ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే బోణీ

Thu,June 6, 2019 03:52 AM

Rohit Sharmas ton leads India to 6 wicket win

-బోణీకొట్టిన భారత్
-రోహిత్ అజేయ సెంచరీ .. చాహల్ విజృంభణ
-దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం
-ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరిపోయే బోణీ
-రోహిత్‌శర్మ అజేయ సెంచరీ
-చాహల్ స్పిన్ మాయాజాలం
-దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన ఘనవిజయం
అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. శతకోటి భారతావని ఆశలను మోసుకుంటూ బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమ్‌ఇండియా అంచనాలకు అనుగుణంగా విజృంభించింది. మెగాటోర్నీలో ఆలస్యంగా బరిలోకి దిగినా..అదిరిపోయే బోణీతో కోహ్లీసేన కదం తొక్కింది. టైటిల్ ఫేవరెట్లలో తామున్నమంటూ ప్రత్యర్థులకు దీటైన హెచ్చరికలు పంపుతూ దక్షిణాఫ్రికాపై విజయదుందుభి మోగించింది. అశేష ప్రేక్షకుల మధ్య ఆఖరి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ సఫారీలను మట్టికరిపించింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తే..మణికట్టు మాయగాడు చాహల్ స్పిన్ తంత్రంతో నడ్డివిరిచాడు. ఫలితంగా స్వల్ప స్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా..పేలవ ఫీల్డింగ్‌తో లడ్డూ లాంటి అవకాశాలను జారవిడుచుకుంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ అజేయ సెంచరీతో ఇన్నింగ్స్ ఆసాంతం తానై నడిపించిన వేళ సఫారీలు చేష్టలుడిగిపోయారు. రోహిత్‌ను కట్టడి చేయడంలో విఫలమై హ్యాట్రిక్ ఓటమితో మెగా టోర్నీలో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్నారు. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ముందంజ వేసే పరిస్థితి నితెచ్చుకున్నారు. దురదృష్టాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్న సఫారీలకు ఇక ప్రతి మ్యాచ్ ప్రాణ సంకటమే.

సౌతాంప్టన్: ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ టోర్నీని ముద్దాడాలనుకుంటున్న భారత్ తొలి అడుగు ఘనంగా వేసింది. ప్రత్యర్థులందరూ ఇది వరకే కదన రంగంలో కత్తులు దూసుకుంటే ఆలస్యమైనా కోహ్లీసేన కొదమసింహాలా కొట్లాడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను చిత్తుచేస్తూ తమ లక్ష్యమేంటో చెప్పకనే చెప్పింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో సఫారీలపై అద్భుత విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(144 బంతుల్లో 122 నాటౌట్, 13 ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ సెంచరీతో విజృంభించాడు. సహచరుల నుంచి అంతగా సహకారం లేకపోయినా ఇన్నింగ్స్ ఆసాంతం అన్నీతానై జట్టును ముందుండి గెలిపించాడు. ధోనీ(34) బాధ్యతాయుతంగా రాణించాడు. తొలుత చాహల్(4/51), బుమ్రా(2/35), భువనేశ్వర్(2/44) ధాటికి దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 227/9 స్కోరు చేసింది. క్రిస్ మోరిస్(42), డుప్లెసిస్(38) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈనెల 9న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.
RohitSharma1

రోహిట్:

లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్‌కు సరైన శుభారంభం దక్కలేదు. మన ఇన్నింగ్స్ మొదలయ్యే నాటికి మబ్బులు ఇంకా కమ్ముకుని ఉండటంతో సఫారీ పేస్ ద్వయం రబాడ, మోరిస్ స్వింగ్‌తో భారత ఓపెనర్లు రోహిత్‌శర్మ(122 నాటౌట్), ధవన్ (8) చాలా ఇబ్బంది పడ్డారు. వ్యక్తిగత స్కోరు 1 వద్ద రబాడ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఇదే అదునుగా సఫారీ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో టీమ్‌ఇండియా ఓపెనర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ క్రమంలో రబాడ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికి ధవన్..డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ కోహ్లీకి రోహిత్ జతకలిశాడు. ఇక లాభం లేదనుకున్న హిట్‌మ్యాన్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో చెలరేగడంతో 15 పరుగులు వచ్చాయి. దీంతో తొలి 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి భారత్ 34 పరుగులు చేసింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన ఫెల్కువాయో..రోహిత్‌శర్మ ఎల్బీపై డీఆర్‌ఎస్‌కు వెళ్లగా నిరాశ ఎదురుకావడం భారత్‌కు కలిసొచ్చింది. గండం గడిచిందనుకుంటున్న తరుణంలో తిరిగి ఫెల్కువాయో బౌలింగ్‌లో డికాక్ కండ్లు చెదిరే క్యాచ్‌తో కోహ్లీ భారంగా పెవిలియన్ చేరాడు. తనకు ఎడంగా వెళుతున్న బంతి ని డికాక్ అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. నాలు గో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్(26)..రోహిత్‌కు చక్కని సహకారమందించాడు. ఓవైపు స ఫారీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా...ఓర్పుతో బ్యాటింగ్ చేస్తూ పోయారు. వీరిని విడదీసేందుకు కెప్టెన్ డుప్లెసిస్..రకరకాల ప్రయోగాలు చేశాడు. మంచి ఊపుమీదున్న మోరిస్ కూడా ఈ జోడీని విడదీయడంలో సఫలం కాలేకపోయాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రోహిత్ 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోరిస్ వేసిన మరుసటి ఓవర్లో రోహిత్ మరోమారు ఔట్ నుంచి బయటపడ్డాడు. టీమ్‌ఇండియా 26వ ఓవర్లో వంద పరుగుల మార్క్

అందుకుందంటే ఎంత నెమ్మదిగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది. లక్ష్యం దిశగా సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రబాడ..రాహుల్‌ను స్లో బంతితో బోల్తా కొట్టించాడు. అంచనా వేయడంలో విఫలమైన రాహుల్ నిష్క్రమణతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జాదవ్‌కు బదులు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ..రోహిత్‌కు చక్కగా సహకరించాడు. ఈ ఇద్దరు సాధికారికంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించారు. ముఖ్యంగా సహచరులు విఫలమైన చోట తాను ఉన్నానంటూ రోహిత్ ఆడిన ఆట టీమ్‌ఇండియాను పైచేయిలో నిలిపింది. ఈ క్రమంలో రోహిత్ ప్రపంచ కప్‌లో రెండో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. గెలుపునకు చేరువవుతున్న తరుణంలో భారీ షాట్‌కు యత్నించిన ధోనీ ఔటయ్యాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(15 నాటౌట్)తో కలిసి రోహిత్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
Bumrah

బూమ్ బూమ్ బుమ్రా:

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముందు రోజు కురిసిన వర్షానికి పిచ్‌పై ఉన్న తేమను టీమ్‌ఇండియా బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. బుమ్రా బుల్లెట్ లాంటి బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. పిచ్‌ను అనుకూలంగా చేసుకుంటూ బుమ్రా సంధించిన బంతులకు దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(6), డికాక్(10) షాట్లు కొట్టేందుకు భయపడ్డారు. మరో ఎండ్‌లో భువనేశ్వర్ తనదైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగడంతో సఫారీలకు పరుగుల రాక గగనమైంది. ఇదే అదునుగా కెప్టెన్ కోహ్లీ చుట్టూ ఫీల్డర్లను మోహరిస్తూ అంతకంతకు ఒత్తిడి పెంచుకుంటూ పోవడం ఫలితమిచ్చింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆమ్లాను బుమ్రా అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అప్పటికే తడబడుతూ బ్యాటింగ్ చేస్తున్న డికాక్‌ను ఔట్ చేసేందుకు కోహ్లీ వేసిన స్కెచ్ చక్కగా వర్కవుట్ అయ్యింది. ఆఫ్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వెళుతున్న బుమ్రా బంతిని షాట్ ఆడబోయిన డికాక్..కోహ్లీ క్యాచ్‌తో రెండో వికెట్‌గా నిష్క్రమించడంతో టీమ్‌ఇండియా సంబురాల్లో మునిగి తేలింది. 24 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్, డస్సెన్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో రెగ్యులర్ పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. పిచ్ పేస్ చక్కగా సహకరిస్తుండటంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కోహ్లీ 11వ ఓవర్లోనే దింపాడు. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌తో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

తెగని తోక!

సగం బ్యాట్స్‌మెన్ అప్పటికే పెవిలియన్ చేరి కనీసం 150 పరుగులైనా అందుకుంటుందన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మిల్లర్(31), ఫెల్కువాయో (34), మోరిస్ (42), రబాడ(31 నాటౌట్) రాణించడంతో ప్రొటీస్ రెండొందల మార్క్ అందుకుంది. సహచరులు నిష్క్రమించినా...వెరువని ఆత్మవిశ్వాసంతో మిల్లర్, ఫెల్కువాయో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో మిల్లర్‌ను ఔట్ చేసిన చాహల్ భారత్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా..ఆఖర్లో ఫెల్కువాయో, మోరిస్, రబాడ కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టారు.
chahal

చాహల్ డబుల్

మణికట్టు మాంత్రికుడు చాహల్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ తన రెండో ఓవర్లోనే డస్సెన్(22)ను పెవిలియన్ పంపాడు. బంతిని సరిగ్గా అంచనా వేయకుండా రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన డస్సెన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి డుప్లెసిస్ కూడా ఔట్ కావడంతో సహచరులతో కలిసి చాహల్ సంబురాలు చేసుకున్నాడు. తొమ్మిది పరుగుల తేడాతో డుమిని(3)ని కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దక్షిణాఫ్రికా 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కూరుకుపోయింది.

23

అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తరఫున రోహిత్‌శర్మ 23 సెంచరీలతో గంగూలీ(22)ని అధిగమించాడు. సచిన్ (49), కోహ్లీ(41) తర్వాత రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

స్కోరు బోర్డు

దక్షిణాఫ్రికా: ఆమ్లా(సి)రోహిత్(బి) బుమ్రా 6, డికాక్(సి)కోహ్లీ(బి)బుమ్రా 10, డుప్లెసిస్(బి)చాహల్ 38, డస్సెన్ (బి)చాహల్ 22, మిల్లర్ (సి&బి) చాహల్ 31, డుమిని(ఎల్బీ)కుల్దీప్ యాదవ్ 3, ఫెల్కువాయో(స్టంప్/ధోనీ)(బి)చాహల్ 34, మోరిస్(సి)కోహ్లీ(బి)భువనేశ్వర్ 42, రబాడ 31 నాటౌట్, తాహిర్(సి)కేదార్(బి)భువనేశ్వర్ 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 227/9; వికెట్ల పతనం: 1-11, 2-24, 3-78, 4-80, 5-89, 6-135, 7-158, 8-224, 9-227; బౌలింగ్: భువనేశ్వర్ 10-0-44-2, బుమ్రా 10-1-35-2, హార్దిక్ 6-0-31-0, కుల్దీప్ 10-0-46-1, చాహల్ 10-0-51-4, కేదార్ జాదవ్ 4-0-16-0.

భారత్: ధవన్(సి)డికాక్(బి)రబాడ 8, రోహిత్ 122 నాటౌట్, కోహ్లీ(సి)డికాక్(బి)ఫెల్కువాయో 18, రాహుల్ (సి)డుప్లెసిస్(బి)రబాడ 26, ధోనీ 16 (సి&బి) మోరిస్ 34, హార్దిక్ 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 47.3 ఓవర్లలో 230/4; వికెట్ల పతనం: 1-13,2-54, 3-139, 4-213; బౌలింగ్: తాహిర్ 10-0-58-0, రబాడ 10-1-39-2, మోరిస్ 10-3-36-1, ఫెల్కువాయో 8.3-0-40-1, శంసీ 9-0-54-0.
Indiafans

Sco

13261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles