బొమ్మకాదు.. బొమ్మాళీ!


Sun,March 17, 2019 01:59 AM

La-Pascualita
ఈ ఫొటోలో కనిపిస్తున్న బొమ్మ పెండ్లి దుస్తుల్లో భలే ముచ్చటగా ఉంది కదా! కానీ అది మామూలు బొమ్మ కాదు.. బొమ్మాళి.అద్దాల షోకేసులో ఉన్న అందమైన బొమ్మాళి. ఆ కథేంటో మీరే చదువండి.

ఒక్కోసారి మన కండ్లు మనల్ని మోసం చేస్తాయి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా మనకు కనిపించే వస్తువు, రూపం మనల్ని మనమే నమ్మకుండా చేస్తుంది. అవును.. ఇది నిజం. ఈ ఫొటోలో ఓ దుకాణంలో అద్దాల షోకేసులో అందంగా నిలబడి కనిపిస్తున్న బొమ్మను చూస్తే ఎవరైనా అబ్బా.. ఎంత ముచ్చటగా ఉందో. వధువు దుస్తుల్లో భలే ఉంది. ఈ డ్రెస్ కూడా ఆ బొమ్మకు భలే సూటయింది అనుకుంటారు. కానీ.. అది బొమ్మ కాదు.. శవం అని చెప్తే ఓ పట్టాన నమ్మరు. నమ్మినా, నమ్మకపోయినా అది మృతదేహమనే మాట నిజం. మొదట్లో అందరూ బొమ్మగానే భావించిన ఈ బొమ్మాళి మెక్సికోలోని చిహ్వావా అనే ప్రాంతంలో ఉంది. పస్కులా ఎస్పార్జా అనే వ్యాపారికి చెందిన ఈ దుకాణంలో ఇది ఉంది. అది నిజమైన శవమా? లేక అలా డిజైన్ చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు పెట్టారా? అని స్థానికులను ఆరా తీస్తే అది ఆ షాపు యజమాని కుమార్తె శవం అని చెప్పారు స్థానికులు. ఆమెను ఆయన అల్లారుముద్దుగా చూసుకునేవాడు. ఆమె చనిపోయిన తర్వాత ఖననం చేయకుండా, మృతదేహం చెడిపోకుండా రసాయనాలు పూసి షాపులో పెట్టాడు అని చెప్తారు. 1930 నుంచి ఆ బొమ్మాళి ఆ షాపులో కొలువై ఉందట. లా పస్క్యూలిటా అనే అమ్మాయి మృతదేహమే ఈ బొమ్మ అని చెప్తారు. తొలిరోజుల్లో ఈ బొమ్మను చూసి చాలామంది భయపడ్డారు. దాన్ని చూసేందుకు, ముట్టుకునేందుకు అచ్చం మనిషి చేతుల్లాగే ఉంటాయి. ఎదురుగా ఎవరైనా ఉంటే ఈ బొమ్మాళి వారి కండ్లలోకి కండ్లు పెట్టి చూస్తున్నట్టుగా ఉండేదట. ఒక్కసారి ఆ బొమ్మను చూసినవారికి రాత్రి కలలో కూడా వచ్చి వెంటాడేదట. షాపులో ఎవరూ లేని సమయంలో ఆ బొమ్మ పెట్టినచోట కాకుండా అటూ, ఇటూ తిరుగుతూ ఉండేదని చెప్తున్నారు షాపులో పనిచేసే ఉద్యోగులు.
La-Pascualita1
ఆ వస్త్రదుకాణంలో పనిచేసిన సోనియా బుర్సిగ అనే మహిళ చెప్పిన వివరాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ మృతదేహానికి రోజూ నేనే బట్టలు మార్చేదాన్ని. ఎప్పుడు దగ్గరికి వెళ్లినా నా చేతులు, శరీరం చెమటతో తడిసిపోయేది. ఆమె చేతులు నిజమైన చేతుల్లాగే ఉండేవి. ఆమె కాళ్ల మీద నరాలు ఉబ్బి ఉండేవి. అది బొమ్మ కాదు.. నిజమైన మనిషే అని నమ్మకం అని మీడియాకు చెప్పింది. ఈ మాటలను ఆ షాపు యజమాని పస్కులా కొట్టిపారేస్తూ.. అది నా కూతురు శవం కానే కాదు. కస్టమర్లను ఆకర్షించడానికి వెరైటీగా ఆలోచించి ఇలా ప్లాన్ చేశా అని చెబుతున్నాడు.

ఇంతకీ ఆ షాపులో ఉన్నది బొమ్మనా? ఆ షాపు యజమాని కూతురు శవమా?

పస్కులా కూతురు వెడ్డింగ్ గౌన్లు అమ్మేది. బ్లాక్ విడో అనే విషపు సాలీడు కరువడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే అచ్చం ఆమెలాగే ఉన్న బొమ్మ ఆ దుకాణంలో ప్రత్యక్షమయింది. దీనికి తోడు ఆమెకు ఇష్టమైన వెడ్డింగ్ గౌను ధరించి షాపులో షోకేసులో నిల్చున్నట్టుగా ఉంది. షాపు యజమాని పస్కులా ఆ బొమ్మను లా పస్కూలిటా అని ముద్దుగా పిలుచుకునేవాడు. వధువు వస్ర్తాల్లో అందంగా కనిపించే ఆ బొమ్మను చూసి చాలామంది అక్కడ నిజమైన మనిషే నిలబడి ఉందని భ్రమపడ్డారు. చనిపోయిన తన కూతురు మృతదేహాన్ని రసాయనాలు చల్లి పాడవకుండా చేసి ఇలా షాపులో అద్దాల షోకేసులో పెట్టాడని భావించేవారు. చాలామంది ఆత్రుతతో ఆ బొమ్మను ముట్టుకొని చూశారు. అచ్చం మనిషి వేళ్లను ముట్టుకున్న ఫీలింగే వచ్చిందట. చేయిని పరికించి చూస్తే మనిషికి ఉన్నట్టే చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉన్నాయట. ఆ రోజుల్లో అచ్చం మనిషిని పోలిన వ్యాక్స్ బొమ్మలను తయారుచేసేవారు. ఆ వ్యాక్స్ కళ గురించి తెలిసిన కొంతమంది దాన్ని బొమ్మ అని నమ్మితే, చాలామంది మాత్రం ఆ బొమ్మ షాపు యజమాని కూతురు శవమే అని నమ్మారు. ఆ బొమ్మ.. లేదంటే చాలామంది నమ్ముతున్నట్టు ఆ షాపు యజమాని కూతురు మృతదేహంం ఇప్పటికీ అక్కడే ఉందా?
La-Pascualita2
అది నిజమైన బొమ్మనా? లేక ? అనేది మృతదేహమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ బొమ్మ వెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే షాపు యజమాని పస్కులా, అందులో పనిచేసే ఉద్యోగులు మాత్రమే చెప్పాలి. దీని వెనుక ఉన్న అసలు కోణాన్ని పోలీసులైనా ఛేదించారా అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. మెక్సికోలో ఇప్పటికీ లా పస్కూలిటా పేరు చెప్తే అందరూ దీని గురించే చెప్తారు.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

1268
Tags

More News

VIRAL NEWS