బిగ్ బీ ముందు కంటతడి పెట్టిన యువరాజ్!

Wed,November 8, 2017 02:59 PM

Yuvraj singh broke down in KBC show

క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఆటతోపాటు అతను జీవితంలో పడిన కష్టాల గురించి కూడా తెలిసిందే. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువీ.. మరణానికి దగ్గరగా వెళ్లొచ్చాడు. ఓ ప్లేయర్ దృఢమైన మనస్తత్వానికి యువీ చిరునామా. అంతటి క్యాన్సర్‌ను కూడా జయించి మళ్లీ క్రికెట్ ఆడిన ఘనత యువీకే దక్కుతుంది. అలాంటి యువరాజ్ కూడా కంటతడి పెట్టాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోజులను తలచుకొని ఏడ్చేశాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 9 చివరి ఎపిసోడ్‌లో భాగంగా బాలీవుడ్ నటి విద్యా బాలన్‌తో కలిసి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు యువరాజ్ సింగ్. ఈ సందర్భంగా అమితాబ్‌తో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. మధ్యలో క్యాన్సర్‌తో బాధపడిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఓ ప్లేయర్‌గా అంతటి ప్రమాదకర వ్యాధి తనకున్నదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని యువీ అన్నాడు. మొదట్లో డాక్టర్లు చెప్పినా పట్టించుకోకుండా అలాగే ఆడానని, అది కాస్తా ముదరడంతో చికిత్స చేయించుకోక తప్పలేదని యువీ చెప్పాడు. 2011 వరల్డ్‌కప్ విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన కొన్ని నెలలకే యువరాజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడన్న విషయం బయటకు తెలిసింది. ఈ షోలో రూ.25 లక్షలు గెలిచిన యువరాజ్, విద్య జోడీ ఆ మొత్తాన్ని యువీ ఫౌండేషన్ యు వీ కెన్‌కు డొనేట్ చేయనున్నారు.

3510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles