ఈమె ఆస్తి.. సుమారు62వేల కోట్లు


Sun,March 17, 2019 01:52 AM

kaily-jennar
పట్టుమని పాతికేండ్లు కూడా లేని ఈ అమ్మడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచి చరిత్ర సృష్టించింది. అది కూడా తాతలు, తండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తి కాదు, సొంతంగా సంపాదించింది. దీంతో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించి సంచలనం సృష్టిస్తున్న ది కైలీ జెన్నర్.

నేను ఏదో ఆశించి వ్యాపారం మొదలుపెట్టలేదు. అసలు ఈ వ్యాపారం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేదు. కానీ, శ్రమ వల్ల వచ్చిన గుర్తింపు నాకు ఆనందాన్నిచ్చింది అంటున్నది కైలీ జెన్నర్.

కైలీ జెన్నర్. ఈ పేరు తెలియని కుబేరులు ప్రపంచంలో చాలా తక్కువమంది ఉంటారు. 21 ఏండ్ల వయసులోనే వేలకోట్లు సంపాదించిన ఈ యువతి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అతి చిన్న వయసులో బిలియనీర్‌గా ఎదిగి యంగెస్ట్ సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా ఫోర్బ్స్ జాబితాలో పేరు సంపాదించింది కైలీ జెన్నర్. అమెరికన్ బిజినెస్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఫోర్బ్స్ తేల్చిన లెక్క ప్రకారం కైలీ జెన్నర్ సంపాదన 900 మిలియన్ డాలర్లు (సుమారు 7 వేల కోట్ల రూపాయలు). అంటే బిలియన్ డాలర్ల జాబితాలో చేరేందుకు ఇంకా వంద మిలియన్ డాలర్లు సంపాదించాల్సి ఉంది. ఇంత చిన్న వయసులోనే అంత సంపాదిస్తున్న తొలి బిలియన్ డాలర్ బేబీగా కైలీ రికార్డు సృష్టించింది. ఏ లక్ష్యం లేకుండా చెడు తిరుగుళ్లు తిరుగుతున్న యువతకు ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండిరా అంటూ ఆదర్శంగా చూపేలా ఎదిగింది. సరిగ్గా మూడేండ్ల క్రితం అంటే.. 2015లో కాస్మోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించిన కైలీ అతి తక్కువ వ్యవధిలోనే ఊహించనంత క్రేజ్ సంపాదించింది. తన కైలీ కాస్మొటిక్స్ పేరుతో ఆమె మార్కెట్లోకి విడుదల చేసిన సౌందర్య ఉత్పత్తులు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఓ సారి కొత్త లిప్‌స్టిక్ కిట్ మార్కెట్లోకి విడుదల చేస్తే కేవలం ఒకే ఒక్క నిమిషంలో 15 వేల కిట్స్ అమ్ముడై సంచలనాత్మక అమ్మకాలుగా రికార్డుకెక్కింది. ఒకేసారి ఐదు లక్షల లిప్‌కాట్లను రకరకాల షేడ్లలో తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసి కాస్మొటిక్ బిజెనెస్‌ని షేక్ చేసింది. కైలీ విజృంభణను చూసిన పెద్ద పెద్ద కాస్మొటిక్ బిజినెస్ పండితులు భయపడ్డారు. తన దూకుడుతో కాస్మోటిక్ ప్రపంచానికి రారాణిగా మారింది. ఆ ఏడాది కైలీ జెన్నర్ ఆర్జించిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 307 మిలియన్ డాలర్లు. తన ఉత్పత్తుల అమ్మకాలు మరింత పెరిగేందుకు ఉల్టా అనే సంస్థతో జతకట్టి మరో 360 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఓ వైపు వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తున్నది కైలీ. 2018 ఫిబ్రవరిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కైలీ అటు తల్లిగా, ఇటు వ్యాపారస్తురాలిగా రెండు పాత్రలును దిగ్విజయంగా పోషిస్తున్నది. ఒలింపిక్ స్వర్ణపతక విజేత కైట్లిన్ జెన్నర్, క్రిస్ జెన్నర్‌ల ముద్దుల కూతురే కైలీ జెన్నర్.

ప్రస్తుత మార్కెట్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ప్రచారం బలంగా చేయాలి. ఈ కిటుకు తెలుసుకుంది కైలీ. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. టీనేజ్ నుంచే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా సెన్సేషన్‌గా లక్షల కొద్ది అభిమానులను సంపాదించుకున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో 128 మిలియన్లు, ట్విట్టర్‌లో 26.7 మిలియన్ల ఫాలోవర్లతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తన కొత్త ప్రొడక్ట్స్ వివరాలు, త్వరలో మార్కెట్లోకి రానున్న ఉత్పత్తుల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నది. చిన్న వయసులోనే అమెరికన్ బిజినెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన కైలీ జెన్నర్ మోడల్‌గా కూడా రాణించింది. కైలీ కంటే ముందు ఫేస్‌బుక్ ప్రధాత మార్క్ జూకర్‌బర్గ్ ఈ ఘనతను 23 ఏండ్ల వయసులో సాధించాడు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో తొలిస్థానంలో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ స్థాపకుడు బిల్‌గేట్స్ రెండోస్థానంలో ఉన్నారు. తన సంపాదనతో కైలీ అమెరికాలోని సంపన్న మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

2682
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles