జలం జీవన బలం


Sun,March 17, 2019 02:40 AM

water
భూగోళంపై సమస్త జీవరాశులు నీటి పునాదిగానే ఉద్భవించి, నీటిపై ఆధారపడి, ప్రధానంగా నీటితో నిర్మితమై మనుగడ సాగిస్తున్నాయి. మనిషి జీవ అస్తిత్వంలోనే కాకుండా, సామాజిక అస్తిత్వంలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పదివేల యేండ్ల క్రితం ఆవిర్భవించిన వ్యవసాయక సమాజాలు, ఆ తర్వాత రెండవ దశ నాగరిక సమాజాలుగా ఆవిర్భవించిన పారిశ్రామిక సమాజాలు నీటి లభ్యతపైనే ఆధారపడి కొనసాగాయి. అందువల్ల సామాజిక జీవన గమనానికి జలమే ఆధారం. నీటిని జాతీయ వనరుగా గుర్తించి..పొదుపుగా వాడుకోవాలని జాతీయ జల విధానం చెబుతున్నది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వృథాగా పోతున్న నీటిని రక్షించుకోవాలని, ప్రజలకు నీరు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ప్రపంచ నీటి దినోత్సవం పై కవర్ స్టోరీ కథనం.
water1
1992లో బ్రెజిల్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నీటి దినోత్సవ ఎజెండాను ప్రవేశపెట్టారు. 1993 మార్చి 22న మొదటిసారిగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వ, ఎద్దడిని అధిగమించడం, మంచినీటి సరఫరా తదితరాలను చేపడుతున్నారు. పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, పొదుపు, నీటి వనరులు జలకళను సంతరించుకోవడం, తాగేనీటిలో పోషకాల సమతుల్యం, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఒక్కో నినాదం (థీమ్) ఆధారంగా ఐరాస ప్రపంచ వ్యాప్తంగా విశేష కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఈ ఏడాది Leaving no one behind. (వెనుక ఎవరూ లేరు) అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించనున్నది.
water3
ప్రపంచ ఉనికికి ప్రాణాధారమైన నీటిని సక్రమంగా వినియోగించుకునే విధానం పైన్నే ఆ దేశ మనుగడ ఆధారపడి ఉంటుంది. జీవం సజీవ జలం అని ప్రముఖ రష్యన్ జీవశాస్త్రవేత్త విఐ వెర్నడెస్కీ వ్యాఖ్యానించారు. అయితే అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు క్రమంగా వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తిలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే నీటి పరిమాణం ప్రాతిపదికగా రూపాంతరం చెందుతున్నాయి. భూగోళంపై ప్రబల, అధీకృత వ్యవస్థగా పారిశ్రామిక విధానం ఆవిష్కృతమైనప్పటి నుంచి గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూతాపం క్రమంగా పెరుగుతూ ఆకస్మిక వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదకర పరిస్థితి ఏర్పడబోతున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమే జీవన గమనంగా కొనసాగుతున్న సమాజ క్రమాన్ని అది భగ్నం చేస్తున్నది.

సురక్షిత నీరేంత?

భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి ఉంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు, 1.7 శాతం భూగర్భ జలాలు, 1.7శాతం మంచు రూపంలో ఉంది. అయితే భూమి మీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో, సరస్సుల్లో, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో ఉంటుంది. ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. ఇంతేకాదు సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1% కంటె కూడా తక్కువ పరిమాణంలో (లేదా, భూమిపై లభించే మొత్తం నీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కానీ, ఇప్పటికీ 88.4 కోట్ల మంది (884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. భూమిమీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకునేలా ఉన్నాయి.
water4

దాగునీరు లెక్క కట్టాల్సిందే

తాగడానికి మాత్రమే కాదు వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు అవసరమే. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిని వర్చ్యువల్ వాటర్ (అంతర్భూత జలం, రూపాంతర జలం, దాగు నీరు) అని వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామికఉత్పత్తుల అంతర్జాతీయ వాణిజ్యంలో ఆయా సరుకుల్లోని దాగు నీరు పరిమాణాన్ని లెక్కగట్టే ధోరణి నేడు ఉనికిలోకి వస్తోంది. అయితే ఆ పద్ధతి ఇప్పటికింకా ప్రామాణికతను సంతరించుకోలేదు. ప్రపంచ నీటి సంక్షోభం తరుముకొస్తున్న నేపథ్యంలో దాగు నీరు ప్రాతిపదికన భవిష్యత్ వాణిజ్య లావాదేవీలు జరుగనున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక వస్తువు ఉత్పాదితం ఉత్పత్తి క్రమంలోని వివిధ దశల్లో దాని తయారీకి వినియోగించిన మంచినీటి మొత్తాన్ని దాగు నీరుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక కిలో బియ్యం ఉత్పత్తికి మూడు వేల నుంచి అయిదు వేల లీటర్ల నీరు అవసరం. ఒక మెట్రిక్ టన్ను గోధుమల్ని పండించాలంటే 1,600 క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. 250 గ్రాముల బరువుండే కాటన్ టీ షర్టులో రెండు వేల లీటర్ల దాగు నీరు ఇమిడి ఉంటుంది. పాడి పరిశ్రమలకు మరింత నీరు అవసరమవుతుంది. 200 మిల్లీ లీటర్ల పాల ఉత్పత్తికి 200 లీటర్ల చొప్పున, ఒక కిలో వెన్న ఉత్పత్తికి 5-7 వేల లీటర్ల చొప్పున నీళ్లు అవసరమవుతాయి. ఒక్క కోడి గుడ్డులో 196 లీటర్ల మిథ్యా జలం ఉంటుంది. రెండు గ్రాములు తూగే కంప్యూటర్ చిప్ తయారీకి 3,200 లీటర్లు నీరు కావాలి. ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300 లీటర్ల నీరు ఖర్చవుతుంది. నిర్జల, అర్థ నిర్జల ప్రదేశాల్లోని నీటి కొరతను అంచనా వేసేందుకు ఈ దాగు నీరు భావన ఉపకరిస్తుంది.

ఎండమావులెన్నో...

ఎండకాలం వస్తుందంటే ఎండిపోయిన నదులు, ఇంకిపోయిన కాలువలు, నీరడుగంటిన బావులే దర్శనమిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. రోజుకు ఒక్క లీటరు తాగునీరు దొరకని గ్రామాలెన్నో. ఎప్పుడో ఒకప్పుడు వచ్చే నీటి ట్యాంక్ ముందు బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తుంటారు. గొంతు తడుపుకొనే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోయే తల్లులు కోకోల్లలు. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటిని తీసుకొచ్చి వడపోసి, కాచి చల్లార్చి తాగాల్సిన దుస్థితి. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు ఉండగలడు. కానీ, నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే ఉండగలడు. రానున్న ఐదేళ్లలో సుమారు 48 దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరుగడం గానీ, తరుగడం గానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునేవారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. అమెరికాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే, ఆఫ్రికాలోని గాంబియా దేశంలో ఒక వ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియాలాంటి చాలా దేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.

జంటనగరాలకు కష్టమే..

నీటి వినియోగం పెరుగడమే కాకుడా భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడేస్తుండడంతో హైదరాబాద్ జంటనగరాలకు నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. వర్షపాతం తగ్గడం, పరిమితికి మించి నీటి వాడకం, వందల అడుగుల మేర బోర్లు వేయడంతో ఆ నీటి మట్టాలు (వాటర్ లేవల్స్) తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా నగరానికి నీటిని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఇతర అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాల్సి ఉంది. విచ్చలవిడిగా బోర్లు వేసే వారిపై కఠినంగా వ్యవహరించడం, వ్యక్తిగత పొదుపుపై అవగాహన కల్పించడం, నీటి అవసరాలకు తగ్గట్లు వాడుకునేలా చర్యలు చేపడితేనే జంటనగరాలకు నీటి కష్టాలు తీరుతాయి.

ఎంతెంత వృథా...

అందుబాటులో ఉన్న నీటిని నిలువ చేసుకునే తెలివి లేని మనం ఎండకాలంలోనో, వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సందర్భంలోనో నీరు.. నీరు.. నీరు అంటూ ఆక్రోశిస్తే ఏమోస్తుంది? నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ, నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఒక కుటుంబం ఒక ఇంటిలో వ్యర్థం చేసే నీటితో ఒక చిన్న గ్రామ అవససరాలను తీర్చవచ్చన్న విషయం ఎంతమందికి తెలుసు? ఇది కొంత అతిశయోక్తిలా అనిపించిన వాస్తవం. పట్టణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి అందే నీటిలో 30 శాతం నీరు వృథాగా పోతున్నది. ఫలితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్క వ్యక్తి 162 ఎల్పీసీడీల నీళ్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 73 ఎల్సీసీడీలు మాత్రమే అందుతున్నది. ఒకప్పుడు ఢిల్లీలో 35 శాతం, ముంబైలో 30 శాతం నీరు వృథాగా పోతుండేది. ప్రస్తుతం అక్కడ సుమారు 15 శాతానికి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఒక హైదరాబాద్‌లో వృథా అవుతున్న నీటిని ఒడిసిపడితే దాహార్తితో అలమటిస్తున్న 15 లక్షల మంది ప్రజల గొంతు తడపొచ్చని అంచనా. ఒక వ్యక్తి షవర్ స్నానం చేయడం వల్ల 150-200 లీటర్ల రు వృథా అవుతుంది. అదే బకెట్‌తో చేస్తే సుమారు 150 లీటర్ల నీరు మిగులుతుంది. బ్రెష్ చేసుకోవడానికి ఒక వ్యక్తి సుమారు 50 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. ఈ వినియోగాన్ని కొంత తగ్గిస్తే నెలకు కనీసం 200 లీటర్ల నీరు మిగులుతుంది. ఇంట్లో ఉపయోగించే అక్వేరియంలోని నీటిని మార్చాల్సి వచ్చినప్పుడు వాటిని పడవేయకుండా, మొక్కలకు పోస్తే నీటి వృథా తగ్గించవచ్చు.
water8

నీటి యుద్ధాలు తప్పవా?

నీరున్న చోటే నాగరికతలు విలసిల్లినట్లు చరిత్ర చెబుతోంది. నదులు ప్రవహించే ప్రాంతాల్లోనే నగరాలు వెలుస్తాయన్నది కూడా వాస్తవం. కానీ, ఆ నీటికోసమే యుద్ధాలు జరగడం వర్తమాన చిత్రపటం మీద కనిపిస్తున్న భీకర సత్యం. పక్కనే సముద్రమున్నా దాహం తీరే దారి కనిపించదు. మంచినీళ్ళ కోసం మరో దిక్కు చూడకతప్పదు. నీటి జాడ లేని ఎడారుల్లో చమురు కోసం యుద్ధాలు జరుగుతుంటే, నదులు పారే ప్రాంతాల్లో నీటి కోసం యుద్ధాలు నిత్యకృత్యం కావడం విషాదం. గాలి, భూమి, నీరు ప్రకృతి ప్రసాదాలు. మానవ మనుగడకు ఉపకరణాలు. అయినా భూమిని చెరబట్టినట్టే నీటిని చెరబట్టడంతో నీటి కోసం పోట్లాటలు అనివార్యమయ్యాయి. కావేరి నది జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటకల మధ్య తరచూ కొనసాగుతున్న వివాదాలు, ఉద్రిక్తతలు గుర్తుకొస్తాయి. ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి.. ఒప్పందాలకు తగ్గట్లుగా దిగువకు నీటిని విడుదల చేయడం లేదన్నది తమిళనాడు వాదన. కర్ణాటకలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నా కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయని, తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నీటిని కేటాయించాలన్నది కర్ణాటక డిమాండ్. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో కృష్ణ, గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు కూడా వివాదాలు సృష్టిస్తున్నాయి.

పొదుపు ఇలా...

నీటిని మనం ఉత్పత్తి చేయలేం. అయితే సంరక్షించగలిగితే ఉత్పత్తి చేసినట్లే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లు లేదా కార్యాలయాల్లో నీటి వృథాను ఆపేయండి. నీటి సంరక్షణే నీటి ఉత్పత్తికి మూలమని గుర్తించాలి. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. అరకిలో కాఫీ తయారవడానికి 11,000 లీటర్ల నీరు అవసరం. అయితే వంట గదిలో వినియోగించిన నీటిని గొట్టం ద్వారా ఇంటి బయట ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంక్‌లోకి పంపించుకొని ఆ నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి శుద్ధి పక్రియ చేపడితే ఆ నీటిని గార్డెనింగ్, వాహనాలను శుభ్రపరిచేందుకు ఉపయోగించుకోవచ్చు. పబ్లిక్ నల్లాల నుంచి వృథాగా నీరు పోతుంటే బాధ్యతగా తీసుకొని కట్టేయండి. రైల్వే స్టేషన్, బస్టాండుల్లో ట్యాపులను ఇప్పి వదిలేయకుండా అవసరం మేరకు వినియోగించుకొని తిరిగి వాటిని కట్టేయ్యాలి. చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడడం నేర్పించడంతో పాటు నీటి అవసరాన్ని అర్థమయ్యేలా వివరించాలి. వ్యర్థమైన నీటిని భూగర్భంలోకి పంపించడానికి ప్రతీ ఇంట్లో, లేదా కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. కొత్తగా నిర్మించే ఇంటికి ఇంకుడు గుంత లేనట్లయితే ఇంటి నిర్మణానికి అనుమతి నిరాకరించాలి.

నీటి పొదుపులో పెద్ద దేశాలుప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే చిన్న దేశాలే నీటి పొదుపు విషయంలో పెద్ద కర్తవ్యాల్ని నెరవేర్చుతున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్లు ఇజ్రాయిల్ వ్యవసాయం మనదేశానికి చాలా అవసరం. ఇజ్రాయిల్‌లో నీరు పొదుపుగా వాడుకునే బిందు, తుంపరసేద్య పద్ధతులను రూపొందించి సమర్థంగా అమలు చేస్తున్నారు. సాధారణ పద్ధతికన్నా దాదాపు 40-50 శాతం తక్కువ నీటితో బిందు సేద్యం ద్వారా పంటలకు నీటిని పారించి 20-30 శాతం వరకు అధిక దిగుబడి సాధించడం ఇజ్రాయిల్ ప్రత్యేకతగా నిలుస్తున్నది. నెదర్లాండ్‌లో 70 సంవత్సరాల క్రితం నుంచే స్వయం ప్రతిపత్తి కలిగిన సాగునీటి సహకార సంఘాలున్నాయి. చెరువులు, కాలువలు, నీటిపారుదల వ్యవస్థ, మరమ్మత్తులు తదితర అన్నింటినీ ఈ సంఘాలే నిర్వహిస్తాయి. రైతులు సామూహికంగా పంటలను వేయడం, ఎంతనీటిని వదలాలనే అంశం, నీటిపొదుపు తదితరాలను సంఘాలే చూస్తాయి. మనదేశంలోనూ ఈ పద్ధతులను అవలంబిస్తే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
water5

మరణాలు పెరుగుతాయి

ప్రపంచవ్యాప్తంగా నీరు లేకుండా సంభవించే మరణాల సంఖ్య కంటే నీటికి సంబంధించిన వ్యాధులతో మరణించేవారే అధికంగా ఉన్నారు. అందులోనూ అతిసారవ్యాధి మూలంగానే మరణించేవారే ఎక్కువ. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 14 ఏళ్లలోపు వారే 85 శాతం మంది మరణానికి గురవుతున్నారు. ప్రతీ 15 సెకన్లకు ఒక్క చిన్నారి నీటి సంబంధ వ్యాధితో చనిపోతుందంటే అతిశయోక్తికాదు. ఇంకో విచిత్రమేంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఈ మరణాల సంఖ్య అధికంగా ఉంది. 99 శాతానికి పైగా మరణాలు ఆయా దేశాల్లోనే జరుగుతున్నాయి.
water6

కాలుష్యమయం

ప్రపంచంలోని మంచినీటిలో 70 శాతాన్ని వ్యవసాయంలో, 22 శాతం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ అవసరాలకు వినియోగించే నీటి నుంచి ప్రతీఏటా1,500 ఘన కిలోలీటర్ల పరిమాణంలో, వ్యర్థమైన నీరు వస్తుంటుంది. అయితే సాధారణంగా దీన్ని అలాగే వదిలేయడం వల్ల భూగర్భంలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్థాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. అలా కాకుండా వ్యర్ధ పదార్థాలను, వ్యర్థమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కానీ, సాధారణంగా అలా జరగడం లేదు. అన్ని రకాల అవసరాలకు పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి, పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచి ఉంది. తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావాల్సిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికీ, నీటి కాలుష్యాన్ని అరికట్టాలనే కనీస అవగాహన ఇంకా కలుగకపోవడం విచారకరం. ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు.
water7

బిలియన్లలో వ్యాపారం

సాగునీటికి ముందే మంచినీరు వ్యాపారంగా మారింది. మంచినీటి వ్యాపారం బహుళజాతి సంస్థలకు లాభాలు సమకూర్చిపెడుతున్నది. ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ 400 బిలియన్ డాలర్లు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలో బ్రాండ్ వాటర్ లీటర్ ఖర్చు 25 పైసలు. నీటి ఖర్చుతో పాటు బాటిల్, బాటిల్స్ కోసం పెట్టే ప్లాస్టిక్ కార్బన్‌తో సహా రూ. 2.50 నుండి రూ. 3.75కు మించదు. కానీ లీటర్ బాటిల్‌ను రూ. 20కి అమ్ముతున్నారు. పన్నులు పోను కంపెనీకి 50 శాతం నికరలాభం వస్తున్నది. 2002లో భారత దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగింది. 1999-2004 మధ్య ప్రతీ సంవత్సరం 25 శాతం చొప్పున ఈ వ్యాపారం పెరిగింది. భారతదేశంలో నీటిని శుద్ధిచేసి అమ్మేసంస్థలు వెయ్యి వరకు ఉన్నాయి. నీటి వ్యాపారం చేసే సంస్థలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. ప్రపంచంలో ఐదుశాతం మంది ప్రజలు బాటిల్ నీళ్ళను తాగితే సంవత్సరానికి రూ. 50 లక్షల కోట్ల నీటి వ్యాపారం చేయవచ్చని మవుదే బార్లే అనే నీటి ఉద్యమ కార్యకర్త బ్లూగోల్ పుస్తకంలో తెలియచేసినట్లు ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. దీన్ని గమనిస్తే నీటి వ్యాపారం ఎంత పెద్దఎత్తున జరుగుతుందో అర్థమౌతుంది.
water9

మానవశరీరం జలదుర్గం

కేవలం భూమిమీదే కాదు మానవ శరీరంలోనూ పెద్దమొత్తంలో నీరు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి శరీరం ఓ చిన్నపాటి నీటిదుర్గం. వ్యక్తి బరువును బట్టి అతని శరీరంలో నీటి శాతాన్ని అంచనా వేయగలం. ఒక వ్యక్తి బరువులో దాదాపు 65శాతం నీరు ఉంటుంది. అదే ఆడవారిలో అయితే శరీర బరువులో 52 శాతం వరుకు నీరు వుంటుంది. మానవుని శరీరంలోనున్న ఎముకలలో 22 శాతం చర్మంలో20శాతం, మస్తిష్కంలో 74.5 శాతం, దంతాలలో 10 శాతం, రక్తంలో 83 శాతం, కండరాలలో 75.6 శాతం నీరు ఉంటుంది. అయితే ఈ నీరు మల, మూత్ర, చెమట, శ్వాసవంటి క్రియల వల్ల బయటకు వెళుతుంటుంది. శరీరం ఎక్కువ నీటిని కోల్పోయినట్లయితే అనారోగ్యానికి గురవుతారు. అందుకే శరీరానికి అవసరమైన మేరకు తిరిగి నీటిని
తీసుకుంటుండాలి.
water10
water11

మిషన్ కాకతీయ

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో పాత చెరువుల పూడికతీత, పునరుద్ధరణ, కొత్త చెరువుల తవ్వకం ప్రాతిపదికన మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారు. మన ఊరు మన చెరువు అనే నినాదంతో వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46,531వేల చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ లక్ష్యం. దీనికోసం 2,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి పునరుద్దరించారు. దీనిద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తీసుకురావలన్నది లక్ష్యం. ఈ పథకం వల్ల అనేక గ్రామాల్లో వేలాది చెరవులు పునరుద్ధరించబడి భూగర్భజలాలు పెరగడంతో పాటు వ్యవసాయ భూములు సాగులోకి వచ్చాయి.

- మధుకర్ వైద్యుల, సెల్: 91827 77409

1303
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles