ముగిసిన ఆట.. సౌతాఫ్రికా 11/1

Sat,October 5, 2019 05:52 PM

విశాఖపట్నం: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసేసమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోయి 11 పరుగులు చేసింది. సఫారీలకు 395 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 323 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా స్వల్ప వ్యవధిలోనే తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో దుమ్మురేపిన డీన్‌ ఎల్గర్‌(2) వికెట్‌ను కోల్పోయింది. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్గర్‌ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ఆట ముగిసేసరికి 9 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 11 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌(3), డి బ్రుయిన్‌(5) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేసి తొలి టెస్టులో గెలుపొందాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది.

అంతకుముందు టీమ్‌ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ(127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) మెరుపు శతకం, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) విజృంభించడంతో కోహ్లీసేన 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. రోహిత్‌, పుజారా జోడీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(31 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రహానె(27 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.


ఈ ముగ్గురు సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ భారీ షాట్లతో చెలరేగడంతో టీమ్‌ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోరు చేసింది. అనంతరం ఆధిక్యం 390 దాటగానే సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కోహ్లీ డిక్లేర్‌ చేశాడు. నాలుగో రోజు ఆటలో కనీసం 15 ఓవర్ల మ్యాచ్‌ మిగిలి ఉండటంతో ప్రత్యర్థిని లక్ష్య ఛేదనకు భారత్‌ ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే ఆట ముగిసేసమయానికి ఒకటి, రెండు వికెట్లను పడగొట్టాలని భారత్‌ భావిస్తోంది. రెండున్నర సెషన్లకు పైగా ఆటలో పూర్తిగా ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగింది. రోహిత్‌, పుజారా జోడీని విడగొట్టడంలో సఫారీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్లు తేలిపోయారు. పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసిన బ్యాటర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాది బౌలర్లపై ఒత్తిడి పెంచారు. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. రబాడ, ఫిలాండర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

2246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles