ఆఖరి మ్యాచ్‌లో మిథాలీసేన ఓటమి

Fri,May 10, 2019 03:13 AM

-ఫైనల్లో నోవాస్, వెలాసిటీ
-అయినా ఫైనల్లోకి ప్రవేశం
-ట్రయల్ బ్లేజర్స్‌కు నిరాశ

జైపూర్: మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. జెమీమా రోడ్రిగ్స్ (48 బంతుల్లో 77; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో ఆఖరి మ్యాచ్‌లో సూపర్ నోవాస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ (0.25)పై స్మృతి కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ (-0.30) విజయం సాధిస్తే.. మలి మ్యాచ్‌లో బ్లేజర్స్‌ను మిథాలీ టీమ్ వెలాసిటీ (0.04) చిత్తుచేసింది. తాజా ఫలితంతో అన్ని జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా నిలిచినా.. రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న హర్మన్, మిథాలీ జట్లు తుదిపోరుకు చేరాయి. గురువారం మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులకు పరిమితమైంది. వ్యాట్ (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిథాలీ (40 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. శనివారం ఈ రెండు జట్ల మధ్య తుదిపోరు జరుగనుంది.

వ్యాట్ మెరుపులు:

లక్ష్యఛేదనలో వెలాసిటీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షఫాలీ (2), మాథ్యూస్ (11) వెంటవెంటనే ఔటయ్యారు. అయినా ఎక్కడ వెనక్కి తగ్గని వ్యాట్.. భారీ షాట్లతో విజృంభించింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వెలాసిటీ 46/2తో నిలిచింది. ఆ తర్వాత సూపర్ నోవాస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టిపడేశారు. దీంతో ఒత్తిడికి గురైన వ్యాట్.. పూనమ్‌కు వికెట్ సమర్పించుకుంది. ఇక అక్కడి నుంచి వేద (30 నాటౌట్)తో కలిసి మిథాలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ దశలో 6 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ పోయింది. ఎట్టకేలకు 16 ఓవర్లకు వెలాసిటీ స్కోరు వంద దాటింది. ఈ జోడీ ఫైనల్ సమీకరణాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంతో వెలాసిటీ తుదిపోరుకు చేరినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని తప్పించుకోలేకపోయింది.

అదరగొట్టిన జెమీమా:

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్‌కు శుభారంభం లభించింది. జయంగని (31; 5 ఫోర్లు) ఎడా పెడా ఫోర్లు బాదడంతో పరుగలు రాక సులువైంది. మరో ఎండ్‌లో చక్కటి షాట్లు ఆడిన ప్రియ (16) త్వరగానే ఔటైనా.. రోడ్రిగ్స్‌తో కలిసి జయంగని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి సూపర్ నోవాస్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. జయంగని ఔటైనా.. రోడ్రిగ్స్ ఏ మ్రాతం వెరవకుండా ధాటిగా బ్యాటింగ్ చేసింది. కోమల్ బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదిన జెమీమా.. ఏక్తాకు అదే శిక్ష వేసి 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. డివైన్ (9) ఆకట్టుకోలేకపోయినా.. చక్కటి షాట్లు ఆడిన రోడ్రిగ్స్ జట్టుకు మంచి స్కోరు అందించింది.

స్కోరు బోర్డు

సూపర్ నోవాస్: ప్రియ (సి) వేద (బి) శిఖ 16, జయంగని (స్టంప్డ్) సుష్మ (బి) కెర్ 31, రోడ్రిగ్స్ (నాటౌట్) 77, డివైన్ (సి) మిథాలీ (బి) కెర్ 9, హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 142/3. వికెట్ల పతనం: 1-29, 2-84, 3-134.బౌలింగ్: శిఖ 4-0-17-1, ఆలమ్ 4-0-34-0, కోమల్ 3-0-29-0, మథ్యూస్ 1-0-8-0, ఏక్తా 4-0-31-0, కెర్ 4-0-21-2.

వెలాసిటీ: మథ్యూస్ (ఎల్బీ) అనూజ 11, షఫాలీ (బి) రాధ 2, వ్యాట్ (బి) పూనమ్ 43, మిథాలీ (నాటౌట్) 40, వేద (నాటౌట్) 30, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 130/3. వికెట్ల పతనం: 1-7, 2-21, 3-77, బౌలింగ్: రాధ 4-0-30-1, అనూజ 4-0-28-1, స్కీవర్ 2-0-18-0, డివైన్ 4-0-25-0, పూనమ్ 4-0-13-1, హర్మన్‌ప్రీత్ 2-0-16-0.

3098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles