ఈ పాఠశాలలో ప్లాస్టికే ఫీజు


Sun,May 12, 2019 12:04 AM

టంగ్.. టంగ్.. టంగ్.. స్కూల్ బెల్ మోగింది. భుజానికి పుస్తకాల సంచి, చేతి సంచిల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నింపుకొని పరుగులు పెడుతూ బడిలోకి అడుగు పెడుతున్నారు విద్యార్థులు. బడి అంటే ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన గోడల తరగతి గదులు కాదు.. వెదురు కర్రలతో కట్టిన పందిరి కింద పాఠాలు నేర్చుకుంటారు వారంతా. బాహుబలిలో అనుష్క పుల్లలు ఏరుకోవడం వెనుక ఎంత కథ ఉందో అందరికీ తెలిసిందే.. అట్లాగే ఈ పిల్లలు ప్లాస్టిక్ వ్యర్థాలను తేవడం వెనుక కూడా ఓ ఉద్దేశం ఉంది. ఇదంతా అసోంలోని అక్షర్ పాఠశాలలో నిత్యకృత్యం.

కార్పొరేట్ స్కూల్‌లో ఎక్కడ చూసినా అధిక ఫీజులతో తల్లిదండ్రులు నానాయాతన పడుతున్నారు. భరించలేని వారు పిల్లల్ని స్కూల్ మాన్పిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పాఠశాలకు దూరమయితే దేశంలో నిరక్షరాస్యత పెరుగుతుంది.. ఇలాంటి పరిస్థితులకు తావు ఇవ్వొద్దని తమ వంతు కృషిగా 2016 నుంచి ఉచిత పాఠశాల నడుపుతున్నారు పర్మిత శర్మ, మాజిన్ ముక్తార్ దంపతులు. ఉచితం అంటే డబ్బు తీసుకోరు. కానీ విద్యార్థుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకుంటారు. దాన్నే ఫీజుగా భావించి చదువు చెబుతారు. అది కూడా ప్రతిరోజూ. ఇలా చేయడం వల్ల నివసించే చుట్టూ ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయి. లేదంటే ప్లాస్టిక్ మీద అవగాహన లేనివారు వాటిని కాలుస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి వచ్చే దుర్వాసన పీల్చడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, కమ్యూనికేషన్, ఫైనాన్స్, జాలి, దయ, లీడర్‌షిప్‌లపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.
akshar

అసలు కథ

న్యూయార్క్ నుంచి 2013లో స్కూల్ ప్రాజెక్ట్ పనిమీద మాజిన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో పర్మిత శర్మతో పరిచయం ఏర్పడింది. ఆమె టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సైన్స్‌లో సోషల్ వర్క్ మీద మాస్టర్స్ చేస్తుండేది. వీరిద్దరూ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో కలిసి పనిచేయాలనుకున్నారు. అక్షర్ స్కూల్‌తో వీరి బంధం మొదలవుతుందని అనుకోలేదు. స్కూల్‌ని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ అక్కడ చదువు చెప్పడానికి పిల్లలు ఉంటేగా. డబ్బు కోసం చిన్న పనుల్లో పెడుతున్నారు. పిల్లల్ని బడికి పంపించండి అని అడిగితే.. బడికి పంపిస్తే తర్వాత పెద్ద చదువులు చదివించాలి. అంత డబ్బు మా దగ్గర లేదు పోండి అన్నారు. దీనికి బదులుగా పిల్లలకి ఉచితంగా చదువు చెబుతాం అన్నారు మాజిన్, పర్మిత. ఒక్క పైసా కట్టనక్కర్లేదు అన్నారు. వినగానే అనందంతో గంతులేశారు. అయితే ఒక ఒప్పందం పెట్టారు. పిల్లలు బడికి వచ్చేటప్పుడు ఇంటి చుట్టూ ప్రదేశాల్లో వృథాగా పడి ఉన్న ప్లాస్టిక్‌ని ఏరుకు రావాలన్నారు. దానికేం భాగ్యం. సరే అన్నారు. అలా అప్పటి నుంచి ప్లాస్టిక్ పద్ధతి కొనసాగుతున్నది.

సీనియర్లే టీచర్లు

అక్షర్ స్కూల్ మొదలుపెట్టినప్పుడు 20 మంది విద్యార్థులుచేరారు. అక్కడి నుంచి సంఖ్య 100కు పెరిగింది. వీరంతా 4 నుంచి 15 యేండ్లలోపు వారు. ఒక్కొక్కరు 25 రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తారు. విద్యార్థుల సహకారంతో పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. అక్కడ చదువుతున్న పిల్లలు వారి జూనియర్స్‌కి పాఠాలు చెబుతారు. ప్లాస్టిక్ అమ్మగా వచ్చిన డబ్బుని పిల్లలకే అందజేస్తుంటుంది పర్మిత. రోజుకి రూ. 150 నుండి 200 సంపాదిస్తారు. ఆ డబ్బుతో బొమ్మలు, పుస్తకాలు, బట్టలు, చెప్పులు, స్నాక్స్ కొనుగోలు చేస్తారు. అసోం ప్రజలు చలికాలంలో చలికి తట్టుకోలేక ప్లాస్టిక్‌తో మంట వేసుకునేవారు. ప్లాస్టిక్ వాసన పీల్చడం వల్ల అనారోగ్యానికి గురయ్యేవారు. ఈ తరం పిల్లలు చదువుతోపాటు ప్లాస్టిక్ వల్ల అనర్థాలు తెలుసుకుంటున్నారు. ప్లాస్టిక్ పద్ధతి ప్రారంభించినప్పటి నుంచి అక్కడి వారు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారని ప్రజలు చెబుతున్నారు.

పాఠశాల మాత్రమే కాదు..

2016లో మొదలైన మా పరిచయం 2018లో బంధంగా మారింది. ప్రజలకు ప్లాస్టిక్ గురించి చెబితే వట్టి మాటలు అని కొట్టిపారేస్తారు. అందుకే పిల్లలతోనే మార్పు తేవాలనుకున్నాం. వారు చెబితే పెద్దలు తప్పకుండా వింటారు. అక్షర్ పాఠశాల నుంచి బయటకు వెళ్లిన పిల్లలు మంచి స్థాయిల్లో ఉన్నారు. సీనియర్స్ జూనియర్స్‌కు శిక్షణ ఇస్తుంటారు. జీవితం ఎలా అయినా బతకొచ్చు. ఒకటి గొప్పగా. మరొకటి బీదరికం. ఎవరి జీవితం వారి చేతులోనే ఉంటుంది. ఇందుకు మా పాఠశాలే ఉదాహరణగా మారింది. బిల్డింగ్‌ను బట్టి చదువు అబ్బదు. చదువుకునే వారికి ఎక్కడైనా సరస్వతి స్వాగతం పలుకుతుంది. వెదురు కర్రలతో కట్టిన అక్షర్ పాఠశాలే అందుకు నిదర్శనం. ఇక్కడ చదువు మాత్రమే కాదు, పాటలు పాడడం, డాన్సులు, సోలార్ పానెలింగ్, ఎంబ్రాయిడరీ, కాస్మొటాలజీ, కార్పెంటరీ, గార్డెనింగ్, సేంద్రియ వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, రీసైక్లింగ్ ఇలా అన్ని పనులూ నేర్పిస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో 100 పాఠశాలలు స్థాపిస్తామంటున్నారీ ముక్తార్ దంపతులు.

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles