మరిన్ని కష్టాల్లో బెన్ స్టోక్స్

Thu,October 12, 2017 01:13 PM

లండన్: ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా.. అతని ప్రవర్తన సరిగా లేకపోతే ఏమవుతుందో చెప్పడానికి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మంచి ఉదాహరణ. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఇరగదీస్తూ.. ప్రపంచంలోనే బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని భావించిన స్టోక్స్.. ఇప్పుడు ఒక్క ఘటనతో పాతాళానికి దిగజారిపోయాడు. వైస్ కెప్టెన్సీ పదవి ఊడింది. టీమ్‌లో స్థానమే గల్లంతైంది. ఇన్నాళ్లూ అతన్ని మోసిన స్పాన్సర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. నైట్ క్లబ్ ముందు తాగి ఇద్దరిని నడిరోడ్డుపైనే చితకబాదిన కేసులో స్టోక్స్ అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కూడా దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. తాజాగా న్యూ బాలెన్స్ అనే స్పోర్ట్స్‌వేర్ సంస్థ అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంది. స్టోక్స్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఈ సందర్భంగా ఆ సంస్థ స్పష్టంచేసింది.


ఇది తమ బ్రాండ్ సంస్కృతి, విలువలను దిగజార్చడమే అవుతుంది. అందుకే అతనితో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నాం అని న్యూ బాలెన్స్ తెలిపింది. బ్రిస్టల్‌లో నైట్‌క్లబ్ ముందు స్టోక్స్ ఇద్దరిని చితకబాదుతున్న వీడియో బయటకు రావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై సస్పెన్షన్ విధించింది. ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడే వరకు అతన్ని టీమ్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్ కోసం అక్టోబర్ 28న ఇంగ్లండ్ టీమ్ బయలుదేరుతున్నది. ఈ సిరీస్‌లో అతను ఆడతాడా లేదా చెప్పని ఈసీబీ.. మిగతా ప్లేయర్స్‌తో కలిసి ఆ రోజున మాత్రం అతను వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై స్టోక్స్ ఇప్పటికే సారీ కూడా చెప్పాడు.

2258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles