పునరపి జననం.. పునరపి జీవనం


Sun,March 10, 2019 01:49 AM

Life
ఒకటే జననం.. ఒకటే మరణం ఈ మాట ఎవరన్నారో కానీ.. మంచి మనసుంటే మాత్రం ఒక్కసారి పుట్టి కలకాలం బతకొచ్చు. మనం చచ్చినా పదిమంది ప్రాణంలో ప్రాణంగా బతకొచ్చు. అవును.. అందుకు మనం కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనం చనిపోయిన తర్వాత మన శరీరంలోని అవయవాలు ఇతరులకు ఇవ్వడానికి సంకల్పించుకుంటే చాలు. వారి శరీరాల్లో అమర్చిన మన అవయవాల రూపంలో మనం చనిపోయిన తర్వాత కూడా బతకొచ్చు. చాలామంది పుడతారు.. చచ్చిపోతారు.. కానీ చచ్చినా బతికేలా బతుకుదాం.. అందుకే.. అవయవదానం చేద్దాం.

Life1

Life3

నేను కూడా చేస్తున్నా..

పరాయి పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసిన నాయకుడికి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాగృతి ద్వారా ఆయన పేరు మీద అవయవ దాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. దాదాపు యాభైవేల మందిని అవయవదానానికి ఒప్పించి, సంతకాలు చేయించాలన్న సంకల్పం తీసుకున్నాం. మనుషులుగా మనల్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్న ఆశతో చాలామంది చాలారకాల కార్యక్రమాలు చేస్తారు. కానీ.. అవయవ దానం వల్ల ఒక జీవితాన్నే నిలబెట్టే గొప్ప అవకాశాన్ని మనమందరం ఉపయోగించుకోవాలి. మొన్న కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన అవయవదానం కార్యక్రమంలో చాలామంది యువకులు, టీచర్లు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్, మంత్రి శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జాగృతి సభ్యులు, అవయవదానం కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేశారు. నేను కూడా అవయవదానం ప్రతిజ్ఞ తీసుకున్నాను. వచ్చే ఏడాది యాభైవేల మందితో అవయవదానానికి ఒప్పించడానికి సంకల్పం తీసుకున్నాం. మొగ్గ దశలోనే మార్పు మొదలయ్యేలా పాఠశాలల్లో కూడా అవయవదాన పట్ల అవగాహన, దాని గొప్పతనాన్ని చాటిచెప్పాలి.
- కల్వకుంట్ల కవిత, ఎంపీ, నిజామాబాద్, జాగృతి వ్యవస్థాపకురాలు

Life2
మనం చనిపోయినా మన కండ్లు లోకాన్ని చూస్తాయి. ఒకానొక క్షణంలో ఆగిపోయిన మన గుండె మరణానంతరం స్పందిస్తుంది. మన శరీరం మట్టిలో కలిసిపోయినా.. మన శరీర అవయవాలు మాత్రం ఈ భూమ్మీద ప్రాణాలతోనే తిరుగుతుంటాయి. చీకట్లు నిండిన ఇంట్లో వెలుగు నవ్వులు నింపి, ఆశల దీపాలు వెలిగిస్తుంది అవయవదానం. మనుషులుగా పుట్టిన మనకు కూడా దేవుడయ్యే అవకాశం అవయవదానం ఇస్తున్నది. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి తిరిగి కోలుకునే అవకాశాలు చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అరుదనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని వెంటిలేటర్ మీద ఉంచి ఆ శరీరంలో నుంచి రక్తం, కిడ్నీ, కాలేయంలో నాలుగో వంతు ఇతరులకు దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ వల్ల అచేతనంగా పడిఉన్న వ్యక్తి కండ్లు ఇద్దరికి, కిడ్నీలు ఇద్దరికి, కాలేయం ముగ్గురికి, క్లోమం (ప్రాంకియాస్) ఒక్కరికి, కర్ణభేరి ఇద్దరికి, ఊపిరితిత్తులు ఇద్దరికి, పిత్తాశయం ఒక్కరికి, మూత్రాశయం ఒకరికి అమర్చవచ్చు. నరాలు, ఎముకలు కూడా ఇతరులకు అమర్చడానికి అవకాశం ఉంది.

పాకిస్తాన్‌కు చెందిన ఓ మతబోధకుడు గుండె సంబంధ వ్యాధితో చెన్నైలోని ఫోర్టిస్ మలార్ అనే ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు నీకు గుండెమార్పిడి చేయాలి అని చెప్పారు. అప్పటికప్పుడు గుండెమార్పిడంటే మాటలు కాదు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ హాస్పిటల్‌కి బ్రెయిన్ డెడ్ అయిన కేసు వచ్చింది. ఆ బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి గుండె అమర్చారు. ఆ మతబోధకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు ఆ మతబోధకుడి చిరునవ్వుల్లో తమ కొడుకును చూసుకుంటున్నారు. ఆ పెద్దాయన గుండె చప్పుడులో తన కొడుకు మాటలు వింటున్నారు. ఇప్పటికీ ఆ మతబోధకుడు వారింటికి వచ్చి వెళ్తుంటాడు. పెద్ద మనసు చేసుకొని ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని కాపాడడంతో పాటు, తమ కొడుకు బతికే ఉన్నాడన్న ఆశను కూడా నిలబెట్టింది.

Life4

తెలంగాణ దానగుణం..

అవయవ మార్పిడి చికిత్సను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. అంతేకాదు.. అవయవ దానం గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తత్ఫలితంగా రాష్ట్రప్రదాత, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో అవయవదాన నమోదు కేంద్రాలు, క్యాంపెయిన్‌లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవయవదాత నుంచి సేకరించిన గుండె కాలేయ మార్పిడి చికిత్సలకు పదిలక్షల రూపాయలు, గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి 13.6 లక్షల రూపాయలు, బోన్‌మ్యారో మార్పిడికి 8.7 లక్షల రూపాయలు, కాలేయ మార్పిడికి 13 లక్షల రూపాయలు బాధితులకు చెల్లిస్తున్నది. అవయవాల మార్పిడి చికిత్స కోసం ఇతర రాష్ర్టాల నుంచి సైతం హైదరాబాద్‌కు వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వం అవయవదానానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అవయవదానంపై అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణ ఇలా అన్నీ విభాగాల్లో ఇతర రాష్ర్టాలతో పోటీపడి దూసుకుపోతున్నది తెలంగాణ. తెలంగాణలో 2013 జూన్‌లో మొదలైన జీవన్‌ధాన్ కార్యక్రమం అవయవదానం, ప్రాణదానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నది. ఆ కార్యక్రమాల ఫలితంగానే ఇప్పటి వరకు తెలంగాణలో లక్షకు పైగా అవయవదానం చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24 దవాఖానాలు జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నాయి. అవయవదానం చేయదల్చుకున్న వాళ్లు ఆయా ఆసుపత్రుల్లో కూడా అవయవదాతలుగా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం jeevandan.gov.inకి లాగిన్ అవండి. ఫేస్‌బుక్‌లో www.facebook.com/ jeevandan పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి. అవయవ దానం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.

Life5

నమోదు చేసుకోండి..

అవయవదానం మీద ఉద్యోగులు, చదువుకున్నవాళ్లకు అవగాహన కల్పిస్తున్నాం. కానీ మరిన్ని ప్రాణాలు కాపాడాలంటే ఇది సరిపోదు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అవయవదాతల సంఖ్య పెరగాలి. అప్పుడే పూర్తిస్థాయి విజయం సాధించినట్టు. ఇంకా ప్రచారం, కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. మేము అవయవదానానికి సిద్ధం. ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలి? అని కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా jeevandan.gov.inలోకి లాగిన్ అయి దాతగా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. లేదంటే.. నిమ్స్ దవాఖానాలో కూడా నమోదు చేసుకోవచ్చు. కొంతమంది కలిసి అవయవదాతలుగా నమోదు చేయిస్తామంటే మీరున్న ప్రాంతానికే వచ్చి క్యాంపు నిర్వహిస్తాం.
- డా.స్వర్ణలత, జీవన్‌దాన్ ఇంచార్జి

Life6

నా వంతు కృషి

నాకు 2003లో కిడ్నీ చెడిపోయింది. అప్పటి నుంచి మెడిసిన్‌తో చాలారోజులు నెట్టుకొచ్చా. మా కుటుంబంలో కూడా అందరికీ ఇదే ప్రాబ్లమ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. చివరికి 2012లో మా పిన్ని తన కిడ్నీని నాకు దానం చేసింది. అప్పటి నుంచి చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా. చాలామందికి మంచి కంపెనీల్లో ఉద్యోగమిప్పించి వారు ఈఎస్‌ఐకి అర్హులు అయ్యేలా, తద్వారా వారి ఆరోగ్య సమస్యలు, అవయవాల మార్పిడికి మార్గం సులువు అయ్యే ప్రత్యామ్నాయల గురించి చెప్తూ అవగాహన కల్పిస్తున్నా.
- భగవాన్ రెడ్డి డాకూరి, చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, ఫౌండర్

1 ఏవి?

మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరంలోంచి దాదాపు 200 అవయవాలను దానం చేయవచ్చు. కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దపేగు, చిన్నపేగు, కాలేయం, ఎముకలు, ఎముకల్లో ఉండే మూలుగ వంటివి దానం చేయవచ్చు.

2 ఎప్పుడు సేకరిస్తారు?

చనిపోయిన తర్వాత కొన్నిగంటల్లోనే అవయవాలు సేకరిస్తారు. అవి అమర్చడం కూడా కొన్ని గంటల్లోనే పూర్తి చేయాలి. ఎవరైనా గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి కొన్ని అవయవాలను ఆరు నుంచి 24 గంటల్లోపు సేకరిస్తారు. రోడ్డు ప్రమాదాల్లో, బ్రెయిడ్‌డెడ్ అయి చనిపోయిన వారి అవయవాలను వెంటిలేటర్ మీద నుంచి తొలగించేలోపు సేకరిస్తారు. ఒకవేళ వెంటిలేటర్ నుంచి తొలగించిన తర్వాత 4-5 గంటలలోపు గుండె, 10-12 గంటలలోపు కాలేయం, 24 గంటలలోపు మూత్రపిండాలు సేకరించడానికి అవకాశం ఉంది.

3 ఎప్పుడు ఇవ్వాలి?

చనిపోయిన తర్వాతనే అవయవదానం చేయాలని రూలేం లేదు. బతికుండగా కూడా అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. అమ్మ, నాన్న, తోడబుట్టినవారు, కొడుకు, కూతురు, భార్య ఇలా మీ రక్తం పంచుకుని పుట్టినవారందరికీ బతికుండగా కూడా అవయవాలు దానం చేసి వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇందుకోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బంధుమిత్రులకు అవయవదానం చేయాల్సిన సందర్భంలో మాత్రం తప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారి శరీరం నుంచి అరోగ్యంగా ఉన్న అవయవాలు దానం చేయడానికి అర్హమే. చనిపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న శరీర భాగాలు అవసరం ఉన్నవారికి అమర్చేలా అంగీకారం కూడా తెలుపవచ్చు. అలా చేస్తే చనిపోయిన తర్వాత కూడా బతుకొచ్చు.

అది నిజం కాదు..

మనిషి చనిపోయిన తర్వాత శరీరంలోని ఏ భాగాన్ని తొలిగించకుండా అలాగే దహన సంస్కారాలు చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందనే నమ్మకం చాలామందికి ఉంది. కానీ అది నిజం కాదు. మరణించిన వ్యక్తికి ఆ అవయవాలు ఏమాత్రం పనికి రావు. ఇతరులకు దానం చేయడానికి అవకాశం ఉన్న అవయవాలను దానం చేసి మిగిలిన పార్థివ దేహానికి దహన సంస్కారాలు చేయాలి. ఆ దానం చేసిన అవయవాల రూపంలో ఆ మనిషి ఎంతోకాలం బతికే ఉంటారు. ఒకరి ప్రాణాలు నిలబెట్టి ఆ ఇంటి వెలుగును కాపాడే అవకాశాన్ని వదిలేసి, విలువైన అవయవాలను మట్టిలో కలిపేయడం కరెక్టు కాదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెరుగుతుంది. మూఢనమ్మకాలు తగ్గిపోతున్నాయి. వచ్చిన కొద్దిపాటి మార్పుకే అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. ఈ సంవత్సరం సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన అవయవ దానం క్యాంపెయిన్ వల్ల అవయవ దాతల సంఖ్య తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికి అవయవాలు కావాలన్నా భారతదేశం వైపు, తెలంగాణ వైపు చూడాలి. అక్కడికి వెళ్తే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశలు కలుగాలి. ఆ దిశగా అడుగులేద్దాం. చనిపోయినా.. మళ్లీ బతుకుదాం.

Life7

ఈ నంబరుకు కాల్

చేసి జీవనదాతలు కావొచ్చు : 040 23489494, 8885060092, 8885060093

- ప్రవీణ్‌కుమార్ సుంకరి,
సెల్: 9701557412

1459
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles