హైదరాబాద్‌ 9 వికెట్లతో కోల్‌కతాపై గెలుపు

Mon,April 22, 2019 03:38 AM

Sunrisers Hyderabad defeated Kolkata Knight Riders by 9 wickets

-హైదరాబాద్‌షా
-బెయిర్‌స్టో, వార్నర్ వీరోచిత ఇన్నింగ్స్
-ఖలీల్‌కు 3 వికెట్లు

అదే దూకుడు.. అదే ఆధిపత్యం.. ప్రత్యర్థులు మారినా.. బెయిర్‌స్టో (43 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (38 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆట తీరు మాత్రం మారలేదు.. బౌలర్ ఎవరైనా.. ఎక్కడా తడబడలేదు.. ఎక్కడా నిలబడలేదు.. బంతి పడితే బౌండరీ లైన్ దాటాల్సిందే అన్నట్లుగా ఉప్పల్‌లో వీరవిహారం చేసిన ఈ జంట.. హైదరాబాద్‌ను మళ్లీ గెలుపుబాట పట్టించింది. ఖలీల్ (3/33) ఇచ్చిన శుభారంభాన్ని అందిపుచ్చుకుంటూ కీలక భాగస్వామ్యంతో చెలరేగిపోయింది. ఫలితంగా మొన్న చెన్నై.. నిన్న కోల్‌కతాపై అలవోక విజయాలతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకొచ్చింది. మరోవైపు వరుసగా ఐదో ఓటమితో నైట్‌రైడర్స్ కుదేలైంది.

హైదరాబాద్: ఐపీఎల్‌లో క్యాచ్‌లు పట్టడం ఎంత ముఖ్యమో.. కోల్‌కతా ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదేమో. సూపర్ ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను రెండుసార్లు వదిలేసి నైట్‌రైడర్స్ ఆటగాళ్లు పెద్ద మూల్యమే చెల్లించారు. ఫలితంగా వీరోచిత బ్యాటింగ్‌తో చెలరేగిన సన్‌రైజర్స్ ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 161 పరుగులు చేసి ఛేదించింది. చెన్నై, బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీపై ఎలాగైతే చెలరేగారో దానిని పునరావృతం చేస్తూ బెయిర్‌స్టో-వార్నర్ బౌండరీల షో చూపెట్టారు. 5, 58 పరుగుల వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌లను కరియప్ప, చావ్లా వదిలేసి పెద్ద తప్పు చేశారు. దీనిని ఆసరాగా చేసుకున్న స్టో.. స్పిన్ త్రయం నరైన్ (0/34), కరియప్ప (0/34), చావ్లా (0/38)ను లక్ష్యం గా చేసుకుని వరుసపెట్టి సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ముగ్గురు తొమ్మిది ఓవర్లలో 106 పరుగులు సమర్పించుకున్నారు. పవర్‌ప్లేలో 72 పరుగులు చేసిన హైదరాబాద్ 10 ఓవర్లు ముగిసేసరికి 109కి చేరింది. 12వ ఓవర్‌లో నరైన్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టిన వార్నర్.. తర్వాతి ఓవర్‌లో పృథ్వీకి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఇక హైదరాబాద్ గెలువాలంటే 40 బంతుల్లో 29 పరుగులు కావాలి. ఈ దశలో వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (8 నాటౌట్) సింగి ల్స్ తీసినా.. చావ్లా వేసిన 15వ ఓవర్‌లో బెయిర్‌స్టో వరుసగా 4, 6, 6తో విజయాన్ని అందించాడు. ఖలీల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

ఖలీల్ సూపర్ స్పెల్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్‌లిన్ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (25 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. మూ డు కీలక వికెట్లు పడగొట్టి కోల్‌కతా స్కోరుకు పగ్గాలు వేశాడు. ఆరంభ ఓవర్లలో చెలరేగే నరైన్ (8 బంతుల్లో 25; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను మూడో ఓవర్‌లోనే వెనక్కి పంపించడంతో తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తన రెండో ఓవర్‌లో గిల్ (3)ను కూడా ఔట్ చేయడంతో కోల్‌కతా 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ (2/35), రషీద్ (1/23), సందీప్ (1/37) కూడా సమయోచితంగా స్పందించడంతో నైట్‌రైడర్స్ పరుగుల వేటలో వెనుకబడింది. ఓ ఎండ్‌లో లిన్ స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్‌లో నితీశ్ రానా (11), దినేశ్ కార్తీక్ (6)ను వరుస విరామాల్లో ఔట్ చేసి హైదరాబాద్ మ్యాచ్‌లో పట్టు బిగించింది. 73/4 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్.. లిన్‌కు చక్కని సహకారం అందించాడు. వికెట్ కాపాడుకుంటూనే రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. ఈ ఇద్దరి జోరుతో ఐదో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 9 బంతుల తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కావడం,. డెత్ ఓవర్లలో భారీ హి ట్టింగ్ చేసే రస్సెల్ (15)ను భువీ కట్టడి చేయడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్: లిన్ (సి) విలియమ్సన్ (బి) అహ్మద్ 51, నరైన్ (బి) అహ్మద్ 25, గిల్ (సి) శంకర్ (బి) అహ్మద్ 3, రానా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 11, కార్తీక్ రనౌట్ 6, రింకూ సింగ్ (సి) రషీద్ (బి) సందీప్ 30, రస్సెల్ (సి) రషీద్ (బి) భువనేశ్వర్ 15, చావ్లా (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ 4, పృథ్వీ రాజ్ నాటౌట్ 0, కరియప్ప నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 159/8. వికెట్లపతనం: 1-42, 2-50, 3-65, 4-73, 5-124, 6-133, 7-146, 8-150. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-35-2, నదీమ్ 4-0-30-0, ఖలీల్ అహ్మద్ 4-0-33-3, సందీప్ 4-0-37-1, రషీద్ 4-0-23-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (బి) పృథ్వీ రాజ్ 67, బెయిర్‌స్టో నాటౌట్ 80; విలియమ్సన్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 15 ఓవర్లలో 161/1. వికెట్లపతనం: 1-131. బౌలింగ్: గుర్నే 2-0-16-0, పృథ్వీ రాజ్ 3-0-29-1, చావ్లా 3-0-38-0, నరైన్ 4-0-34-0, కరియప్ప 2-0-34-0, రస్సెల్ 1-0-8-0.

4008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles