కోల్‌కతా కీలక విజయం

Mon,April 29, 2019 03:24 AM

-రస్సెల్ కమాల్
-ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అండ్రీ
-పాండ్యా ఒంటరి పోరాటం వృథా
సీజన్ ఆరంభం నుంచి లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూనే అద్భుతాలు సృష్టిస్తున్న డేంజర్ మ్యాన్ రస్సెల్ టాపార్డర్‌లో వస్తే ఏం జరుగుతుందో ఈ మ్యాచ్‌లో నిరూపించాడు. 40 బంతులు ఎదుర్కొన్న అతడు 200 స్ట్రయిక్ రేట్‌తో 80 పరుగులు చేశాడు. దేనికదే అద్భుతం అనిపించే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో ముంబై బౌలర్లకు ఈడెన్‌లో చుక్కలు చూపించాడు. ఓపెనర్లు లిన్, గిల్ అద్భుత ఆరంభంతో మంచి పునాది వేస్తే.. దానిపై రస్సెల్ భారీ సౌధం నిర్మించాడు. ఛేదనలో హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా టాపార్డర్ విఫలమవడంతో ముంబైకి పరాభవం తప్పలేదు. వరుసగా ఆరు ఓటములతో విజయానికి మొఖం వాచిపోయిన కోల్‌కతా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. లీగ్‌లో కోల్‌కతాకు ఇది వందో విజయం కావడం విశేషం.

కోల్‌కతా: పరుగుల వరద పారిన ఈడెన్‌లో స్థానిక జట్టుదే పైచేయి అయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 34 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఆండ్రీ రస్సెల్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరబాదుడుకు శుభ్‌మన్ గిల్ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్ లిన్ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీలు తోడవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు. రస్సెల్ చేసిన 80 పరుగుల్లో 72 బౌండ్రీల ద్వారానే వచ్చాయంటే అతడి ఊచకోత ఏ విధంగా సాగిందో ఊహించొచ్చు. భారీ లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 40 ఓవర్లలో 430 పరుగులు నమోదు కావడం విశేషం. బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్స్స్రెల్.. ఆ తర్వాత బౌలింగ్ (2/25), ఫీల్డింగ్ (2 క్యాచ్‌లు)లోనూ అదరగొట్టి ఆల్‌రౌండ్ షోతో అలరించాడు.

Hardik

పాండ్యా పోరాడినా..

టార్గెట్ 233.. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 21/2. ఓపెనర్లు డికాక్ (0), రోహిత్ (12) ఆరంభంలోనే కాడెత్తేయడంతో ముంబై ఇన్నింగ్స్ గాడితప్పింది. కాసేపటికే లూయిస్ (15), సూర్యకుమార్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వెనుదిరగడంతో సగం ఆశలు కోల్పోయింది. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 60/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో విండీస్ పొడగరి పొలార్డ్ (20)తో కలిసి హార్దిక్ పాండ్యా విజృంభించాడు. ఒక దశలో భారీ సిక్సర్లతో కోల్‌కతా గుండెల్లో దడపుట్టించాడు. చావ్లా వరుస ఓవర్లలో రెండేసి సిక్సర్లు బాదిన పాండ్యా.. గర్నీ ఓవర్‌లో 6,4 కొట్టాడు. నరైన్ ఓవర్‌లో మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌తో 17 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ సిజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం. పొలార్డ్ వెనుదిరిగిన కృనాల్ (18 బంతుల్లో 24; 2 సిక్సర్లు) అండగా పాండ్యా చెలరేగిపోయాడు. 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన దశలో.. చావ్లా ఓవర్‌లో అన్నదమ్ములిద్దరు కలిసి 20 పరుగులు రాబట్టారు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా ఏ మాత్రం వెరవని కుంగ్‌ఫూపాండ్యా ధోనీని తలపిస్తూ.. అద్భుత హెలికాఫ్టర్ షాట్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో సిక్స్ ఫోర్‌తో చూస్తుండగానే 90ల్లోకి వచ్చేశాడు. విజయానికి 13 బంతుల్లో 48 అవసరమైన దశలో పాండ్యా ఔటవడంతో కోల్‌కతా ఊపిరి పీల్చుకుంది.

లిన్, గిల్ ఓపెనింగ్

ఓపెనర్లు లిన్, గిల్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ విరుచుకుపడటంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే గిల్ 4,4,6 బాదితే.. కృనాల్ ఓవర్‌లో లిన్ రెండు ఫోర్లు దంచాడు. మలింగ్ ఓవర్‌లో చెరో ఫోర్ అందుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ఆడిన లిన్ అక్కడి నుంచి గేర్ మార్చాడు. చహర్ బౌలింగ్ ఫోర్ సిక్స్ బాదిన అతడు కృనాల్‌కు అదే శిక్ష వేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాక లిన్ ఔటయ్యాడు. అయినా జోరు తగ్గించని గిల్ వరుస ఓవర్లలో సిక్స్, ఫోర్ కొట్టి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రస్సెల్ ఫినిషింగ్

రాజస్థాన్ ఓటమి అనంతరం మేనేజ్‌మెంట్ తీరుపై మండిపడిన డేంజర్ మ్యాన్ రస్సెల్ ఈ సారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కండల్లో కరెంట్ ఉన్నట్లు.. నరాలకు బదులు ఇనుప తీగలు అమర్చుకున్నట్లు ఎటు కొట్టినా బంతి అమాంతం ప్రేక్షకుల్లో పడటమే. ఈ మ్యాచ్‌లో రస్సెల్ ఊచకోత సాగిన తీరుకు ఈ వర్ణన సరిగ్గ సరిపోతుంది. ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విండీస్ వీరుడు ఈ మ్యాచ్‌తో సీజన్‌లో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డ అతడు కుదురుకున్నాక ముంబై బౌలర్లకు పీడకలనే మిగిల్చాడు. ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లో 6 పరుగులే చేసిన రస్సెల్ ఆ తర్వాతి 28 బంతుల్లో 74 పరుగులు రాబట్టాడు. బంతి ఎక్కడేసినా దాని గమ్యస్థానం స్టాండ్సే అన్నట్లు చెలరేగిన ఈ విండీస్ వీరుడు కోల్‌కతాకు ఊహించని స్కోరు అందించాడు.

మొదట గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 35 బంతుల్లో 62 పరుగులు జోడించిన రస్సెల్.. మూడో వికెట్‌కు కార్తీక్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి 29 బంతుల్లోనే 74 పరుగులు రాబట్టాడు. చహర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు.. హార్దిక్‌కు 3 సిక్సర్ల రుచి చూపించాడు. అందులో అప్పర్ కట్ ద్వారా కొట్టిన మూడో సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్. మరోవైపు బుమ్రాను కార్తీక్ 4,6 కొడితే.. తదుపరి ఓవర్‌లో రస్సెల్ కూడా అదే శిక్ష వేశాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రస్సెల్ చివరి ఓవర్‌లో వెటరన్ మలింగ్‌ను ఆడుకున్నాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. చివరి 5 ఓవర్లలో నైట్ రైడర్స్ 75 పరుగులు చేయడం విశేషం.

100

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది వందో విజయం

స్కోరు బోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్:గిల్ (సి) లూయిస్ (బి) హార్దిక్ 76, లిన్ (సి) లూయిస్ (బి) చహర్ 54, రస్సెల్ (నాటౌట్) 80, కార్తీక్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 232/2. వికెట్ల పతనం: 1-96, 2-158, బౌలింగ్: స్రాన్ 2-0-27-0, కృనాల్ 3-0-27-0, మలింగ 4-0-48-0, బుమ్రా 4-0-44-0, చహర్ 4-0-54-1, హార్దిక్ 3-0-31-1.

ముంబై ఇండియన్స్: డికాక్ (సి) రస్సెల్ (బి) నరైన్ 0, రోహిత్ (ఎల్బీ) గర్నీ 12, లూయిస్ (సి) కార్తీక్ (బి) రస్సెల్ 15, సూర్యకుమార్ (సి) కార్తీక్ (బి) రస్సెల్ 26, పొలార్డ్ (సి) రాణా (బి) నరైన్ 20, హార్దిక్ (సి) రస్సెల్ (బి) గర్నీ 91, కృనాల్ (సి అండ్ బి) చావ్లా 24, స్రాన్ (నాటౌట్) 3, చహర్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 198/7. వికెట్ల పతనం: 1-9, 2-21, 3-41, 4-58, 5-135, 6-185, 7-196, బౌలింగ్: సందీప్ 4-0-29-0, నరైన్ 4-0-44-2, గర్నీ 4-0-37-2, రస్సెల్ 4-0-25-2, చావ్లా 4-0-57-1.

ipl-table

ipl-runs-wickets

6395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles