పోరాడి ఓడిన హైదరాబాద్

Thu,May 9, 2019 04:37 AM

-రైజర్స్ నాకౌట్
-ఢిల్లీని గెలిపించిన పృథ్వీ, పంత్
-ఫైనల్ బెర్త్ కోసం చెన్నైతో పోటీ
అదృష్టం కలిసొచ్చి ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అచ్చొచ్చిన స్టేడియం, సొంత ప్రేక్షకులు ఇవేవి రైజర్స్ రాత మార్చలేకపోయాయి. తలాకొన్ని పరుగులు చేసి ఓ మోస్తరు లక్ష్యాన్ని విధిస్తే.. బౌలర్లు తమ వంతు ప్రయత్నించారు. కానీ ఢిల్లీ దూకుడు ముందు అది సరిపోలేదు. యంగ్ తరంగ్ పృథ్వీ షా(38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకానికి పంత్ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరాక్రమం తోడవడంతో సునాయాసంగా గెలిచిన క్యాపిటిల్స్ క్వాలిఫయర్-2లో చెన్నైతో ఢీకొట్టేందుకు రెడీ అయితే.. రైజర్స్ నిరాశగా ఇంటిదారిపట్టింది.

విశాఖపట్నం: క్వాలిఫయర్-2 కు అర్హత సాధించాలంటే కచ్చితం గా గెలువాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ బోల్తాకొట్టింది. బుధవారం ఇక్కడ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. గప్టిల్ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. పృథ్వీ షా హాఫ్ సెంచరీకి ... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ మెరుపులు తోడవడంతో ఛేదన పెద్ద కష్టం కాలేదు.ఈ విజయంతో ముందడుగు వేసిన క్యాపిటల్స్ శుక్రవారం ఇక్కడే జరుగనున్న క్వాలిఫయర్-2లో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

Prithvi

పృథ్వీ షోస్టార్టింగ్

వచ్చిరావడంతోనే శిఖర్ ధవన్ (17; 3 ఫోర్లు) తన ఉద్దేశం చాటాడు. తొలి ఓవర్‌లో పాత సహచరుడు భువనేశ్వర్‌కు 2 ఫోర్లతో స్వాగతం పలికాడు. నేను మాత్రం తక్కువా అన్నట్లు మూడో ఓవర్లో పృథ్వీ షా 3 ఫోర్లు అరుసుకున్నాడు. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద థంపీ క్యాచ్ వదిలేయడంతో బతికి పోయిన పృథ్వీ షా.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. భువీ ఓవర్‌లో 4,6,4తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించాక సాహా చేసిన మెరుపు స్టంపింగ్‌కు ధవన్ పెవిలియన్ బాటపడితే.. పృథ్వీ షా 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8)తో పాటు పృథ్వీని ఒకే ఓవర్‌లో ఔట్ చేసిన ఖలీల్ సన్‌రైజర్స్‌ను రేసులోకి తెచ్చాడు. ఆరంభంలో ఇబ్బంది పడ్డ మున్రో (14) 4,6తో టచ్‌లోకి వచ్చాడు. ఈ దశలో రషీద్ మున్రోతో పాటు అక్షర్ పటేల్‌ను పెవిలియన్ బాటపట్టించి విజయంపై ఆశలు పెంచాడు.

srh
ఢిల్లీ విజయానికి 3 ఓవర్లలో 00 పరుగులు కావాల్సిన దశలో థంపీ వేసిన 18వ ఓవర్‌లో రిషభ్ పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయాడు. 4,6,4,6తో స్టేడియాన్ని హోరెత్తించాడంతో పాటు లక్ష్యాన్ని 12 బంతుల్లో 12కు చేర్చాడు. మరుసటి ఓవర్‌లో 7 పరుగులిచ్చిన భువీ రూథర్‌ఫోర్డ్ (9), పంత్‌ను ఔట్‌చేశాడు. ఆరు బంతుల్లో 5 చేయాల్సిన దశలో బంతి బంతికి హైడ్రామా సాగింది. తొలి బాల్ వైడ్ కావడంతో ముందే అదనపు పరుగు వచ్చింది. ఇక అక్కడి నుంచి కట్టడి చేసిన ఖలీల్ నాలుగో బంతికి అమిత్ మిశ్రా (1)ను ఔట్‌చేశాడు. పరుగు పూర్తి చేసే క్రమంలో మిశ్రా వికెట్లకు అడ్డుగా పరిగెత్తడంతో గురిచూసి రనౌట్ చేయలేకపోయిన ఖలీల్ ఈ అంశంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వికెట్లకు అడ్డంగా పరిగెత్తినట్లు గుర్తించిన థర్డ్ అంపైర్ మిశ్రాను ఔట్‌గా ప్రకటించాడు. ఇక రెండు బంతుల్లో 2 పరుగులు కవాల్సిఉండగా.. ఐదోబంతికి పాల్ (5 నాటౌట్) ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.

తలాకొన్ని పరుగులు

గత కొన్ని మ్యాచ్‌లుగా చక్కటి ప్రదర్శన చేస్తూ వస్తున్న వృద్ధిమాన్ సాహా (8) తడబడ్డాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికి.. రివ్యూ సాయంతో బతికిపోయితన అతడు లైఫ్‌ను వినియోగించుకోలేకపోయాడు. మరో వైపు మార్టిన్ గప్టిల్ భారీ సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తన న్యూజిలాండ్ సహచరుడు బౌల్ట్‌కు 2 సిక్సర్లు బాదిన గప్టిల్.. ఇషాంత్, అక్షర్‌కు చెరోటి రుచి చూపించాడు. మరో ఎండ్‌లో మనీశ్ పాండే చక్కటి సహకారం అందించడంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్‌లో హైదరాబాద్‌కు పెద్ద దెబ్బ పడింది. సిక్సర్లతో విజృంభిస్తున్న గప్టిల్ మరో భారీ షాట్ కొట్టే యత్నంలో పాల్‌కు చిక్కాడు. ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్ వేగం మందగించింది. కెప్టెన్ విలియమ్సన్ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), పాండే మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల రాక కష్టమైంది.

వీరిద్దరూ క్రీజులో ఉన్న ఎనిమిది ఓవర్లలో కేవలం ఒక్క బౌండ్రీ మాత్రమే నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా గేర్ మారుస్తాడేమో అనుకుంటున్న సమయంలో పాండే ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎట్టకేలకు 15వ ఓవర్లో రైజర్స్ స్కోరు 100 దాటింది. కాసేపటికే కేన్ కూడా ఔటయ్యాడు. ఆఖర్లో విజయ్ శంకర్ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నబీ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరగులు సాధించడంతో రైజర్స్ మంచి స్కోరు చేయగలిగింది. బౌల్ట్ ఓవర్‌లో 4, 6 బాదిన శంకర్ మరో భారీ షాట్‌కు యత్నించి బౌండ్రీ వద్ద అక్షర్ చేతికి చిక్కితే.. చివరి ఓవర్‌లో లాంగాన్‌పై నుంచి కండ్లు చెదిరే సిక్సర్ కొట్టిన నబీ కూడా అక్షర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస బంతుల్లో హుడా (4), రషీద్ ఖాన్ (0) కూడా ఔటయ్యారు.

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: సాహా (సి) అయ్యర్ (బి) ఇషాంత్ 8, గప్టిల్ (సి) పాల్ (బి) మిశ్రా 36, పాండే (సి) రూథర్‌ఫోర్డ్ (బి) పాల్ 30, విలియమ్సన్ (బి) ఇషాంత్ 28, శంకర్ (సి) అక్షర్ (బి) బౌల్ట్ 25, నబీ (సి) అక్షర్ (బి) పాల్ 20, హుడా (రనౌట్/పంత్) 4, రషీద్ (సి) పంత్ (బి) పాల్ 0, భువనేశ్వర్ (నాటౌట్) 0, థంపీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 162/8. వికెట్ల పతనం: 1-31, 2-56, 3-90, 4-111 , 5-147, 6-160, 7-161, 8-161, బౌలింగ్: బౌల్ట్ 3-0-37-1, ఇషాంత్ 4-0-34-2, అక్షర్ 4-0-30-0, మిశ్రా 4-0-16-1, పాల్ 4-0-32-3, రూథర్‌ఫోర్డ్ 1-0-11-0.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా , ధవన్ (స్టంప్డ్) సాహా (బి) హుడా 17, అయ్యర్ (సి) సాహా (బి) ఖలీల్ 8, పంత్ (సి) నబీ (బి) భువనేశ్వర్ 49, మున్రో (ఎల్బీ) రషీద్ 14, అక్షర్ (సి) సాహా (బి) రషీద్ 0, రూథర్‌ఫోర్డ్ (సి) నబీ (బి) భువనేశ్వర్ 9, పాల్ (నాటౌట్) 5, మిశ్రా (అబస్ట్రకింగ్ ది ఫీల్డ్ ఔట్) 1, బౌల్ట్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.5 ఓవర్లలో 165/8. వికెట్ల పతనం: 1-66, 2-84, 3-87, 4-111, 5-111, 6-151, 7-158, 8-161, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-42-2, నబీ 4-0-29-0, ఖలీల్ 2.5-0-24-2, రషీద్ 4-1-15-2, థంపీ 4-0-41-1, హుడా 1-0-13-1.

8537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles