నిలవాలంటే గెలవాలి..వార్నర్‌కు ఆఖరి మ్యాచ్..!

Mon,April 29, 2019 03:17 PM


హైదరాబాద్: ఐపీఎల్-12 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి ఆసక్తికర పోరు జరగనుంది. సొంతగడ్డపై లీగ్‌దశలో కేన్ విలియమ్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదే ఆఖరి మ్యాచ్. రాత్రి 8 గంటలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నందున పోరు రసవత్తరంగా సాగనుంది. రెండు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్ కావడం విశేషం.

పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో ఉండగా..పంజాబ్ ఐదో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఇరుజట్లు కూడా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలుపొందాలి. సీజన్ ఆరంభం నుంచి ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తున్న హార్డ్‌హిట్టర్ డేవిడ్ వార్నర్‌కు ఇదే ఆఖరి మ్యాచ్. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్‌తో చేరి ప్రత్యేక శిక్షణలో పాల్గొనేందుకు అతడు టోర్నీని వీడనున్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో వార్నర్ స్థానంలో మార్టిన్ గప్టిల్ ఓపెనర్‌గా రానున్నాడు. ఇప్ప‌టికే జానీ బెయిర్‌స్టో స‌న్‌రైజ‌ర్స్‌ను వీడిన విష‌యం తెలిసిందే.ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్‌లపైనే పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతోంది. వీరిద్దరూ పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తున్నారు. గేల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండటం.. కీలక మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉండటంతో ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. పేపర్ మీద బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ మైదానంలో తేలిపోతుంది. అలాగే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ చేజార్చుకుంది. పంజాబ్ కూడా అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో బలంగానే ఉంది. సొంతగడ్డపై గట్టిపోటీనిచ్చే సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.!

4253
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles