మరో సిరీస్‌ విజయంపై భారత్‌ గురి..

Wed,August 14, 2019 01:11 PM

teamindia eyes on another series victory

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. రెండో వన్డే గెలిచి ఊపు మీదున్న ఇండియాకు మరో విజయం కష్టమేమి కాదు. ప్రధానంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. గత వరల్డ్‌కప్‌లో ఐదు వరుస సెంచరీలతో చెలరేగిన విరాట్‌ సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. రెండో వన్డేలో సెంచరీతో పాటు అనేక రికార్డులు తిరగరాసిన రన్‌ మెషీన్‌ తిరిగి సెంచరీల ఫామ్‌ అందుకున్నాడు. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా ఫామ్‌ అందుకున్నాడు. ఓపెనర్లు చెలరేగితే విండీస్‌కు తిప్పలు తప్పవు. కానీ, ఇద్దరూ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శిఖర్‌ ధావన్‌ ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇన్‌ స్వింగర్‌లను అంచనా వేయడంలో తడబడుతూ వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. వరుస మ్యాచుల్లో విఫలమవుతున్న గబ్బర్‌ తనను తాను నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం. తదుపరి టెస్టు సిరీస్‌కు అతను ఎంపిక కాని విషయం తెలిసిందే.

నాలుగో స్థానంపై సందిగ్ధత..
వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నాలుగో స్థానంలో స్థిరంగా రాణించలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో ఐదో స్థానంలో చక్కటి ఆట తీరు కనబర్చిన అయ్యర్‌ కెప్టెన్‌ కోహ్లితో కలిసి మ్యాచ్‌ను గెలిపించడంతో.. నాలుగో స్థానంపై మళ్లీ చర్చ మొదలైంది. దీనికి తోడు మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు సునీల్‌ గవాస్కర్‌ కూడా శ్రేయాస్‌ అయ్యర్‌ నాలుగుకు సరిగ్గా నప్పుతాడని అన్నాడు. పంత్‌ను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడించాలని అన్నాడు. కానీ, కెప్టెన్‌ మాత్రం పంత్‌కు మద్దతుగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. షమీ, జడేజా, చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అతనికి సహకరిస్తున్నారు. కుల్దీప్‌ ఎకానమీ కొంచెం ప్రమాదకరంగానే ఉంది. అతను తిరిగి లయ దొరకబుచ్చుకుంటాడేమో చూడాలి. సీనియర్‌ బౌలర్‌ షమీకి విశ్రాంతినిచ్చి టీ20లో సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీ తుది జట్టులోకి తీసుకోవడానికి టీమ్‌ యాజమాన్యం యోచిస్తోంది.

సిరీస్‌ సమం చేయడానికి విండీస్‌ ప్రయత్నం..
ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్క విజయానికి నోచుకోని కరీబియన్‌ జట్టు చివరి వన్డే గెలిచి కేరీర్లో లాస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్‌కు ఘన వీడ్కోలు పలకడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి గేల్‌, పొలార్డ్‌, హోప్‌ సహకరిస్తే విజయం సాధించవచ్చు. ఆల్‌రౌండర్లు ఎలాగూ ఉన్నారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles