ఫెద‌ర‌ర్ వింబుల్డ‌న్ గెలిచేశాడ‌ట‌!

Sun,July 9, 2017 01:40 PM

Wikipedia blunder, Roger Federer claims his eighth crown at Wimbledon

లండ‌న్‌: వికీపీడియా.. దీనిగురించి నెటిజ‌న్లంద‌రికీ తెలిసిందే క‌దా. ప్ర‌ముఖ వ్య‌క్తులు, ప్ర‌దేశాలు, ఇత‌ర అన్ని ముఖ్య‌మైన అంశాల గురించి స‌మ‌గ్ర స‌మాచారం ఇస్తుంది. ఇది చాలా మందికి స‌మాచారం తెలుసుకోవ‌డానికి బాగా ప‌నికొస్తుంది. అయితే అలాంటి వికీపీడియాలో ఓ దారుణ‌మైన త‌ప్పిదం జ‌రిగింది. ప్ర‌స్తుతం వింబుల్డ‌న్ టెన్నిస్ టోర్నీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఈ గ్రాండ్‌స్లామ్ ఇంకా తొలి వారం కూడా పూర్త‌వ‌లేదు. అప్పుడే టోర్నీని ఫెద‌ర‌ర్ గెలిచేశాడ‌ని, అత‌నికి కెరీర్‌లో ఇది 8వ వింబుల్డ‌న్ టైటిల్ అని అత‌ని పేరిట ఉన్న వికీపీడియా చూపించ‌డంతో చాలా మంది షాక్ తిన్నారు. అంతేకాదు ఫైన‌ల్లో ఫెద‌ర‌ర్ 6-0, 6-0, 6-1తో నాద‌ల్‌పై గెలిచాడ‌ని స్కోరు, ప్ర‌త్య‌ర్థిని కూడా ఇవ్వ‌డం విశేషం. అయితే త‌ప్పు తెలుసుకొని దీనిని డిలీట్ చేసేలోగా.. అప్ప‌టికే చాలా మంది స్క్రీన్‌షాట్లు తీసుకొని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైర‌ల్ అయింది.

ప్ర‌స్తుతం టోర్నీలో ఫెద‌ర‌ర్ ప్రిక్వార్ట‌ర్స్ మాత్ర‌మే చేరాడు. మూడో రౌండ్‌లో 7-6, 6-4, 6-4 స్కోరుతో జ‌ర్మ‌నీకి చెందిన మిషా జ్వెరెవ్‌పై గెలిచి నాలుగో రౌండ్ చేరాడు ఫెడెక్స్‌. ప్రిక్వార్ట‌ర్స్‌లో అత‌డు బ‌ల్గేరియాకు చెందిన 13వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్‌తో పోటీ ప‌డనున్నాడు. వికీపీడియా లేనిపోని స‌మాచారాన్నంతా ముందే పెట్టేసినా.. అదే నిజ‌మై కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల‌వాల‌ని ఫెద‌ర‌ర్ అభిమానులు కోరుకుంటున్నారు.

1288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles