మాస్టర్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ


Sun,March 10, 2019 01:30 AM

Bruce-Lee
మార్షల్ ఆర్ట్స్ .. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చే పేరు బ్రూస్‌లీ.. బక్క పలుచని శరీరం.. అసలు ఎముకలు ఉన్నాయా లేవా అనేలా ఎటుపడితే అటు తిరిగే చేతులు. గాలిలో తేలియాడే శరీరం. చేతులను, కాళ్లను, చివరకు వేళ్లను సైతం కత్తుల్లా తిప్పగల సమర్థుడు. అతని పంచ్ పవర్ మాములుగా ఉండేది కాదు. కేవలం కరాటే వీరుడిగానే కాకుండా నటుడిగానూ తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఆయన చిన్నవయసులోనే అనుమానాస్పదంగా మృతి చెందడం
ఇప్పటికీ అంతుపట్టని విషయమే. అసలు ఆయన మరణ రహస్యామేంటి? ప్రపంచ స్ట్రాంగెస్ట్‌మ్యాన్ బ్రూస్‌లీ చివరిపేజీ.

Bruce-Lee2
1970 కౌలున్ టాంగ్ పట్టణం, హాంకాంగ్ మార్షల్‌ఆర్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన బ్రూస్‌లీ ద గ్రీన్ హార్నట్ (టీవీ షో), బాట్‌మాన్, ఐరన్‌సైడ్, బ్లాన్డీ, ఇయర్ కమ్ ది బ్రైడ్స్, ఎంజాయ్ యువర్‌సెల్ఫ్ టై నైట్ వంటి టీవీ షోలు, మార్లో చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన సమయం. నటుడిగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా బహు పాత్రాభినయం చేస్తున్నకాలం. ఉన్నట్టుండి ఒకరోజు వెన్నెముకలో విపరీతమైన నొప్పి. అప్పటికీ ఆయన వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకు ఆ నొప్పి ఎక్కువవుతున్నది. టీవీ షోల ద్వారా వచ్చిన ఇమేజ్‌తో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వెళ్లాడు.
Bruce-Lee3
అతడి శరీరంపై తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా వెన్నెముకలో నరాలు దెబ్బతిన్నాయి. వీలైనంత ఎక్కువ విశ్రాంతి అవసరం. భవిష్యత్‌లో మార్షల్ ఆర్ట్స్ జోలికి వెళ్లకూడదు ఇది డాక్టర్లు కచ్చితంగా చెప్పిన విషయం. కానీ బ్రూస్ లీ మొండి మనిషి. కొంతకాలం విశ్రాంతి మాత్రం తీసుకున్నాడు. ఆ సమయంలో కూడా జీట్ కునె డుపై పుస్తకం రాశాడు. అయినా నొప్పి తగ్గక పోతే పెయిన్ కిల్లర్స్‌ని మాత్రం ఎక్కువగా మింగేవాడు. 1973 నాటికి లాంగ్‌స్ట్రీట్, ది పియరీ బెర్టన్‌షో టీవీ షోలు, మార్లో, బిగ్‌బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యురీ, ద వే ఆఫ్ డ్రాగన్, గేమ్ ఆఫ్ డెత్, ఎంటర్ ది డ్రాగన్ చిత్రాలతో పాపులర్ అయ్యాడు.

1973, ఏప్రిల్ 10.
గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియో, హాంకాంగ్,

అప్పటికే ఆయన శరీరం పూర్తిగా తనకు సహకరించడం లేదు. ఎంటర్ ద డ్రాగన్ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ తూలిపడ్డాడు. ఆ మరునాడు మరోసారి బాత్రూమ్‌లో పడ్డాడు. శరీరం సహకరించడం లేదని అర్థమైపోతున్నది. ఎంతసేపు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం తప్ప మరే చికిత్స తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. నిరంతరం సినిమా షూటింగ్‌లు, అందులోనూ తనదైన మార్షల్‌ఆర్ట్స్ ప్రదర్శనలు లేని చిత్రమంటూ లేదు. ప్రతి నిమిషం వెన్నెముకలో నొప్పి. అయినా బయటకు కనపించనీయకుండా తనదైన ైస్టెల్ చిత్రా ల్లో దూసుకుపోతూనే ఉన్నాడు. మరణం మీదా ఆయనకు ముందే అవగాహన ఉందో ఏమో గానీ ను వ్వు ఉన్నంతవర కు మరణం నీ వెంటే ఉంటుంది. భయపడితే దూరం కాదుగా అని అంటుండేవాడు.

జులై 20, 1973
బ్రూస్‌లీ నివాసం, హాంకాంగ్ మధ్యాహ్న సమయం

డైరెక్టర్ రేమండ్ చో. బ్రూస్ లీని, జాకీచాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత. ద గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాపై చర్చలు జరపడానికి బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. బ్రూస్ లీ భార్య విండా భర్తకు ముద్దిచ్చి షాపింగుకి వెళ్లింది. సాయంత్రం దాకా చర్చలు జరిగాయి. అక్కడి నుండి ఇద్దరూ కలిసి హీరోయిన్ బెట్టి టింగ్ ఇంటికి వెళ్ళారు. కొద్దిసేపు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారు. ముగ్గురూ జేమ్స్‌బాండ్ ఫేమ్ జార్జ్ లాటిన్ బీ దగ్గరకు వెళ్లాలనుకొన్నారు. రాత్రి ఏడున్నరయ్యిం ది. తనకు కాస్త అలసటగా ఉంది. పది నిమిషాలు విశ్రమిస్తానన్నాడు బ్రూస్ లీ. బెట్టీ ఇంటిలోనే మేను వాల్చాడు. దీంతో బ్రూస్‌లీని బెట్టి ఇంట్లో వదిలేసి రేమం డ్ చో..జార్జిలాటిన్‌బీని కలవడానికి వెళ్ళాడు..బ్రూస్ లీని తరువాత రమ్మన్నాడు. సమయం రాత్రి 7:30 తలనొప్పితో బ్రూస్ లీ విలవిలలాడుతున్నాడు. తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్ ఈక్వజేసిక్ టాబ్లెట్‌ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. సమయం రాత్రి 9 గంటలు. బ్రూస్ లీ వస్తాడని ఎదురుచూస్తున్న రేమండ్ చో.. బెట్టీకి ఫోన్ చేసాడు. బ్రూస్ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ బ్రూస్ లేవలేదు. బెట్టి రేమండ్‌కి పిరిస్థితిని వివరించింది. అరగంట తరువాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టి డాక్టర్ వచ్చాడు. బ్రూస్ కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు.

రాత్రి పదిగంటలు
క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్

అతివేగంగా ఒక కారు ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చింది. ఆ కారునుండి అపస్మారక స్థితిలో ఉన్న బ్రూస్లీని రేమండ్, బెట్టి డాక్టర్ కారు నుండి కిందకు దింపారు. ఆసుపత్రిలో అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్టర్లు బ్రూస్‌లీకి చికిత్స మొదలు పెట్టారు. ఎంతగానో ప్రయత్నించారు. అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారు. అప్పటికే హాంకాంగ్ మీడియా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదనే వార్తను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అప్పటికే ఆయన భార్య పిల్లలు ఆసుపత్రికి చేరుకున్నారు. టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్న లక్షలాది మంది అభిమానులు ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కళ్లన్నీ టీవీ చేసుకుని ఉత్కంఠగా ఎదురు చూస్నున్నారు. ఆసుపత్రి ఎదుట కూడా వందలాది మంది అభిమానులు ఆయన క్షేమంగా కోలుకోవాలని మౌనంగా రోదిస్తూ ప్రార్థిస్తున్నారు.

టిక్..టిక్..టిక్
ఆసుపత్రి ఎదురుగా ఉన్న గడియారం

పదకొండు గంటల సమయాన్ని సూచిస్తున్నది. ఆసుపత్రి లోపల ఏదో తెలియని అలజడి మొదలైంది. డాక్టర్ల ముఖం మీదా రక్తపు చుక్కలేదు. వారు రేమండ్ చోను పిలిచి ఏదో చెప్పారు. ఆయన ముఖంలో రంగులు మారసాగాయి. తెలియకుండానే కండ్లు వర్షించడం మొదలైంది..ఆయన అడుగులు ఆసుపత్రి బయటకు దారి తీశా యి. కోట్లాది అభిమానులు తట్టుకోలేని విషాద వార్తను చెప్పడానికి రేమండ్ చో ప్రిపేర్ అయ్యాడు. వైద్యులు ఆయనను అనుసరించారు. ఆయన బయటకు వచ్చి చెప్పిన ఒకే ఒక మాట బ్రూస్ లీ ఈజ్ డెడ్..

ఎన్నో అనుమానాలు
తలనొప్పిగా ఉన్నప్పుడు హీరోయిన్ బెట్టి ఇచ్చిన టాబ్లెట్‌తో బ్రూస్‌లీ చనిపోయాడా? దీనికి సమాధానం మాత్రం కాదు..అని అనలేం. ఎందుకంటే బ్రూస్ వేసుకున్న ఈక్వజేసిక్ టాబ్లెట్ అతణ్ని చంపేసిందని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు. టాబ్లెట్ రియాక్షన్ అవడంతో మెదడులోకి నీరు చేరింది. సెరెబ్రల్ ఎడెమా బ్రూస్ లీని బలి తీసుకుంది. కాని దీన్ని చివరి నివేదికలో వైద్యులు వెల్లడించలేదు. దీంతో అభిమానులకు బ్రూస్‌లీ మరణంపై అనుమానాలు మొదలయ్యాయి..

గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన బ్రూస్‌లీ మరణానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియలేదు. బెట్టి ఇంట్లోనే మరణించాడు కాబట్టి బెట్టి విషం ఇచ్చి చంపేసిందని కొంతమంది అనుమానం. బ్రూస్ మరణం వెనుక హాం కాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్ లీని అంతం చేసారన్నది చాలామంది నమ్మకం. దీనికి బెట్టి సహాయం చేసిందని కూడా అంటారు. అతని మరణానికి ఈక్వజేసిక్ రియాక్షన్ కారణం కాదని బ్రూస్ పర్సనల్ డాక్టర్ తెలిపారు. బ్రూస్ లీ పై షావోలీన్ మాస్టరుకు కోపం. అందుకే వారే చంపేశారని చాలామంది నమ్ముతున్నారు. కానీ నేటికీ బ్రూస్ మరణం మిస్టరీగానే ఉండిపోయింది. మరోవైపు ఆయన కుంగ్‌పు ఆర్ట్స్‌కు గుర్తింపు తీసుకురావడం ఇష్టం లేని షావోలిన్ మాస్టర్ ఆయనను చంపించాడని చెబుతారు. ఇదిలా ఉంటే, బ్రూస్లీపై విషప్రయోగం జరిగిందని, బ్రూస్లీ ఐకానిక్ స్టేటసును జీర్ణించుకోలేని కొందరు సన్నిహితులు కుట్ర చేసి చంపేశారని ..ఇలా రకరకాలుగా రూమర్స్ వచ్చాయి. దీంతో బ్రూస్లీ మరణం ఓ సంచలన మిస్టరీగా మారింది. లెక్కలేనన్ని సార్లు శవపరీక్షలూ చేశారు. తీవ్రమైన సెరెబ్రియల్ ఎడెమా వల్ల బ్రూస్లీ చనిపోయారని నేరపరిశోధకులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపై కూడా అనుమానాలే వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏండ్లుగా దర్యాప్తు జరిగినప్పటికీ బ్రూస్ లీ మరణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

Bruce-Lee4
బ్రూస్ లీ బతికింది 33 యేళ్లే. చేసింది తక్కువ సినిమాలే. అయితేనేం... తనదైన పంచ్‌ను వదిలి వెళ్లిపోయాడు. బ్రూస్ లీ అంటేనే గుర్తొచ్చే ఎంటర్ ద డ్రాగన్ విడుదలకు ఆరు రోజుల ముందే మరణించడం ఓ విధి వైచిత్రి. అతడి తొలి చిత్రం ద బర్త్ ఆఫ్ మేన్ కైండ్ కావడం, చివరగా తీయాలనుకున్నది ద గేమ్ ఆఫ్ డెత్ కావడం... ఓ యాదృచ్ఛికం. అందుకే గెలిచామా.. ఓడామా.. అన్నది మరచిపో! పోరాటం నుంచి మాత్రం పారిపోకు అంటాడు బ్రూస్లీ. పది వేల కిక్కుల్ని నేర్చుకున్న వ్యక్తి అంటే నాకు భయం లేదు. కానీ, ఒకే ఒక్క కిక్కుని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అంటే నాకు భయం అంటాడు బ్రూస్లీ.

Bruce-Lee1

ఎవరీ బ్రూస్లీ..?

నవంబర్ 27, 1940 సాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించాడు. లీయోచూన్ చైనీయుడు, హాంకాంగ్‌లో ఉంటాడు. తల్లి చైనీస్ సంతతికి చెందిన జర్మన్. వీరిద్దరూ కళాకారులే. ఓ ప్రదర్శన కోసం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్లకు బ్రూస్ లీ పుట్టాడు. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ పాలనలో ఉండేది. అక్కడ చాలామంది వలస వచ్చి ఉండేవారు. అక్కడి వారు గ్రూపులుగా చేరి వలస వచ్చిన వారిపై దాడికి దిగేవారు. బ్రూస్ 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతనిపై దాడి చేశారు. దీంతో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి థామ్ చీ చువాన్ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత సైకో ఇప్ మెన్ దగ్గర స్టూడెంట్‌గా చేరాడు. కుంగ్‌ఫూలో భాగమైన వింగ్ చున్‌లో ఇప్‌మెన్‌ను ఎదిరించే వారే లేరు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. ఇవన్నీ 18 సంవత్సరాల వయస్సులోనే నేర్చుకొని కదిలే కత్తిలా మారాడు.

మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

1408
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles