ట్రయల్ బ్లేజర్స్‌పై మిథాలీసేన విజయం

Thu,May 9, 2019 04:35 AM

-వెలాసిటీ బోణీ
-మహిళల మినీ ఐపీఎల్ టీ20

జైపూర్: మహిళల టీ20 చాలెంజ్ తొలి పోరు చివరి బంతి వరకు హోరాహోరీగా సాగితే.. రెండో మ్యాచ్ అందుకు భిన్నంగా ముగిసింది. తక్కువ పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ 3 వికెట్ల తేడాతో ట్రయల్ బ్లేజర్స్ పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ బృందంపై.. స్మృతి సైన్యం విజయం సాధిస్తే.. రెండో పోరులో మిథాలీ గ్యాంగ్ స్మృతి టీమ్‌ను చిత్తు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 112 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిస్త్(2/13), అమెలియా కెర్(2/21) చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వ్యాట్ (35 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షెఫాలీ వర్మ(31 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) రెచ్చిపోవడంతో వెలాసిటీ 18 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో దీప్తి శర్మ (4/14) నాలుగు వికెట్లు పడగొట్టింది. వ్యాట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకుంది.

అలవోకగా..

సాధారణ లక్ష్యంతో బరిలో దిగిన మిథాలీరాజ్ నేతృత్వంలోని వెలాసిటీ ఛేదన సాఫీగా సాగింది. ఓపెనర్ మాథ్యూస్ (5) త్వరగానే పెవిలియన్ చేరినా.. షెఫాలీ, వ్యాట్ చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించారు. నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. షెఫాలీ ఔటైనా.. కెప్టెన్ మిథాలీ (17) అండగా వ్యాట్ భారీ షాట్లతో అదరగొట్టింది. టేలర్ బౌలింగ్‌లో 4,6 బాదిన వ్యాట్.. తర్వాత హర్లీన్‌ను లక్ష్యంగా చేసుకుంది. విజయానికి 20 బంతుల్లో 2 పరుగులు అవసరమైన దశలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరుగు తేడాతో 5 వికెట్లు పడ్డాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. 7 బంతుల వ్యవధిలో వ్యాట్, కృష్ణమూర్తి (0), మిథాలీ, శిఖా పాండే(0), కెర్ (0) ఔటయ్యారు. చివర్లో ప్రధాన్ (2 నాటౌట్) రెండు పరుగులు తీయడంతో గెలుపు లాంఛనం పూర్తైంది.

Velocity

హర్లీన్ ఒంటరి పోరాటం

గత మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన యాంకర్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే.. ఈ సారి ఆ బాధ్యత హర్లీన్ తీసుకుంది. కానీ.. స్మృతిలా విరుచుకుపడి భారీ షాట్లు ఆడలేకపోవడంతో ట్రయల్ బ్లేజర్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బ్లేజర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన స్మృతి (10) మరో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించింది. కానీ శిఖ తన తదుపరి ఓవర్ తొలి బంతికే మంధన ఆట కట్టించింది. మరో ఓపెనర్ సుజీ బేట్స్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), హర్లీన్ డియోల్ ఆచితూచి ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి ట్రయల్ బ్లేజర్స్ 34/1తో నిలిచింది. కొన్ని చక్కటి షాట్లతో అలరించిన బేట్స్ లాంగాన్‌లో క్యాచ్‌ఇచ్చి వెనుదిరిగింది. ఈ దశలో ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు టేలర్ (18 బంతుల్లో 5) జిడ్డు ఆట ఆడటంతో స్కోరు మరీ నెమ్మదించింది. మరో వైపు అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన హర్లీన్ గేరు మార్చి భారీ షాట్లకు దిగుతున్న సమయంలో ఔటైంది. కెర్ వరుస బంతుల్లో దీప్తి శర్మ (16), హర్లీన్‌ను పెవిలియన్ పంపింది. చివర్లో ఫుల్మాలి (2) కూడా ప్రభావం చూపలేకపోవడంతో ట్రయల్ బ్లేజర్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

స్కోరు బోర్డు

ట్రయల్ బ్లేజర్స్: బేట్స్ (సి) వేద (బి) ఏక్తా 26, స్మృతి(సి) షఫాలీ (బి) శిఖ 10, హర్లీన్ డియోల్ (సి) కృష్ణమూర్తి (బి) కెర్ 43, టేలర్ (సి అండ్ బి) ప్రధాన్ 5, దీప్తి (సి) మథ్యూస్ (బి) కెర్ 16, ఫుల్మాలి (బి) ఏక్తా 2, హేమలత (నాటౌట్) 1, షకేరా (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 112/6. వికెట్ల పతనం: 1-15, 2-50, 3-68, 4-100, 5-100, 6-103, బౌలింగ్: శిఖ 4-0-18-1, కోమల్ 4-0-23-0, ఏక్తా 4-0-13-2, మాథ్యూస్ 2-0-22-0, కెర్ 3-0-21-2, ప్రధాన్ 3-1-14-1.

వెలాసిటీ: మాథ్యూస్ (బి) దీప్తి 5, షఫాలి (సి) గైక్వాడ్ (బి) హర్లీన్ 34, వ్యాట్ (సి) దీప్తి, (బి) గైక్వాడ్ 46, మిథాలీ (బి) దీప్తి 17, వేద (రనౌట్) 0, సుష్మ (నాటౌట్) 0, శిఖ (బి) దీప్తి 0, కెర్ (బి) దీప్తి 0, ప్రధాన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 18 ఓవర్లలో 113/7. వికెట్ల పతనం: 1-25, 2-63, 3-111, 4-111, 5-111, 6-111, 7-111, బౌలింగ్: షకేరా 2-0-14-0, ఎకెల్‌స్టోన్ 4-0-13-0, దీప్తి 4-0-14-4, గైక్వాడ్ 3-0-28-1, టేలర్ 2-0-24-0, హర్లీన్ 3-0-19-0.

2347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles