపర్‌గా నిలిచింది.

జైపూర్: భారీ లక్ష్యం ముందున్నా అదరక బెదరక నిలిచిన ఢిల్లీ అలవోక విజయం సాధించింది. ప్రత్యర్థి ఎవరైనా.. టార్గెట్ ఎంతైనా.. సమిష్టిగా కదంతొక్కితే విజయం నల్లేరుపై నడకే అని మరోసారి చాటింది. ఈ సీజన్‌లో పేరు మార్చుకొని బరిలో దిగి తొలిసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. అజింక్యా రహానే (105 నాటౌట్) అజేయ సెంచరీకి స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ శతకం తోడవడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శిఖర్ ధవన్ (54), పృథ్వీ షా (42)తో పాటు రిషబ్ పంత్ (78 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ధవన్, పంత్ వీరవిహారం:

భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఢిల్లీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలి బంతి నుంచే తన ఉద్దేశం చాటిన ధవన్ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ఢిల్లీవైపు తిప్పాడు. బంతి ఎవరేసినా.. ఎక్కడేసినా.. దాని గమ్యస్థానం మాత్రం బౌండ్రీనే అన్నచందంగా విజృంభించాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే ధవన్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టడం విశేషం. 25 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న ధవన్ ఇన్నింగ్స్‌కు పటిష్ట పునాధి వేసి గోపాల్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) అతడిని అనుసరించాడు. ఈ దశలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి యంగ్‌తరంగ్ పంత్ ఇరగదీశాడు. ఈ జోడీ ఎక్కడా తగ్గకపోవడంతో ఢిల్లీ 12వ ఓవర్లోనే సెంచరీ మార్క్ దాటింది. మూడో వికెట్‌కు 48 బంతుల్లో 84 పరుగులు జతచేశాక షా వెనుదిరిగాడు. రూథర్‌ఫోర్డ్ (11) కూడా త్వరగానే ఔటైనా.. ఇంగ్రామ్ (3)తో కలిసి ఒత్తిడిని దరిచేరనివ్వని పంత్ భారీషాట్లతో మిగతా పని పూర్తిచేశాడు.

rahane

రెచ్చిపోయిన రహానే:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్ మొత్తం రహానే చుట్టే తిరిగింది. ఓపెనర్‌గా వచ్చిన అజింక్యా ఆఖరిదాక నిలబడి రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు. రెండో ఓవర్‌లో లేని పరుగు కోసం యత్నించిన శాంసన్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి ఢిల్లీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయిన తాజా మాజీ కెప్టెన్ రహానే ఎడాపెడా బౌండ్రీలతో స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. మరో ఎండ్ నుంచి స్మిత్ చక్కటి సహకారం అందించడంతో రహానే దూకుడుకు ఎదురులేకుండా పోయింది. అక్షర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన రహానే.. రబడ ఓవర్‌లో 6,4 బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాయల్స్ 52/1తో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని అజింక్యా రబడ ఓవర్‌లో ఒకటి, అక్షర్ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న జింక్స్ దూకుడుగా ఆడుతుంటే.. అప్పటివరకు అతడికే ఎక్కువ స్ట్రయికింగ్ వచ్చేలా చూసిన స్మిత్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.

అమిత్ మిశ్రా బౌలింగ్ లో మూడు ఫోర్లతో ఫుల్‌స్వింగ్‌లోకి వచ్చాడు. దీంతో రాజస్థాన్ 10.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. రూథర్‌ఫోర్డ్ ఓవర్‌లో స్మిత్ హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడితే.. మోరిస్ ఓవర్‌లో రహానె 6,4 అందుకున్నాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న స్మిత్ లాంగాఫ్‌లో మోరిస్ పట్టిన చక్కటి క్యాచ్‌కు రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ ఔటైనా.. ఏ మాత్రం వెనక్కి తగ్గని రహానే 15 ఓవర్లలో జట్టు స్కోరు 150 దాటించాడు. ఈ దశలో స్టోక్స్ (8) ఇలా వచ్చి అలా వెళ్తే.. ఆస్టన్ టర్నర్ (0) ముచ్చటగా మూడోసారి సున్నా చుట్టాడు. అయినా ఎక్కడా తగ్గని రహానే 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బిన్నీ (19) ఫర్వాలేదనిపించాడు.

సెంచరీ అచ్చిరానట్లుంది

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌కు సెంచరీలు అచ్చిరావడం లేనట్లుంది. ఈ సీజన్‌లో రాయల్స్ తరఫున రెండు సెంచరీలు నమోదైతే.. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. లీగ్ ఆరంభంలో సన్‌రైజర్స్ ఓపెనర్ వార్నర్ విధ్వంసం ముందు సంజూ శాంసన్ సెంచరీ చిన్నబోతే.. తాజా మ్యాచ్‌లో ధవన్, పంత్ మెరుపులతో రహానే శతకం కళతప్పింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్ రాయల్స్: రహానే (నాటౌట్) 105, శాంసన్ (రనౌట్/రబడ) 0, స్మిత్ (సి) మోరిస్ (బి) అక్షర్ 50, స్టోక్స్ (సి) శ్రేయస్ (బి) మోరిస్ 8, టర్నర్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) ఇషాంత్ 0, బిన్నీ (బి) రబడ 19, పరాగ్ (బి) రబడ 4, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 191/6. వికెట్ల పతనం: 1-5, 2-135, 3-157, 4-163, 5-187, 6-191, బౌలింగ్: ఇషాంత్ 4-0-29-1, రబడ 4-0-37-0, అక్షర్ 4-0-39-1, మిశ్రా 3-0-28-0, మోరిస్ 4-0-41-0, రూథర్‌ఫోర్డ్ 1-0-16-0.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి) పరాగ్ (బి) గోపాల్ 42, ధవన్ (స్టంప్డ్) శాంసన్ (బి) గోపాల్ 54, శ్రేయస్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 4, పంత్ (నాటౌట్) 78, రూథర్‌ఫోర్డ్ (సి) పరాగ్ (బి) కులకర్ణి 11, ఇంగ్రామ్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 19.2 ఓవర్లలో 193/4. వికెట్ల పతనం: 1-72, 2-77, 3-161, 4-175, బౌలింగ్: బిన్నీ 1-0-3-0, కులకర్ణి 4-0-51-1, ఉనాద్కట్ 3.2-0-36-0, గోపాల్ 4-0-47-2, ఆర్చర్ 4-0-31-0, పరాగ్ 3-0-25-1.

ipl-table

ipl-runs-wickets

5053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles