బెంగళూరు ఆశలు గల్లంతు

Mon,April 29, 2019 03:16 AM

Delhi Capitals Beat Royal Challengers Bangalore Seal Playoff Berth

-అర్హత సాధించిన ఢిల్లీ జట్టు
-బెంగళూరు ఆశలు గల్లంతు
-చెలరేగిన ధవన్, శ్రేయాస్

న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఏడేండ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. శిఖర్ ధవన్ (37 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయాస్ అయ్యర్ (37 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 16 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. దీంతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ఢిల్లీ (16 పాయింట్లు) ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నది. మరోవైపు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 పరాజయాలతో బెంగళూరు నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

కీలక భాగస్వామ్యం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఉమేశ్ బంతిని ఓవర్ కవర్‌లో కొట్టి తొలి బౌండరీ సాధించిన ధవన్ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. రెండోఎండ్‌లో పృథ్వీ షా (18) కూడా నాలుగు ఫోర్లు బాది ప్రమాదకరంగా కనిపించినా.. ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో ఉమేశ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన అయ్యర్ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. ఐదో ఓవర్‌లో సిక్సర్‌తో ఊపు తెచ్చిన ధవన్ పవర్‌ప్లేలో జట్టు స్కోరును 59/1కు చేర్చాడు. చాహల్ వేసిన ఏడో ఓవర్‌లో అయ్యర్ తొలి సిక్స్ బాదాడు. ఈ ఇద్దరి సమన్వయంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఫలితంగా తొలి 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 88/1కు చేరింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు కోహ్లీ ఎక్కువగా స్పిన్నర్లను ప్రయోగించాడు.

ఈ వ్యూహం 13వ ఓవర్‌లో ఫలించింది. చాహల్ బంతిని స్లాగ్ స్వీప్ చేయబోయి శిఖర్ షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తన తర్వాతి ఓవర్ (15వ)లో రెండు సిక్సర్లు సమర్పించుకున్న చాహల్.. ఐదో బంతికి డేంజర్ మ్యాన్ పంత్ (7)ను వెనక్కి పంపి సంబురాలు చేసుకున్నాడు. నాలుగు బంతుల తర్వాత అయ్యర్, 17వ ఓవర్‌లో ఇంగ్రామ్ (11) కూడా ఔటయ్యాడు. ఓవరాల్‌గా 13 బంతుల తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడింది. చివర్లో రూథర్‌ఫోర్డ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు).. 3 సిక్సర్లు, 4 ఫోర్లు బాది బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

బ్యాటింగ్ వైఫల్యం..

188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. పార్థివ్ పటేల్ (20 బంతుల్లో 39, 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. స్టోయినిస్ (24 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆరంభంలో ఢిల్లీ బౌలింగ్‌పై ఎదురుదాడి చేసిన పార్థివ్.. కోహ్లీతో కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. విరాట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్ నుంచి బయటపడినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఎనిమిదో ఓవర్‌లో అక్షర్ పటేల్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. పవర్‌ప్లేలో 64/1 స్కోరు చేసిన ఆర్‌సీబీ తొలి 10 ఓవర్లలో 90/2కు చేరింది.

డివిలియర్స్ (17), దూబే (24) సిక్సర్లతో రెచ్చిపోయినా.. ఢిల్లీ బౌలర్ల పోరాటం ముందు వరుస విరామాల్లో వికెట్లు సమర్పించుకున్నారు. 12వ ఓవర్‌లో అక్షర్ బౌండరీ లైన్ వద్ద కండ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో ఏబీ నిష్క్రమించాడు. 13వ ఓవర్‌లో క్లాసెన్ (3), దూబే ఔట్ కావడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. విజయానికి చివరి 5 ఓవర్లలో 62 పరుగులు కావాల్సిన దశలో ఢిల్లీ బౌలర్లు రబడ (2/31), మిశ్రా (2/29), అక్షర్ పటేల్ (1/26) కొట్టిన దెబ్బకు ఆర్‌సీబీ తలవంచింది. ఓ ఎండ్‌లో స్టోయినిస్ విజృంభించినా.. రెండో ఎండ్‌లో గురుకీరత్ (27), సుందర్ (1) తక్కువ స్కోరుకే ఔట్‌కావడంతో బెంగళూరుకు పరాజయం తప్పలేదు.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథీ షా (సి) పార్థివ్ (బి) ఉమేశ్ 18, ధవన్ (సి) సుందర్ (బి) చాహల్ 50, అయ్యర్ (సి) కోహ్లీ (బి) సుందర్ 52, రిషబ్ ఎల్బీ (బి) చాహల్ 7, ఇంగ్రామ్ (సి) సుందర్ (బి) షైనీ 11, రూథర్‌ఫోర్డ్ నాటౌట్ 28, అక్షర్ పటేల్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 187/5. వికెట్లపతనం: 1-35, 2-103, 3-127, 4-129, 5-141.బౌలింగ్: ఉమేశ్ 4-0-30-1, సుందర్ 4-0-29-1, చాహల్ 4-0-41-2, సైనీ 4-0-44-1, స్టోయినిస్ 3-0-24-0, దుబే 1-0-5-0.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ (సి) పటేల్ (బి) రబడ 39, కోహ్లీ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) పటేల్ 23, డివిలియర్స్ (సి) పటేల్ (బి) రూథర్‌ఫోర్డ్ 17, దూబే (సి) ధవన్ (బి) మిశ్రా 24, క్లాసెన్ (సి) పంత్ (బి) మిశ్రా 3, గురుకీరత్ సింగ్ (సి) పంత్ (బి) శర్మ 27, స్టోయినిస్ నాటౌట్ 32, సుందర్ (సి) అయ్యర్ (బి) రబడ 1, ఉమేశ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 171/7. వికెట్లపతనం: 1-63, 2-68, 3-103, 4-108, 5-111, 6-160, 7-164. బౌలింగ్: ఇషాంత్ 4-0-40-1, అక్షర్ 4-0-26-1, లామిచానె 3-0-36-0, రబడ 4-0-31-2, మిశ్రా 4-0-29-2, రూథర్‌ఫోర్డ్ 1-0-6-1.

ipl-table

ipl-runs-wickets

4185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles