ఆవేశం నుంచి పుట్టిన ఆత్మహుతి దాడి రాజీవ్ హత్య


Sun,March 17, 2019 02:21 AM

rajiv-gandhi
రాజీవ్‌గాంధీ.. ఒక ప్రధానికి మనవడు, ఒక ప్రధానికి కొడుకు. ఆయన కూడా ఒక ప్రధాని. 1980లో ఆయన సోదరుడు సంజయ్‌గాంధీ విమానప్రమాదంలో మరణించడంతో అటు తల్లిని, ఇటు కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా, బహిర్గతంగా అనేక సవాళ్ళు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వడానికి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్‌గాంధీ గెలుపొందడం ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు.1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. 1991 ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్‌గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఎల్‌టీటీఈ ఆత్మహుతి దాడిలో హత్యచేయబడ్డాడు. రాజీవ్‌గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులే ఈ చివరిపేజీ.

1991 ఢిల్లీలోని 10 జన్‌పథ్
రాజీవ్‌గాంధీ నివాసం

నేషనల్ ఫ్రంట్ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలకే తిరిగి ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాడు. అప్పటివరకు ఉన్న అన్ని రకాల సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆయన పర్యాటన అత్యంత ఉత్సాహంగా సాగుతున్నది. ఎక్కడికి వెళ్లిన జనం నీరాజనాలు పడుతుండడంతో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, రాజీవ్‌గాంధే మరోమారు ప్రధాని పీఠం అధిరోహిస్తారనే ప్రచారం జోరందుకుంది.
rajiv-gandhi1

మే 20, 1991

ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజీవ్ ఆ తరువాత నేరుగా ఆయన ఒడిస్సా (నేటి ఒడిశా)లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ పలు బహిరంగ సభల్లో మాట్లాడిన ఆయన మధ్యాహ్న సమయంలో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నియోజక వర్గాలలో పర్యటించారు.

మే 21, 1991

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకొని విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన పర్యటనకు వినిమోగిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎడతెరిపి లేకుండా వినియోగిస్తుండడంతో అది కొంత మొరయించింది. దీంతో రాజీవ్‌గాంధీ కొంత సమయం విశ్రాంతి తీసుకోక తప్పలేదు. నిజానికి ఆయన కూడా ఎక్కడ తీరిక లేకుండా ప్రచారానికి తిరుగుతూనే ఉన్నారు. ఇంతలోనే విమానానికి మరమ్మత్తులు పూర్తయ్యాయని పిలుపు రావడంతో సాయంత్రం 6.30ని, వైజాగ్ నుంచి బయలుదేరి చెన్నై చేరుకొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 8.30 గంటలకు స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మరకతం చంద్రశేఖర్‌తో కలిసి గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ (GWT) రోడ్డులో ఉన్న సభాప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. విపరీతంగా వచ్చిన జనాన్ని చూసిన రాజీవ్‌గాంధీ అప్పటి వరకు ఉన్న అలసటను మరిచిపోయి అత్యంత ఉత్సాహంగా మారిపోయారు.

విపరీతంగా వచ్చిన జనాన్ని కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు కట్టడి చేస్తూనే వి.ఐ.పి.లను కట్టుదిట్టమైన భద్రత ద్వారా ఆయన్ని కలవడానికి అనుమతించారు. అయినప్పటికి రాజీవ్‌గాంధీకి తన కూతురు పాట వినిపించాలని వచ్చిన, మరకతం చంద్రశేఖర్ కూతురు లతా ప్రియకుమార్, అల్లుడు మాగేదిరం, కుమారుడు లలిత్ చంద్రశేఖర్, కోడలు వినోతిని కూడా ఉన్నారు. వినోతిని శ్రీలంకకు చెందిన యువతి. లతా దగ్గర పని చేసే లత కణ్ణన్ అనుమతి పొందిన వారితో పాటుగా మరికొందరు (ఎల్‌టీటీకి చెందిన థాను, శివరాజన్, హరిబాబులు- వీరు దర్యప్తులో ముఖ్యమైన ముద్దాయిలుగా గుర్తించబడ్డారు) కూడా వెళ్ళారు.

అప్పుడు సమయం..

రాత్రి పది గంటల 21 నిమిషాలు కావస్తున్నది నల్లగా, బొద్దుగా 30 ఏళ్లున్న ఒక యువతి ఒక గంధపు మాల తీసుకొని భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది. ఆమె థాను. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే, చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది, వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది. అక్కడ ఉన్న వారి బట్టలకు మంటలు అంటుకున్నాయి. అందరూ అరుస్తున్నారు. భయంతో చుట్టూ పరుగులు తీస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియలేదు.

ఆ సమయంలో వేదికపై రాజీవ్ గాంధీని గౌరవిస్తూ ఒక పాట ఆలపిస్తున్నారు. రాజీవ్ జీవితమే మా జీవితం... ఇందిరాగాంధీ కుమారుడికి సమర్పించని ఈ జీవితం జీవితమే కాదు. అన్నది ఆ పాటకు అర్థం.
అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి ఇక రాజీవ్‌ను చూడడానికి వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు. ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి అక్కడ ఉన్నారు. పొగలు అలుముకోవడంతో రాజీవ్‌గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. ఆయన కూడా అంతిమ ఘడియల్లో ఉన్నారు. ఆయన ఏదో చెప్పాలనుకున్నారు, కానీ ఏం చెప్పలేక ప్రాణాలు వదిలారు. మూపనార్‌కు కాస్త దూరంలోనే జయంతీ నటరాజన్ షాక్‌తో నిలబడి పోయారు. ప్రదీప్ గుప్తా కనిపించారు. ఆయన మోకాళ్ల దగ్గర.. నేలపై ముఖం ఛిద్రమైన ఒక తల కనిపించింది. నా నోటి నుంచి ఓ మై గాడ్.. దిస్ లుక్స్ లైక్ రాజీవ్ అనే మాట వచ్చింది. రాజీవ్ వేసుకున్న లోటో బూట్లు, చేతికి ఉన్న గుస్సీ వాచ్ ఆధారంగా ఆయనను గుర్తించారు. ఈ ఉదంతంలో సుమారు 14 మంది హతులైనారు.

రాత్రి 10 గంటల 25 నిమిషాలు

ఢిల్లీలో రాజీవ్ నివాసం 10, జన్‌పథ్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. అప్పటికే సోనియా, ప్రియాంక కూడా నిద్రకు ఉపక్రమించారు.
రాజీవ్ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ చాణక్యపురిలో ఉన్న తన ఇంటి వైపు వెళ్లిపోయారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఫోన్ రింగ్ వినిపించింది. అవతలి వైపు నుంచి ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి చెన్నైలో రాజీవ్ గాంధీ సభలో బాంబు పేలుడు జరిగిందని చెప్పాడు. జార్జ్ మళ్లీ 10 జన్‌పథ్‌కు పరుగులు తీశారు. మేడమ్, మేడమ్ అని అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు జార్జ్. నైట్ గౌన్‌లో ఉన్న సోనియా వెంటనే బయటికి వచ్చారు. ఏదో జరగరానిది జరిగిందని ఆమెకు అర్థమైపోయింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే జార్జ్, అలా ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. జార్జ్ వణికిపోతున్న గొంతుతో మేడమ్ చెన్నైలో ఒక దాడి జరిగింది. అన్నాడు. సోనియా ఆయన కళ్లలోకి చూస్తూ ఈజ్ హీ అలైవ్ అని అడిగారు. జార్జ్ మౌనమే సోనియాకు జరిగిన ఘోరం గురించి తెలిసేలా చేసింది. సోనియా నిశ్చేష్టులయ్యారు. ఆమె ఆ సమయంలో ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరూ ఆ ఏడుపునకు ఉలిక్కిపడ్డారు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సోనియా, రాజీవ్‌తో గొడవ పడిదంట. రాజీవ్‌ను ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని, మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారని సోనియాగాంధీ ఏడ్చింది. దానికి రాజీవ్ నాకు మరో మార్గం లేదు. నేనెలాగూ చనిపోతా అని నాకు తెలుసు అని అన్నాడట. చివరకు రాజీవ్ గాంధీ చనిపోయారు. కానీ. ఆ రోజు 10 జన్‌పథ్ గోడలు మొదటి సారి సోనియా రోదించడం విన్నాయి. సోనియా ఏడుపుతో ఆ గోడలు దద్దరిల్లాయి. అంతలా రోదించింది ఆమె.
rajiv-gandhi3

ఎందుకు హత్యచేశారు

ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్. నిజానికి రాజీవ్‌గాంధీ హత్య విషయం ఎల్‌టీటీఈలోని చాలామంది ముఖ్యులకు తెలియదని ఆ తర్వాత తెలిసింది. శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాజ్యం కోసం పోరాడుతున్న ఎల్‌టీటీఈ రాజీవ్‌గాంధీని చంపడానికి ప్రధానకారణం ఎల్‌టీటీఈ పట్ల ఆయన అనుసరించిన విధానమేనని అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాల ఆధారంగా నిర్ధారించారు. శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 1987-90ల మధ్య కాలంలో రాజీవ్‌గాంధీ శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు పంపిన సైన్యం చేతుల్లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హతులైపోయారు. దీనితో ప్రభాకరన్ భయపడ్డారు. అంతేకాక డి.ఎమ్.కె పార్టీ LTTEకి సహాయపడుతుంది అని ఆ పార్టీ అధికారాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడం.అతి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ మరల అధికారంలోకి వచ్చి మరల ప్రధానమంత్రి అవటం దాదాపు ఖరార్ అవ్వడం. మళ్లీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపడితే అవే పరిస్థితులు పునరావృతమవుతాయని ఆయన రాజీవ్‌ను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసిన తర్వాత ఆయన హత్య తప్ప మరోమార్గం లేదని ఆ సంస్థ భావించింది. దీంతో తెన్మోజి రాజరత్నం (థాను) ప్రధాన పాత్రదారిగా హత్య చేసేందుకు పూనుకున్నారని వెల్లడైంది.
rajiv-gandhi4

అసలేం జరిగిందంటే...

రాజీవ్‌గాంధీని హత్య చేసిందెవరు అనే విషయంలో అనేక సందేహలు వెల్లువెత్తాయి. అయితే ఈ చర్యపై విచారణ జరపడానికి డి.ఆర్.కార్తికేయన్ (ఐ.పి.ఎస్.) అధ్యక్షతన సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేశారు. ఈ కమిటి హరిబాబు (ముద్దాయిలలో ఒకడు) తీసిన ఫొటోల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ దర్యాప్తు బృంద విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వామ్యులందరూ ఎల్‌టీటీఈ(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) కు చెందిన వారుగా గుర్తించింది. సిట్ హత్య జరిగిన ఏడాదిన్నర తర్వాత నివేదిక సమర్పించారు. 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫొటోగ్రాఫులను పరిశీలించి, వేలాదిమంది సాక్షుల్లో 1044 మంది సాక్షుల వాంగ్మూలాలను ఉదహరిస్తూ, 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించింది. ఈ కేసును సుప్రీం కోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు కె.పిథమస్, ది.పి.వాధ్వా, సయ్యద్ షా మొహమ్మద్ ఖ్వాద్రీల ఆధ్వర్యంలో నాలుగు మాసాలు చర్చ అనంతరం 1995 మే 5 న తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు ఉరి శిక్ష, మరి కొందరిని జీవిత ఖైదు విధిస్తూ ఇది ఉగ్రవాద చర్య కాదు అని అభిప్రాయపడింది.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

1525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles