బెంగళూరు చేతిలో హైదరాబాద్ ఓటమి

Sun,May 5, 2019 03:11 AM

rcb beat srh by 4 wickets

-రైజర్స్‌కు ఝలక్!
-అదరగొట్టిన హెట్‌మైర్, గుర్‌కీరత్
-హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం
ఇప్పటికే నాకౌట్ రేస్ నుంచి తప్పుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోతు పోతు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై కూడా నీళ్లు చల్లింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ చతికిలపడింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ (43 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తే.. బౌలర్లు సమిష్టి వైఫల్యానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. 20/3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ బెంగళూరును హెట్‌మైర్ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్వితీయ పోరాటంతో విజయతీరాలకు చేర్చాడు. గురుకీరత్ సింగ్ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రైజర్స్ బౌలర్స్‌ను చెడుగుడు ఆడుకున్న విండీస్ వీరుడు సన్‌రైజర్స్ నాకౌట్ అవకాశాలను ఆవిరి చేశాడు. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన రైజర్స్ 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లన్నీ ముగియడంతో ఇక హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా ఓటమి పాలవ్వాలని ప్రార్థించడం తప్ప ఇంకా చేసేదేమి లేదు. ఇప్పటికే చెన్నై, ముంబై, ఢిల్లీ మూడు టీమ్‌లు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. బెంగళూరు, రాజస్థాన్ అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించాయి. పంజాబ్‌కు ఏ మూలో ఆశలు మిణుకు మిణుకు మంటున్నా.. జోరు మీదున్న చెన్నైని 160 పరుగుల తేడాతో ఓడిస్తే గానీ దానికి చాన్స్ ఉండదు. ఇక మిగిలిందల్లా కోల్‌కతా మాత్రమే. నేటి మ్యాచ్‌లో ముంబై గెలిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుతుంది. లేకుంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్రస్థానం ముగిసినట్లే.

బెంగళూరు: చావోరేవోలాంటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా విఫలమైంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మినహా మరే బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోతే.. బౌలింగ్‌లో ఆరంభంలోనే ప్రధాన వికెట్‌లు పడగొట్టినా ఆ తర్వాత చెత్త ఫీల్డింగ్‌తో పట్టు సడలించి ఓటమి కొనితెచ్చుకుంది. శనివారం సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. విలియమ్సన్ అజేయ అర్ధశతకంతో మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (23 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3/24) ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో బెంగళూరు ఒక దశలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా.. హెట్‌మైర్, గురుకీరత్ సింగ్ అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టారు.

హెట్‌మైర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకున్న బెంగళూరు సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో విజయం సాధించి అభిమానులను అలరిస్తే.. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంది. ఇక హైదరాబాద్ నాకౌట్ చేరాలంటే నేడు ముంబైతో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి పాలవ్వాలి. అదే సమయంలో చెన్నైపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ తేడాతో గెలవకుంటేనే చాన్స్ ఉంటుంది.

అదరగొట్టిన హెట్‌మైర్, గురుకీరత్

ఛేజింగ్‌లో బెంగళూరుకు పేలవమైన ఆరంభం లభించింది. మూడు ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. పార్థివ్ పటేల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగితే.. కొన్ని మెరుపు షాట్లు ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (7 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) అతడిని అనుసరించాడు. కోహ్లీ ఔటయ్యాక నేను మాత్రం ఏం చేస్తానులే అనుకున్నాడేమో డివిలియర్స్ (1) స్లిప్‌లో గప్టిల్‌కు సునాయస క్యాచ్ ఇచ్చి డగౌట్ బాటపట్టాడు. ఇక అక్కడి నుంచి గురుకీరత్ సాయంతో విండీస్ సంచలనం హెట్‌మైర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరు అడపాదడపా భారీ షాట్లు కొడుతూ సాధించాల్సిన రన్‌రేట్‌ను మరీ పెరిగిపోకుండా చూసుకున్నారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోహ్లీసేన 77/3తో నిలిచింది. అదే జోరులో రషీద్ బౌలింగ్ రెండు సిక్సర్లు బాదిన హెట్‌మైర్ 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్లతో లక్ష్యాన్ని కరిగించుకుంటూ వచ్చిన హెట్‌మైర్‌కు వరుస బంతుల్లో రెండు లైఫ్‌లు దక్కడం కూడా బెంగళూరుకు కలిసొచ్చింది.

54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌండ్రీ సమీపంలో ఒకింత క్లిష్టమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేస్తే.. మరుసటి బంతికి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను యూసుఫ్ పఠాన్ నేలపాలు చేశాడు. విజయానికి 5 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన దశలో ఓ ఓవర్ వేసిన విజయ్ శంకర్ మూడు ఫోర్లు సహా 16 పరుగులు సమర్పించుకున్నాడు. భువీ ఐదు పరుగులే ఇచ్చి కట్టడి చేసినా.. రషీద్ బౌలింగ్‌లో వీరిద్దరూ చెరో సిక్సర్ బాదడంతో లక్ష్యం మరింత చిన్నదైంది. చివరి రెండు ఓవర్లలో 11 పరుగులు చేయాల్సిన దశలో ఖలీల్ 5 పరుగులే ఇచ్చి గురుకీరత్, సుందర్ (0)ను ఔట్ చేయడంతో సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులకు చేరింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (3 నాటౌట్) నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉండగా.. ఉమేశ్ యాదవ్ (9 నాటౌట్) వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి బెంగళూరుకు మర్చిపోలేని విజయాన్నందించాడు.

Kane-williamson

విరుచుకుపడ్డ విలియమ్సన్

రెండో ఓవర్‌లో 4,6తో గప్టిల్ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. ఉమేశ్ వేసిన ఆ ఓవర్‌లోనే వృద్ధిమాన్ సాహా (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ఓ ఫోర్ బాదగా.. ఓవర్ త్రో రూపంలో మరో 5 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో గప్టిల్ చక్కటి సిక్సర్‌తో అలరిస్తే.. సాహా ఇచ్చిన క్యాచ్‌ను చహల్ వదిలేశాడు. దీన్ని కొంతలో కొంత సద్వినియోగం చేసుకున్న సాహా.. చహల్ బౌలింగ్‌లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కాసేపటికే ఉమేశ్ పట్టిన క్యాచ్‌తో అతడి ఆట ముగిసింది. దీంతో ఐదు ఓవర్లు అయ్యేసరికి సన్‌రైజర్స్ 51/1తో నిలిచింది. అక్కడినుంచి ఇన్నింగ్స్ గమనమే మారిపోయింది. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్‌లో గప్టిల్, మనీశ్ పాండే (9)ను వెనక్కి పంపి రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మంచి టచ్‌లో కనిపించిన గప్టిల్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగితే.. హెట్‌మైర్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌తో పాండే పెవిలియన్ చేరాడు.

విలియమ్సన్, త్రి డైమెన్షన్ ప్లేయర్‌విజయ్ శంకర్ (18 బంతుల్లో 27; 3 సిక్సర్లు) మరీ నెమ్మదిగా ఆడారు. కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పిన శంకర్.. సుందర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మరుసటి బంతికి ఔటయ్యాడు. ఎట్టకేలకు 14వ ఓవర్లో రైజర్స్ 100 మార్క్ దాటింది. ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భుజానికెత్త్తుకున్న విలియమ్సన్.. ఖెజ్రోలియా ఓవర్‌లో రెండు సిక్సర్లతో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో యుసుఫ్ పఠాన్ (3), నబీ (4) రషీద్ ఖాన్ (1) ఏ ఒక్కరు పట్టుమని పదినిమిషాలు కెప్టెన్‌కు సహకారం అందించలేకపోయారు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో విలియమ్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్‌రైజర్స్ మంచి స్కోరు చేయగలిగింది.

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: సాహా (సి) ఉమేశ్ (బి) సైనీ 20, గప్టిల్ (సి) కోహ్లీ (బి) సుందర్ 30, పాండే (సి) హెట్‌మైర్ (బి) సుందర్ 9, విలియమ్సన్ (నాటౌట్) 70, శంకర్ (సి) గ్రాండ్‌హోమ్ (బి) సుందర్ 27, పఠాన్ (సి) ఉమేశ్ (బి) చహల్ 3, నబీ (సి) గుర్‌కీరత్ (బి) సైనీ 4, రషీద్ (సి) హెట్‌మైర్ (బి) ఖెజ్రోలియా 1, భువనేశ్వర్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 175/7. వికెట్ల పతనం: 1-46, 2-60, 3-61, 4-106, 5-127, 6-137, 7-139, బౌలింగ్: ఉమేశ్ 4-0-46-0, సైనీ 4-0-39-2, చహల్ 4-0-24-1, ఖెజ్రోలియా 4-0-29-1, సుందర్ 3-0-24-3, గ్రాండ్‌హోమ్ 1-0-12-0.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ (సి) పాండే (బి) భువనేశ్వర్ 0, కోహ్లీ (సి) సాహా (బి) ఖలీల్ 16, డివిలియర్స్ (సి) గప్టిల్ (బి) భువనేశ్వర్ 1, హెట్‌మైర్ (సి) శంకర్ (బి) రషీద్ 75, గుర్‌కీరత్ (సి) పఠాన్ (బి) ఖలీల్ 65, గ్రాండ్‌హోమ్ (నాటౌట్) 3, సుందర్ (సి) పాండే (బి) ఖలీల్ 0, ఉమేశ్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 19.2 ఓవర్లలో 178/6. వికెట్ల పతనం: 1-1, 2-18, 3-20, 4-164, 5-167, 6-168, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-24-2, ఖలీల్ 4-0-37-3, రషీద్ 4-0-44-1, నబీ 2.2-0-26-0, థంపీ 4-0-29-0, శంకర్ 1-0-16-0.

ipl-table

ipl-runs-wickets

3156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles