పోరాడి ఓడిన పంజాబ్

Thu,April 25, 2019 02:33 AM

-రాణించిన డివిలీయర్స్, ఉమేశ్
-ఆర్‌సీబీ హ్యాట్రిక్
-రాహుల్, పురన్ శ్రమ వృథా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొడుతున్నది. వరుసగా ఆరు పరాజయాలతో లీగ్‌లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆర్‌సీబీ..సొంత ఇలాఖాలో సత్తాచాటుతున్నది. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ దూసుకెళుతున్నది. చాంపియన్ చెన్నైకి షాక్ ఇచ్చిన జోష్‌లో పంజాబ్‌ను పడగొట్టింది. మిస్టర్ 360 ఏబీ డివిలీయర్స్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెండొందల స్కోరు అందుకున్న బెంగళూరు.. ఉమేశ్, సైనీ విజృంభణతో పంజాబ్‌ను కట్టడిచేస్తూ హ్యాట్రిక్ విజయంతో తమ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. రాహుల్, పురన్ పోరాటపటిమ వృథా అయ్యింది.

బెంగళూరు: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో పంజాబ్‌పై బెంగళూరుదే పైచేయి అయ్యింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 17 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. డివిలీయర్స్(44 బంతుల్లో 82 నాటౌట్, 3ఫోర్లు, 7సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు స్టోయినిస్(46 నాటౌట్) రాణింపుతో బెంగళూరు 20 ఓవర్లలో 202/4 స్కోరు చేసింది. షమీ, అశ్విన్, మురుగన్, విల్జోయిన్ ఒక్కో వికెట్ తీశారు. ఉమేశ్(3/36), సైనీ(2/33) విజృంభణతో పంజాబ్ 20 ఓవర్లలో 185/7 స్కోరు చేసింది. రాహుల్(42), పురన్(46) రాణించారు.

రాహుల్ రాణించగా:

నిర్దేశిత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్(23), రాహుల్(42) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సౌథీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో యూనివర్సల్ బాస్ గేల్..మూడు ఫోర్లు బాది తన బ్యాటు పవరేంటో చూపించాడు. స్టెయిన్ స్థానంలో జట్టులోకొచ్చిన సౌథీ ఏ మాత్రం తన ప్రభావం చూపించలేకపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ కూడా బ్యాటు ఝులిపించడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. అయితే సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను ఉమేశ్ దెబ్బతీశాడు. అప్పటికే భారీ సిక్స్‌తో పరుగుల వరదకు తెరలేపిన గేల్..ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ దగ్గర ఏబీ నేర్పుగా ఒడిసిపట్టుకోవడంతో తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు సహచరుడు నిష్క్రమించినా..రాహుల్ ఎక్కడా తడబాటుకు లోనుకాలేదు. సీజన్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఛేదన దిశగా సాగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 68/1 స్కోరు చేసింది.

క్రీజులోకొచ్చిన మయాంక్(35)మద్దతుతో రాహుల్ స్వేచ్చగా షాట్లు ఆడాడు. తన సొంత ఇలాఖాలో సత్తాచాటాలన్న పట్టుదలతో కనిపించిన రాహుల్.. చాహల్‌ను సిక్స్ బాదితే.. మయాంక్ ఫోర్ కొట్టాడు. ఇద్దరు పోటాపోటీగా బ్యాట్లు ఝులపించడంతో లక్ష్యం అంతకంతకు తగ్గుతూపోయింది. అయితే నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు ఔటయ్యారు. మయాంక్‌ను స్టోయినిస్ పెవిలియన్ పంపగా, అలీ తన తొలి బంతికే రాహుల్‌ను ఔట్ చేశాడు. కొత్తగా క్రీజులోకొచ్చిన నికోలస్ పురన్(46), డేవిడ్ మిల్లర్(24) ఒకింత ఒత్తిడికి లోనవ్వడంతో రెండు ఓవర్లు బౌండరీలు రాలేదు.

వారెవ్వా పురన్:

వెస్టిండీస్ యువ క్రికెటర్ పురన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో తొలిసారి తన బ్యాటుకు పనిచెప్పాడు. సుందర్ 14వ ఓవర్లో మూడు భారీ సిక్స్‌లు బాదిన పురన్..19 పరుగులు పిండుకున్నాడు. అదే జోరును ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగుతూ లక్ష్యాన్ని అంతకంతకు తగ్గించుకుంటూ పోయాడు. మిల్లర్ కూడా పురన్‌కు జత కలువడంతో పంజాబ్ జోరందుకుంది. ఉమేశ్ బౌలింగ్‌లో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పురన్..స్టోయినిస్ క్యాచ్ విడిచిపెట్టడంతో ఔట్ నుంచి బయటపడ్డాడు. అయితే ఆ తర్వాతి సైనీ ఓవర్లో మిల్లర్, పురన్ వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖర్లో అశ్విన్(6), విల్జోయిన్(0) నిష్క్రమించడంతో పంజాబ్ 185 పరుగులకు పరిమితమైంది.

ఏబీ బాదేశాడు:

టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్..లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపుతూ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరుగుల వరదకు మారుపేరైన చిన్నస్వామి స్టేడియంలో సొంత అభిమానుల సత్తాచాటేందుకు కోహ్లీసేన ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. చెన్నైతో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకొచ్చిన ఓపెనర్ పార్థివ్‌పటేల్(43)..కెప్టెన్ కోహ్లీ(13)తో కలిసి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. రాజ్‌పుత్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లతో స్కోరుబోర్డుకు 12 పరుగులు జతచేసి తన ఉద్దేశ్యమేంటో చెప్పకనే చెప్పాడు. షమీ తొలి ఓవర్లో మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మిడ్‌వికెట్‌లో విల్జోయిన్ క్యాచ్ విడిచిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్న విరాట్..వరుస ఫోర్లతో దుమ్మురేపాడు. అయితే ఈ సంబురం ఎక్కువసేపు నిలువలేదు. షమీ బౌలింగ్‌లోనే కవర్స్‌లో షాట్ ఆడబోయిన కోహ్లీ..మణ్‌దీప్‌సింగ్ చేతికి చిక్కడంతో స్టేడియమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. సహచరుడు నిష్క్రమించినా ఎక్కడా వెనుకకు తగ్గని పార్థివ్..షమీని లక్ష్యంగా చేసుకుంటూ మూడు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో 18 పరుగులు కొల్లగొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది.

kohli-umesh-yadav

10 పరుగుల తేడాతో 3 వికెట్లు:

భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్న బెంగళూరుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. పిచ్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన పార్థివ్, డివిలీయర్స్ బ్యాట్లు ఝులిపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కింగ్స్ పంజా విసిరింది. పది పరుగుల తేడాతో పార్థివ్‌తో పాటు మొయిన్ అలీ(4), అక్ష్‌దీప్‌నాథ్(3) వెంటవెంటనే ఔటయ్యారు. మురుగున్ అశ్విన్ గూగ్లీని సరిగ్గా అర్థం చేసుకోని పార్థివ్..అశ్విన్‌కు క్యాచ్ ఇస్తే..అలీని అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. నిలకడగా రాణించడంలో విఫలమవుతూ వస్తున్న నాథ్‌ను విల్జోయిన్ పెవిలియన్ పంపాడు. పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 4 వికెట్లకు 84 స్కోరు.

డివిలీయర్స్, స్టోయినిస్ ధమాకా:

దాదాపు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలీయర్స్, స్టోయినిస్ ఒడ్డున పడేశారు. వీరిద్దరు కలిసి మొదట్లో కొంత నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. ఆ తర్వాత విశ్వరూపమే ప్రదర్శించారు. నాలుగు ఓవర్లు బౌండరీల జోలికి పోని ఈ జోడీ మెల్లమెల్లగా గేర్లు మార్చుతూ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చింది. ముఖ్యంగా కొట్టిన పిండిల్లాంటి చిన్నస్వామి స్టేడియంపై పూర్తి అవగాహన ఉన్న ఏబీ..మిస్టర్ 360 అని మరోమారు నిరూపించుకున్నాడు. అడపాదడపా బౌం డరీలతో ఐపీఎల్ కెరీర్‌లో ఏబీ 33వ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా..స్టోయినిస్ చక్కని సహకారమందించాడు. ఇలా 17ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ స్కోరు 4 వికెట్లకు 138 పరుగులు. ఇక్కణ్నుంచి ఆఖరి మూడు ఓవర్లలో మ్యాచ్‌ను డివిలీయర్స్, స్టోయినిస్ జోడీ శాసించింది. అప్పటి వరకు పొదుపు పాటించిన షమీ, విల్జోయిన్‌కు ఈ ఆర్‌సీబీ ద్వ యం ఉతికి ఆరేసింది. షమీని ఏబీ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదేశాడు. ఒక సిక్స్ అయితే స్టేడి యం టాప్‌పైకి రాకెట్‌లా దూసుకెళ్లింది. విల్జోయిన్ 20వ ఓవర్లో ఏబీ సిక్స్ కొడితే.. స్టోయినిస్ వరుసగా 4, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు కొల్లగొట్టి జట్టుకు 202 స్కోరు అందించడంలో కీలకమయ్యాడు.

స్కోరుబోర్డు

బెంగళూరు: పార్థివ్ పటేల్ (సి)అశ్విన్(బి)మురుగన్ 43, కోహ్లీ(సి)మణ్‌దీప్(బి)షమీ 13, డివిలీయర్స్ 82 నాటౌట్, అలీ(బి)అశ్విన్ 4, అక్ష్‌దీప్‌నాథ్ (సి)మణ్‌దీప్(బి)విల్జోయిన్ 3, స్టోయినిస్ 46 నాటౌట్, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 202/4; వికెట్ల పతనం: 1-35, 2-71, 3-76, 4-81; బౌలింగ్: రాజ్‌పుత్ 4-0-46-0, షమీ 4-0-53-1, మురుగన్ 4-0-31-1, అశ్విన్ 4-0-15-1, విల్జోయిన్ 4-0-51-1.

పంజాబ్: రాహుల్ (సి)సౌథీ(బి)అలీ 42, గేల్ (సి)డివిలీయర్స్(బి)ఉమేశ్ 23, మయాంక్ (సి)చాహల్(బి)స్టోయినిస్ 35, మిల్లర్ (సి)డివిలీయర్స్(బి)సైనీ 24, పూరన్ (సి)డివిలీయర్స్(బి)సైనీ 46, మణ్‌దీప్‌సింగ్ 4 నాటౌట్, అశ్విన్(సి)కోహ్లీ(బి)ఉమేశ్ 6, విల్జోయిన్(సి)పార్థివ్(బి)ఉమేశ్ 0, అశ్విన్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 185/7; వికెట్ల పతనం: 1-42, 2-101, 3-105, 4-173, 5-176, 6-182, 7-182; బౌలింగ్: సౌథీ 3-0-33-0, ఉమేశ్ 4-0-36-3, సైనీ 4-0-33-2, చాహల్ 2-0-27-0, స్టోయినిస్ 2-0-13-1, అలీ 3-0-22-1, సుందర్ 2-0-21-0.

ipl-table

ipl-runs-wickets

5409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles