పంజాబ్‌పై హైదరాబాద్ విజయం

Tue,April 30, 2019 04:29 AM

SRH beat KXIP by 45 runs

-వాహ్.. వార్నర్
-ధనాధన్ అర్ధసెంచరీతో విజృంభణ
-రాణించిన రషీద్, ఖలీల్
నిలువాలంటే.. గెలువాల్సిందే. ముందడుగు పడాలంటే.. భారీ విజయం కావాల్సిందే. పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ పరిస్థితి ఇది. ఇలాంటి కీలక తరుణంలో హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సీజన్‌లో ఆడుతున్న చివరి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో మొదట భారీ స్కోరు చేసిన రైజర్స్.. ఆ తర్వాత రషీద్ (3/21), ఖలీల్ (3/40) కట్టుదిట్టమైన బంతులతో కట్టిపడేయడంతో అలవోక విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో సహచరులంతా వెనుదిరుగుతున్నా ఒంటరిగా పోరాడిన లోకేశ్ రాహుల్ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టు పరాజయాన్ని అడ్డుకోలేకపోయాడు.

హైదరాబాద్: ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సొంతగడ్డపై ఆడుతున్న చివరి మ్యాచ్‌లో సోమవారం హైదరాబాద్ 45 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు చివరి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో ఆకట్టుకుంటే.. మనీశ్ పాండే (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్ (2/30), షమీ (2/3) రాణించగా.. అఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ (0/66) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. సన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Rashid-khan

రాహుల్ ఒక్కడే..

భారీ లక్ష్యఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ (4) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రాహుల్, మయాంక్ (18 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) మరీ నెమ్మదిగా ఆడటంతో ఇన్నింగ్స్ వన్డేను తలపించింది. రెండో వికెట్‌కు 60పరుగులు జోడించాక మయాంక్ ఔటవడంతో కింగ్స్ ఎలెవన్ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2తో నిలిచింది. అప్పటివరకు చప్పగా సాగిన ఇన్నింగ్స్‌కు నికోలస్ పూరన్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరందించాడు. ఆరు బంతుల వ్యవధిలో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన పూరన్.. స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే అతడి వీరంగం ఎక్కువ సేపు సాగలేదు. భువీ చక్కటి క్యాచ్‌తో పూరన్ డగౌట్ చేరాడు. ఓ వైపు రాహుల్ అడపా దడపా భారీ షాట్లు కొడుతున్నా మరో ఎండ్‌లో మిల్లర్ (11), అశ్విన్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. రషీద్ వరుస బంతుల్లో వీరిద్దరిని వెనక్కిపంపాడు. ఇక లాభం లేదనుకున్న రాహుల్ బ్యాట్‌కు పని చెప్పాడు. వరుస సిక్సర్లతో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 30 బంతుల్లో 90 పరుగులు చేయాల్సిన దశలో అరంగేట్రం కుర్రాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (16) అండతో రాహుల్ రాణించినా.. లక్ష్యం మరీ ఎక్కువగా ఉండటంతో అది సాధ్యపడలేదు. విలియమ్సన్ పట్టిన క్యాచ్‌తో రాహుల్ వెనుదిరగడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి.

ఆది నుంచి ఆఖరిదాక..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభమైంది.. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్ ఆ తర్వాత భారీ సిక్సర్ సంధించాడు. ముజీబ్ వేసిన నాలుగో ఓవర్‌లో వార్నర్ రెండు, సాహా ఓ ఫోర్ కొట్టడంతో స్కోరు రాకెట్ వేగాన్నందుకుంది. షమీ ఓవర్‌లో సాహా 4,6 కొడితే.. అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్ సిక్సర్ బాదాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాసేపటికే మురుగన్ అశ్విన్ ఈ జోడీని విడదీసి పంజాబ్‌కు బ్రేక్‌నిచ్చాడు. స్లో డెలివరీని కట్ చేయబోయిన సాహా.. కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ విలియమ్సన్ కాకుండా గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న పాండే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి వికెట్ పడ్డాక స్కోరు వేగం మందగించడంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ 103/1తో నిలిచింది. ఒక్కసారి కుదురుకున్నాక పాండే, వార్నర్ జోడీ ఎడాపెడా బౌండ్రీలతో స్టేడియాన్ని హోరెత్తించింది. 12 ఓవర్ తొలి బంతికి అశ్విన్ క్యాచ్ వదిలేయడంతో బతికి పోయిన పాండే చక్కటి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో వార్నర్ థర్డ్‌మ్యాన్ దిశగా బౌండ్రీ కొట్టి 38 బంతుల్లో సీజన్‌లో ఎనిమిదో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

ఓవర్‌కు పదికి పైగా పరుగులు సాధించుకుంటూ వెళ్లిన ఈ జంట ఎక్కడ రన్‌రేట్ తగ్గనివ్వలేదు. ముజీబ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ద్వారా బౌండ్రీ రాబట్టిన వార్నర్ చూస్తుండగానే 80ల్లోకి వచ్చేశాడు. వీరి జోరు చూస్తుంటే రైజర్స్ ఇంకా ఎక్కువ స్కోరే చేస్తుందనిపించింది. అయితే అశ్విన్ వీరిద్దరిని ఒకే ఓవర్‌లో వెనక్కి పంపి పరుగుల వేగానికి కళ్లెం వేశాడు. పాండే షార్ట్ ఫైన్‌లెగ్‌లో షమీకి చిక్కితే.. వార్నర్ ముజీబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ముజీబ్ వేసిన 18 ఓవర్‌లో విలియమ్సన్ (7 బంతుల్లో 14; 1 ఫోర్ , 1సిక్స్), నబీ (10 బంతుల్లో 20; 2 సిక్సర్లు) విరుచుకుపడ్డారు. కేన్ 4,6.. నబీ రెండు భారీ సిక్సర్లు బాదడంతో 26 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్‌లో షమీ వీరిద్దరి కథ ముగించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందొచ్చిన రషీద్ (1) ఆకట్టుకోలేకపోగా.. చివర్లో విజయ్ శంకర్ (7 నాటౌట్), అభిషేక్ (5 నాటౌట్) రైజర్స్ స్కోరు 200 దాటించారు. 160/1తో అత్యంత పటిష్ఠంగా కనిపించిన హైదరాబాద్ ఆఖర్లో తడబడి 42 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

స్కోరు బోర్డు

సనరైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) ముజీబ్ (బి) అశ్విన్ 81, సాహా (సి) సిమ్రన్ (బి) మురుగన్ అశ్విన్ 28, పాండే (సి) షమీ (బి) అశ్విన్ 36, నబీ (బి) షమీ 20, విలయమ్సన్ (సి) మురుగన్ అశి ్వన్ (బి) షమీ 14, రషీద్ (బి) అర్శ్‌దీప్ 1, శంకర్ (నాటౌట్) 7, అభిషేక్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 20, మొత్తం: 20 ఓవర్లలో 212/6. వికెట్ల పతనం: 1-78, 2-160, 3-163, 4-197, 5-198, 6-202, బౌలింగ్: అర్శ్‌దీప్ 4-0-42-1, ముజీబ్ 4-0-66-0, షమీ 4-0-36-2, అశ్విన్ 4-0-30-2, మురుగన్ అశ్విన్ 4-0-32-1.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) ఖలీల్ 79, గేల్ (సి) పాండే (బి) ఖలీల్ 4, మయాంక్ (సి) శంకర్, (బి) రషీద్ 27, పూరన్ (బి) భువనేశ్వర్ (బి) ఖలీల్ 21, మిల్లర్ (సి) శంకర్ (బి) రషీద్ 11, అశ్విన్ (సి) పాండే (బి) రషీద్ 0, సిమ్రన్ (ఎల్బీ) సందీప్ 16, మురుగన్ అశ్విన్ (నాటౌట్) 1, ముజీబ్ (బి) సందీప్ 0, షమీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 167/8. వికెట్ల పతనం: 1-11, 2-71, 3-95 4-107, 5-107, 6-160, 7-165, 8-165, బౌలింగ్: ఖలీల్ 4-0-40-3, భువనేశ్వర్ 4-0-34-0, సందీప్ 4-0-33-2, రషీద్ 4-0-21-3, అభిషేక్ 1-0-11-0, నబీ 3-0-28-0.

ipl-table

ipl-runs-wickets

7508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles