ఐపీఎల్ ఫైనల్లో రోహిత్‌సేన

Wed,May 8, 2019 02:13 AM

Mumbai Indians beat CSK by 6 wickets cruise into fifth IPL final

-ముంబై 5వ సారి
-సూర్యకుమార్ అజేయ అర్ధసెంచరీ
-క్వాలిఫయర్-1లో చెన్నైపై అలవోక విజయం

లీగ్‌లో విజయవంతమైన జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందనుకుంటే.. అందుకు భిన్నంగా చప్పగా ముగిసింది. సొంత మైదానంలో ఏరికోరి సిద్ధం చేసుకున్న స్పిన్ ట్రాక్‌పై బ్యాటింగ్ చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తంటాలు పడితే.. అదే పిచ్‌పై సూర్యకుమార్ యాదవ్ (54 బంతుల్లో 71 నాటౌట్; 10 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను ఐదోసారి ఫైనల్ చేర్చాడు. అచ్చొచ్చిన హైదరాబాద్‌లో రోహిత్ సేన ఆదివారం టైటిల్‌పోరు బరిలో దిగనుంది. ముంబై కుర్ర స్పిన్నర్ రాహుల్ చహర్ (2/14) గింగిరాలు తిరిగే బంతులతో ధోనీసేనను కట్టడి చేసిన చోట.. వెటరన్‌లు హర్భజన్, తాహిర్, జడేజా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్-2 రూపంలో చెన్నైకి మరో చాన్స్ ఉండటం ఒక్కటే ఆనందించదగ్గ విషయం.

చెన్నై: ఈ ఏడాది సొంతగడ్డపై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన చెన్నై కీలక పోరులో చతికిలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న ధోనీ నిర్ణయం ఎంత తప్పో పవర్‌ప్లేలోనే తెలిసొచ్చింది. బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు చెలరేగుతుంటే.. చెన్నై బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై గెలువడం విశేషం. ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. మళ్లీ ఈ రెండు జట్ల మధ్య తుదిపోరు జరిగే అవకాశముంది. మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ధోనీ (29 బంతుల్లో 37; 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రాహు ల్ చహర్‌తో పాటు కృనాల్ (1/21) సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశా డు. లక్ష్యఛేదనలో ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధసెంచరీతో మెరిస్తే.. ఇషాన్ కిషన్ (28; 1 ఫోర్, 1 సిక్స్) అతడికి చక్కటి సహకారం అందించాడు. చెన్నై బౌలర్లలో తాహిర్‌కు 2 వికెట్లు దక్కాయి.

సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్

సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ బాటపట్టాడు. చహర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన అతడు రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరో ఓపెనర్ డికాక్ (8) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 22/2తో నిలిచింది. అక్కడి నుంచి యువ ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. సూర్యకుమార్ రెండు ఫోర్లు బాదితే.. ఇషాన్ 4,6తో అలరించాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువ లేకపోవడంతో ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. నెమ్మదిగా లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లింది. ఈ జోడీని విడదీసేందుకు ధోనీ ఎన్ని ఎత్తులు వేసిన అవి ఫలించలేదు. ఈ క్రమంలో సూర్యకుమార్ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి 38 బంతుల్లో.. 31 పరుగులు చేయాల్సిన దశలో ఇషాన్, కృనాల్ (0) వరుస బంతుల్లో ఔటైనా.. హార్దిక్ పాండ్యా (13 నాటౌట్) అండతో సూర్యకుమార్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వన్డేను తలపిస్తూ..

కీలక పోరులో చెన్నైకి శుభారంభం దక్కలేదు. క్రీజులో ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బందిపడ్డ డుప్లెసిస్ (6) మూడో ఓవర్‌లో వెనుదిరిగితే.. వన్‌డౌన్‌లో వచ్చిన సురేశ్ రైనా (7) అతిథిగా ఇలా వచ్చి అలావెళ్లాడు. రెండు ఫోర్లు కొట్టి ఇక గాడినపడ్డట్లే అనిపించిన వాట్సన్ (10) కూడా పేలవ షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేసింది. మురళీ విజయ్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు), అంబటి రాయుడు నిదానంగా ఆడటంతో మరో ఆరు ఓవర్ల పాటు వికెట్ కోల్పోలేదు. కానీ పరుగులు కూడా పెద్దగా రాలేదు. రెండు ఫోర్లు మాత్రమే నమోదై 33 రన్స్ వచ్చాయి. టెస్టు ఆటను తలపిస్తున్న విజయ్ ఇన్నింగ్స్‌కు రాహుల్ చహర్ తెరదించాడు.

ధోనీ క్రీజులోకి రావడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. జయంత్ యాదవ్ ఓవర్‌లో ధోనీ, రాయుడు చెరో సిక్సర్ బాదారు. స్పిన్నర్లు కృనాల్, చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 18వ ఓవర్‌లో గానీ సూపర్ కింగ్స్ స్కోరు వంద దాటలేదు. మరుసటి ఓవర్‌లో ధోనీ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. మలింగ బంతులను హెలికాఫ్టర్ షాట్లతో స్టాండ్స్‌లోకి పంపాడు. తొలి బంతి మిడ్ వికెట్ మీదుగా దూసుకెళ్తే.. రెండోది లాంగాన్ పై నుంచి ప్రేక్షకుల్లో పడింది. దీంతో తలాఅభిమానుల హోరుతో స్టేడియం దద్దరిల్లింది. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోనీ బ్యాట్ చేజారడంతో క్యాచ్ ఔటైనా.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఈ అవకాశాన్ని అతడు పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదు. మొత్తం చెన్నై ఇన్నింగ్స్‌లో 10 పరుగులకు మించి వచ్చినవి మూడంటే మూడే ఓవర్లు కావడం గమనార్హం.
Scoreboard

6299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles