హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ నేడు

Wed,May 8, 2019 02:08 AM

IPL 2019 Eliminator Delhi Capitals vs Sunrisers Hyderabad

-క్వాలిఫయర్-2 బెర్తు ఎవరిదో
-అమీతుమీ
-రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లోప్రత్యక్ష ప్రసారం

పేరు మారడంతోనే ఫేటూ మారింది. కొత్త సీజన్.. కొత్త జెర్సీలు.. సరికొత్త యాజమాన్యం. అదరగొడుతున్న కుర్రాళ్లకు గబ్బర్ గర్జన తోడైతే.. తెరవెనుక రికీ, దాదా అండయ్యారు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో విజృంభించి ఏడేండ్ల తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్థానమిది. గతేడాది నిలకడైన ప్రదర్శనతో ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై బోల్తా కొట్టి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బౌలింగ్‌లో ది బెస్ట్‌అనే ముద్రకు తోడు.. ఈ ఏడాది వార్నర్, బెయిర్‌స్టో సుడిగాలి ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో వరుస విజయాలు సాధించింది. అయితే కీలక నాకౌట్‌కు ముందు పరుగుల వీరులుస్వదేశాలకు వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటి వరకు భళా అనిపించిన బ్యాటింగ్ ఆర్డర్ బేలగా మారింది. ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడినా అదృష్టం కలిసి రావడంతోప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇది లీగ్‌లో సన్‌రైజర్స్ జర్నీ.ఇలాంటి రెండు జట్ల మధ్య వైజాగ్‌లో బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. గెలిచి దుకెళ్లేదెవరో.. ఓడి నిష్క్రమించేదెవరో తేల్చేసే కీలక పోరు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడితే రైజర్స్‌పై నెగ్గడం ఢిల్లీకి పెద్ద కష్టమేమీ కాదు. బౌలర్ల విజృంభణకు బ్యాట్స్‌మెన్ తమవంతు సహకారం అందిస్తే.. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌ను చూడొచ్చు.

విశాఖపట్నం: చిన్న స్కోర్లను కాచుకుంటుందనే ముద్ర పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అలాంటి మ్యాజిక్‌లు చేయలేకపోయింది. బ్యాటింగ్ బలంతోనే నాకౌట్ చేరింది. ఏడాది నిషేధం తర్వాత బరిలో దిగిన వార్నర్ ఆకలిగొన్న పులిలా విజృంభిస్తే.. తొలిసారి లీగ్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో అగ్నికి ఆజ్యం తోడైనట్లు చెలరేగాడు. వీరిద్దరి దూకుడుతో మిడిలార్డర్ వైఫల్యం మరుగున పడింది. వాళ్లు దూరమయ్యాకగానీ మన డొల్లతనమేంటో తెలిసిరాలేదు. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా లీగ్ చరిత్రలో తొలిసారి 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్టుగా రైజర్స్ నిలిచింది. ఇక్కడి నుంచి ముందడుగు వేయాలంటే శక్తికి మించి పోరాడక తప్పదు. బుధవారం విశాఖ వేదికగా బరిలో దిగనుండటం రైజర్స్‌కు అనుకూలాంశం. గతేడాది వరకు హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధవన్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టుకి ప్రధాన బలమయ్యాడు. అతడిని ఎంత త్వరగా పెవిలియన్ పంపిస్తే.. హైదరాబాద్ విజయావకాశాలు అంతగా మెరుగవుతాయి. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరినా.. రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఢిల్లీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తున్నది. ఈ సీజన్‌లో ఎదురుపడ్డ రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ, హైదరాబాద్ చెరోసారి గెలిచాయి.

వారిద్దరి గైర్హాజరీలో..

ఓపెనర్లు సాహా, గప్టిల్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా సాహా ఉన్నంత సేపు బ్యాట్‌కు పనిచెప్తూ రెచ్చిపోతున్నాడు. వన్‌డౌన్‌లో మనీశ్ పాండే, ఆ తర్వాత విలియమ్సన్.. అంతే రైజర్స్ బ్యాటింగ్ గురించి ఇక్కడి వరకే చెప్పుకోవాలేమో. త్రి డైమెన్షన్ ప్లేయర్ విజయ్ శంకర్ జట్టులో ఉన్నాడో లేదో కూడా అర్థం కావడం లేదంటే.. అతడి ప్రదర్శన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అవసరమైన సమయంలో మిడిలార్డర్‌లో పట్టుమని పది బంతులు ఆడే బ్యాట్స్‌మెన్ కనిపించకపోవడం రైజర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ. హుడా, పఠాన్, రికీ భుయ్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కీలక మ్యాచ్‌లో శంకర్‌తో పాటు వీళ్లు కూడా రాణిస్తే.. రైజర్స్ కష్టాలు కొంతలో కొంత తీరుతాయి. బౌలింగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ ద్వయం రషీద్, నబీపైనే భారం. వీరిద్దరు వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఏస్ బౌలర్ భువనేశ్వర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం బాధిస్తుంటే.. సందీప్, సిద్ధార్థ్‌ను కాదని తుదిజట్టులో ఆడిస్తున్న లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ అదరగొడుతున్నాడు.

Shreyas-Iyer

యువ జోరు..

పవర్‌ప్లేలోనే విజృంభించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో ధవన్ (450 పరుగులు), పృథ్వీ షా(292 పరుగులు) జోడీ సఫలీకృతమైందనే చెప్పుకోవాలి. తొలి ఆరు ఓవర్లలో భారీ షాట్లతో తెగబడుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ (442 పరుగులు), ఇంగ్రామ్, రిషభ్ పంత్ (401 పరుగులు) రూపంలో మిడిలార్డర్ బలంగా ఉంది. క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా బ్యాట్‌తోనూ మెరవగలగడం క్యాపిటల్స్‌కు అదనపు బలం. అన్నింటి కంటే ముఖ్యంగా తెరవెనుక రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ రూపంలో ఇద్దరు దిగ్గజాలు వెన్నుదన్నుగా నిలుస్తుండటం ఢిల్లీకి కలిసొస్తున్నది. కీలక మ్యాచ్‌కు ముందు స్టార్ పేసర్ రబాడ దూరం కావడం దెబ్బే అయినా.. పెద్దగా ప్రమాదకరం కాని రైజర్స్‌ను అడ్డుకోవడానికి ఢిల్లీ వద్ద సరిపడ వనరులు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేకున్నా కెప్టెన్‌అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లీగ్ చరిత్రలో ఢిల్లీ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఫైనల్ చేరింది లేదు. మరీ ఈ యువ జట్టు కొత్త చరిత్ర లిఖిస్తుందా వేచి చూడాలి.

జట్లు (అంచనా)


ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ, ధవన్, అయ్యర్, పంత్, ఇంగ్రామ్, రూథర్‌ఫోర్డ్, పాల్, అక్షర్, మిశ్రా, ఇషాంత్, బౌల్ట్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: సాహా, గప్టిల్, పాండే, విలియమ్సన్, శంకర్, పఠాన్/హుడా, నబీ, రషీద్, ఖలీల్, భువనేశ్వర్, థంపీ.
points

Delhi1

3571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles