ప్లేఆఫ్స్ నుంచి బెంగళూరు నిష్క్రమణ

Wed,May 1, 2019 04:29 AM

-ఆర్‌సీబీ నాకౌట్
-వర్షం కారణంగా తేలని ఫలితం
-రాజస్థాన్ అవకాశాలకు దెబ్బ
వర్షం కారణంగా మూడున్నర గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైన ఓపిగ్గా ఎదురుచూస్తూ కూర్చున్న అభిమానులకు ఐదు ఓవర్లలోనే విందు భోజనం లభించింది. బ్యాటింగ్ ఉరుములు, బౌలింగ్ మెరుపులు, ఫీల్డింగ్ విన్యాసాలు ఈ చిన్న మ్యాచ్‌లోనే అన్నీ చూసేందుకు దక్కాయి. మొదట కోహ్లీ, డివిలియర్స్ విజృంభించి తమ బ్యాటింగ్ పవర్ చాటితే.. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఎలాంటి తడబాటుకు గురికాని రాజస్థాన్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదించేలా కనిపించినా.. మరోసారి వరణుడు అడ్డుపడటంతో ముందే ముగిసిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో అధికారికంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. రాజస్థాన్ దాదాపుగా దూరమైంది.

బెంగళూరు: వర్షం ఇరు జట్ల అవకాశాలతో దోబూచులాడిన మ్యాచ్‌లో చివరికి వరణుడే విజయం సాధించాడు. మంగళవారం భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ఫలితం చివరకు తేలకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 ఓవర్లలో 7 వికెట్లకు 62 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఏబీ డివిలయర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో యువ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ (3/12) హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 3.2 ఓవర్లలో 41/1తో ఉన్న దశలో మరోసారి వర్షం పడటంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సంజూ శాంసన్ (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు.

శాంసన్ వీరబాదుడు

30 బంతుల్లో 63 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్‌లో శాంసన్ (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) 6,4 కొడితే.. రెండో ఓవర్‌లో లివర్‌స్టోన్ (11) 4,6 బాదాడు. మూదో ఓవర్‌లో రెచ్చిపోయిన శాంసన్ రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ ఫోర్ దంచాడు. దీంతో లక్ష్యం 12 బంతుల్లో 23 పరుగులకు చేరింది. ఈ దశలో శాంసన్ ఔట్‌కాగా.. మరోసారి వరణుడు మ్యాచ్‌కు అడ్డుపడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం రాజస్థాన్‌ను విజేతగా ప్రకటించారు.

kohli

ఆరంభం అలా.. ముగింపు ఇలా..

వచ్చి రావడంతోనే విరుచుకుపడాలనే ఉద్దేశంతో పార్థివ్‌కు బదులుగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలయర్స్ ఓపెనింగ్‌కు వచ్చారు. తొలి రెండు బంతులను విరాట్ సిక్సర్లుగా మలిస్తే.. నేనేం తక్కువ అన్నట్లు డివిలియర్స్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు 23 పరుగులు చేసింది. తక్కువ ఓవర్ల మ్యాచ్ అంటే వీరబాదుడు మాత్రమే కాదు అద్భుత బౌలింగ్ కూడా అనే విధంగా రాజస్థాన్ బౌలర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్‌తో విజృంభించి రాజస్థాన్‌ను పోటీలోకి తెచ్చాడు. గోపాల్ రెండో ఓవర్‌లో వరుసగా 6,4,2 కొట్టిన విరాట్ నాలుగో బంతికి మరో భారీషాట్‌కు యత్నించి ఔటైతే.. ఆ తర్వాతి రెండు బంతులకు డివిలయర్స్, స్టొయినిస్ (0) పెవిలియన్ చేరారు. రియాన్ పరాగ్ క్యాచ్‌తో ఏబీ ఔటైతే.. స్టొయినిస్ మిడ్‌ఆఫ్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. ఈ సీజన్‌లో ఇది రెండో హ్యాట్రిక్.

పంజాబ్ బౌలర్ స్యామ్ కరన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. వర్షం కారణంగా బాగా తడిసిన పిచ్‌పై పేసర్ల కంటే స్పిన్నర్లను నమ్ముకోవడమే మంచిదనుకున్న స్మిత్ తర్వాతి ఓవర్‌లో పరాగ్‌కు బంతినిచ్చాడు. ఇది ఫలితాన్నిచ్చింది. ఓ ఫోర్ కొట్టిన గుర్‌కీరత్ సింగ్ (6) భారీ షాట్ కొట్టే క్రమంలో పెవిలియన్ చేరితే.. పార్థివ్ పటేల్ (8) అతడిని అనుసరించాడు. అందరికంటే ఎక్కువ బంతులు ఆడిన క్లాసెన్ (7 బంతుల్లో 6) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చివరి ఓవర్ వేసిన థామస్ 6 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో బెంగళూరు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఐదు ఓవర్లలో బెంగళూరు వరుసగా 23, 12, 10, 9, 6 పరుగులు చేసింది.

2

-ఈ సీజన్‌లో కోహ్లీ, డివిలీయర్స్‌ను ఔట్ చేయడం రాజస్థాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌కు ఇది రెండోసారి.

-ఈ సీజన్‌లో స్యామ్ కర్రాన్(పంజాబ్) తర్వాత హ్యాట్రిక్ పడగొట్టిన బౌలర్ శ్రేయాస్ గోపాల్.

స్కోరు బోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లీ (సి) లివింగ్‌స్టోన్ (బి) గోపాల్ 25, డివిలియర్స్ (సి) పరాగ్ (బి) గోపాల్ 10, స్టొయినిస్ (సి) స్మిత్ (బి) గోపాల్ 0, క్లాసెన్ (సి) లివింగ్‌స్టోన్ (బి) థామస్ 6, గుర్‌కీరత్ (సి) లామ్రర్ (బి) పరాగ్ 6, పార్థివ్ (సి) థామస్ (బి) ఉనాద్కట్ 8, నేగీ (సి) శాంసన్ (బి) థామస్ 4, ఉమేశ్ (నాటౌట్) 0, సైనీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 5 ఓవర్లలో 62/7. వికెట్ల పతనం: 1-35, 2-35, 3-35, 4-44, 5-54, 6- 57, 7-61, బౌలింగ్: అరోన్ 1-0-23-0, గోపాల్ 1-0-12-3, పరాగ్ 1-0-10-1, ఉనాద్కట్ 1-0-9-1, థామస్ 1-0-6-2.

రాజస్థాన్ రాయల్స్: శాంసన్ (సి)నెగీ (బి)చాహల్ 28, లివింగ్‌స్టోన్ 12 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 3.2 ఓవర్లలో 41/1; వికెట్ల పతనం: 1-41; బౌలింగ్: ఉమేశ్ 1-0-10-0, సైనీ 1-0-12-0, కేజ్రోలియా 1-0-18-0, చాహల్ 0.2-0-0-1.

ipl-table

ipl-runs-wickets

7090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles