వాట్సప్ స్ట్రీట్స్


Sun,June 9, 2019 01:58 AM

Kotha-vagodallu
పసునూరి రవీందర్
సెల్: 77026 48825


మరి ఆపదలో వాళ్ల కులం రక్తం దొరకకుంటే సావనైన చస్తరుగానీ, వేరే కులం రక్తం మాత్రం వద్దనుకునే అతిపెద్ద మూర్ఖుల గ్రూపన్న మాట యిది. నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. నాకు ఇక వాట్సాప్ ఓపెన్ చెయ్యాలంటే భయమేస్తున్నది. ఏ గ్రూపు ఎప్పుడు నన్ను వెలేస్తుందో అర్థం కావడం లేదు.

ఊరిడిసి ఇరవయేండ్లయ్యింది. సదువులయ్యెదాక సదువుల లొల్లి. సదువులైనంక ఉద్యోగం లొల్లి. ఏందో జీవితం. ఎప్పుడు ఏదో ఎంటపడి తరుముతున్నట్టే ఉంటది. అందరి సదువుల తీరు వేరు, నా సదువు కథ వేరు.
పటేలా నా కొడుకు బాగ సదువుతాడట. చిన్న బల్లె పంతుల్లు చెప్తున్నరు. పక్కూరు పెద్ద బడికి పంపిద్దామనుకుంటున్న అని పటేలుకు చెప్పిండు మా అయ్య.
దొర లోపల ఏమనుకున్నడో ఏందో...బుస్సున అంతెత్తున లేచిండు. ఎందుకురా ఈరిగా, వాడేమన్న సదివి దేశాలు ఏలేది ఉన్నదారా. సదివింది సాలదా. వచ్చే యేడుదాక సదివిచ్చి, నా దగ్గర జీతం పెట్టు. లేకుంటే వాడు పెద్ద సదువులు సదివినంక నా మాటినడు అన్నడు పటేలు.

నన్ను ఎంతగానో సదివించాలనుకున్న మా అయ్యను పురాగ నారాజు చేసిండు పటేలు.
ఇగ ఆ రాత్రి మా నాయిన నన్ను దగ్గరికి పిలుచుకొని చెప్పిండు. బిడ్డా దొర కొడితే నేను పడతగని, నీకు నా అసొంటి బతుకొద్దు. నువ్ పట్నం పోయి సదువుకో అని అందరూ నిద్రపోయినంక మెల్లగా నన్ను ఊరు దాటిచ్చిండు.
అయినా మా కులపోల్లు సదువుకునుడు దొరలకేంది సూదరోల్లకు కూడా నచ్చదు.
నేను సదువుతున్నందుకు మా అయ్యను వాళ్లు కూడా అనరాని మాటలన్నరు. ఏందిరో ఈరిగా నీ కొడుకు సదువుతున్నడని ఆగుతనే లేవు కదా అని సూటిపోటి మాటలనెటోళ్లు. ఆ మాటలకు మా అయ్య చిన్నబుచ్చుకున్నా, అవేవి లెక్క చెయ్యొద్దు బిడ్డా, నువ్ సదువుతోనే వీళ్లందరిని గెలువాలె అనెటోడు.

నాకు మాత్రం సూదరి (బీసీ) దోస్తులు శానా మందే ఉండే. వాళ్లందరు మంచిగనే ఉండేది గని, వాళ్ల యిండ్లల్లకు మాత్రం రావొద్దని, వస్తే వాళ్ల అయ్యవ్వలు తిడుతరని నన్ను బయిటనే నిలబడమనెటోళ్లు. ఒకవేళ నేను మరిచిపోయి వాళ్లెంట పోతే, నన్ను ఆ యింటి ముసలోల్లు కసురుకునేటోళ్లు. ఏడికొస్తున్నవు పిలగా? నీళ్లు కావాలంటే ఆడ బయిటనే ఉండి అడగరాదు అని కసురుకుందురు.
అట్లా నాకు ఊళ్లె వశపడని అవమానాలు జరిగినయి.
ఊరు నుండి దూరమైనంక శానా మందికి ఊరు మీద ప్రేమ పుట్టుకొస్తదాట. నాకు మాత్రం అట్లా లేదు.
ఎల్లకాలం అవమానాలు పడ్డోనికి తల్సుకోవడానికి ఏముంటయి. అవమానాలు, అవహేళనలు తప్ప. మానని గాయమసొంటి నొప్పి అది.
ఇట్లా జీవితంలో సెటిలయినంక, నా తోటి చదువుకున్న ఊరి దోస్తులంతా ఊరంటే మరిచిపోలేని జ్ఞాపకాల కూడలని, ఐకమత్యానికి, అన్నదమ్ముల ప్రేమకు ఆలవాలమని ఏవేవో చెప్తుంటరు. అవన్నీ వింటే నాకు నవ్వొస్తది. ఊరు ఏడ కలిసున్నదో నాకైతే అర్థం కాదు. వాడలు వాడలుగా విడిపోయి ఉన్నది కదరా అంటే కాదంటరు.

అయినా నొప్పితో తండ్లాడేటోని బాధ, ఎంజాయ్ చేసెటోనికి ఏడ ఎర్కైతదితియ్ అని నేను ఊకున్న. ఇప్పుడంతా సోషల్ మీడియా జమాన.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే, మనిషి సెల్లు చుట్టూ తిరుగుతున్నడు. ఇంతకు ముందు రూపాయి చుట్టూ తిరిగిండు.నాకు చిన్నప్పటి నుండి దేంట్లనైనా ఫస్ట్ ఉండాలనే ఆలోచన ఉండేది. సదువులనైనా, ఆటల్లనైనా, పాటల్లనైనా దేంట్లనైనా ముందుండాలె. లేకుంటే ఈ లోకం నన్ను మరింత తక్కువగా చూస్తదని నాకు ఎరికే.
అందుకే ఇగ ఏ పోటీ పెట్టినా నేనే ముందుంటుండే.
ఇప్పుడు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్, ఐఫోన్ ఏ విషయంలోనైనా అప్‌డేట్‌గా ఉండడం నాకు బాగా
యిష్టం. ఎందుకంటే ఏది తెలువక పోయినా, ఈ కిందికులపోల్లు గింతే. వీళ్లకు ఏది తెల్వదని, ఏమీ రాదని, అల్కగా ఎత్తేస్తరు. పొట్టకోస్తే అచ్చరం ముక్కరాదని పోలికలు చెప్తరు. మరి వాళ్ల పొట్టలల్ల మాత్రం అన్నీ అచ్చరాలే ఉన్నయా. గా మాటలు పడుడు నాకు నచ్చది. అట్లా నేను రోజు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, వాట్సఫ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రంలల్ల నాదైన స్టయిల్‌లో దూసుకుపోతుంటిని.
ఈ మధ్య నాకు ఒక గమ్మత్తయిన అనుభవం ఎదురైంది. నన్ను రకరకాల వాట్సాప్ గ్రూపులల్ల యాడ్ చేసుకున్నరు. నన్ను అడిగింది లేదు చేసింది లేదు. ఏదో మార్కెట్ల అగ్గువకు దొరికిన వస్తువు లెక్క. ఎవ్వడు పడితే వాడు ఏవేవో గ్రూపులల్ల నా ఫోన్ నంబర్‌ను చేర్చుకున్నరు. సరే చూద్దాం లోకం ఎటుబోతుందో మనకు కూడా తెలుస్తది కదా అనుకున్న.

ఫ్రెండ్స్ గ్రూప్
ఫ్రెండ్స్ అంటే ఏ ఫ్రెండ్స్? నాకు డౌటొచ్చింది. ఊళ్లె ప్రైమరీ స్కూల్ నుండి మొదలుపెడితే, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ వరకు బొచ్చెడు మంది దోస్తులు. మరి ఈ బండెడు మందిల ఎవరబ్బా అని ఆ గ్రూపు అడ్మిన్ నంబర్లల్ల చూస్తే, మా ఇంజినీరింగ్ కాలేజ్ ఫ్రెండ్ పెట్టిన గ్రూపు అది. నేను ఇంజినీరింగ్ సదివేటపుడు మా బ్యాచ్‌లో ఎక్కువగా అప్పర్ క్యాస్ట్ దొస్తులే. అప్పటికే వాళ్ల అయ్యలు ఏదో ఒక నౌకర్ చేస్తున్నోళ్లే.
అందుకే వాళ్ల దూకుడు, ధూంధాం వేరే ఉండేది.
ఏసుకునే బట్టల నుండి మొదలు పెడితే, మాట్లాడే మాట తీరు, దేన్నైనా లెక్కచెయ్యక లైట్ తీసుకునే జోరు వాళ్లకు పుట్టుకతోనే వచ్చిందా అనిపించేది. నాతో పెద్దగా ఎవ్వరూ మాట్లాడెటోల్లు కాదు. ఏం కారణమో ఏందో నాకు సమజ్ అయ్యేది కాదు.
హాయ్ ఫ్రెండ్స్ అని ఒక్కసారి ఈ ఫ్రెండ్స్ గ్రూపులో ఉన్న దోస్తులందరిని పలకరించిన. ఆ గ్రూపు అడ్మిన్ నరసింహారావు. హలో మేనేజర్ సాబ్, బ్యాంకు మేనేజర్‌వి అయినవట కదా. మమ్ముల గుర్తుపట్టినవా లేదా అన్నడు.
అరె గుర్తు పట్టకుండ ఎట్లుంట అని కుశల క్షేమాలు అడిగినంక. ఇగ జూసుకో రోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు చెప్పెటోళ్ల సంఖ్య ఎక్కువైంది. ఏందీ టార్చర్ అనిపించేది. సరే చూద్దాం వీళ్ల పైత్యమేందో అనుకున్న.
సడెన్‌గా ఒక రోజు ఒక మెసేజ్ చూసి షాకైన.
ఒక టోల్‌గేట్ దగ్గర కార్లన్నీ ఆగి ఉన్నయి. ఆ గేట్ల దగ్గర ఒక గేట్‌కు ఓసీ, ఒక గేటుకు బీసీ అని మరో
గేటుకు ఎస్సీ,ఎస్టీ అని రాసి ఉంది.

ఓసీ వాళ్ల కార్ల లైనుకు ఎంట్రీ ఫీజు 90రూపాయలు అని రాసి ఉంది.
బీసీ వాళ్ల కార్ల లైనుకు 50రూపాయలు అని రాసి ఉంది.
ఎస్సీ ఎస్టీ వాహనాలకు ఫ్రీ అని రాసి ఉంది.
ఇదీ ఇండియా వెనక బడడానికి కారణం ! అని ఆ ఫొటో కింద రాసి ఉంది.
నాకు రక్తం తుకతుక ఉడికింది. ఏందీ దారుణం. ఎస్సీఎస్టీలు అన్నీ ఫ్రీగా పొందుతున్నరని ఓసీలు కుట్రపూరితంగా అది తయారు చేశారని నాకు అర్థమైంది. ఇదే ఏడుపు నేను ఇంజినీరింగ్ చదివేటపుడు కూడా హాస్టల్ రూములల్ల రోజూ వినిపించేది. మీకేంది భయ్, అన్నీ ఫ్రీ. మీరు దేవుని బిడ్డెలు అనెటోళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా దొరికేసరికి అదే రాగాన్ని మరింత క్రియేటివ్‌గా వినిపిస్తున్నరు.
నేను అడిగిన ఇదేంది భయ్, ఈ దేశంల ఎస్సీఎస్టీల బతుకులు ఎక్కడున్నయ్. ఓసీల బతుకులు
ఎట్లున్నయ్. ఏందీ పోస్ట్ ఉద్దేశం? అన్న. ఇగ జూస్కో నా మీద అందరూ కలిసి మూకుమ్మడిగా ఇరుసుక పడ్డంత పని చేసిన్రు. రిజర్వేషన్లు తీసెయ్యాలె. ఇంక ఎంతకాలమని ఒకడు. మాకు నైంటీఫై పర్సెంటేజ్ మార్కులు వచ్చినా సీట్లొస్తలేవని ఒకడు. ఉన్న ఉద్యోగాలన్నీ రిజర్వేషన్ పేరుతో తన్నుకు పోతున్నరని మరొకడు. అసలు దళితులు వెనుకబడ్డరు అంటరుగాని, మాకంటే జోర్‌దార్ కార్లు మెంటెయిన్ చేస్తున్నరని మరొకడు. అసలు అమెరికాలాంటి దేశాలు బాగుపడుతూ, ఇండియా ఇట్లా అగోరించడానికి కారణం ఈ రిజర్వేషన్లే అని నా మీద అరిచినంత పని చేసిన్రు.

నేను ఏమన్న తక్కువ తిన్ననా. వీళ్లకంటే నాలుగు పుస్తకాలు ఎక్కువే సదివిన. అందుకే ఇక అంకెలు సంఖ్యలతో చెప్పుకొచ్చిన. పార్లమెంటులో 545 సీట్లుంటే, మీవి ఎన్ని మావి ఎన్ని?
దేశంలో వందలాది కంపెనీలు ఉంటే మీవి ఎన్ని మావి ఎన్ని?
ఉద్యోగాల్లో మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత?
అసలు రిజర్వేషన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. రిజర్వేషన్ల ద్వారా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలకు ఒరుగుతున్నది ఎంత? విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, సినిమా, టీవీ, పొలిటికల్ రంగాలల్లో ఎవరి వాటా ఎంతా? అని మొత్తం అంకెలు సంఖ్యలతో డాటా మొత్తం వాళ్ల ముందుంచిన. అందరి నోళ్లు మూతపడ్డయి.
ఏమనుకున్నరో ఏమో ఒక మూడు రోజుల తర్వాత, నాకు అడ్మిన్ మిత్రుడు నరసింహారావు ఒక మెసేజ్
పెట్టిండు. డియర్ శ్రీనివాస్, మీ సమాధానాలు, ప్రశ్నలు బాగానే ఉన్నాయి. కానీ, గ్రూపు సభ్యుల్లో మెజారిటీ సభ్యుల నిర్ణయమే ఫైనల్. మిమ్మల్ని ఈ గ్రూపు నుండి డిలీట్ చెయ్యమని నా పైన ఒత్తిడి తెస్తున్నరు. మీరు ఏమనుకోకండి అని.
అంటే నిజాలు మాట్లాడితే ఊళ్లె బహిష్కరించినట్టు ఇక్కడ కూడా వెలేస్తేరా? అన్న.
ఏ అట్లకాదు సీనుభయ్, లైట్ తీసుకోండి అని బుజ్జగించిండు.

నాకు ఇదేం కొత్తకాదు. పర్వాలేదని రిప్లయి ఇచ్చి. వాళ్లు నన్ను డిలీట్ చేయకముందే నిజాలను అంగీకరించలేని మూర్ఖులున్న చోట నేను ఉండలేను. గుడ్‌బై అని వాళ్ల మొఖాల మీద కొట్టినట్టే చెప్పి మెసేజ్ పెట్టి ఆ గ్రూపు నుండి బయటికొచ్చిన.
ఆ గ్రూపును పర్మినెంటుగా నేనే డిలీట్ చేసేసిన.
ఈ సంఘటన నాలో ఒక ఆవేదనను ఆలోచనను రేపింది.
పేరుకు ఫ్రెండ్స్ అని గ్రూపు క్రియేట్ చేసి, ఇట్లా విష ప్రచారాలు చేయడం దారుణం అనిపించింది.
ఎటు బోతున్నది ఈ లోకం. అచ్చం మా ఊరులాగే ఉన్నది అనిపించింది.
ఇలాంటి సమయంలోనే ఒకరోజు మరో కొత్త గ్రూపులో నన్ను మళ్లీ ఎవరో యాడ్ చేశారు.
ఈ గ్రూపు పేరు అవర్ బ్లడ్.

అంటే మనలో ఎవరికైనా రక్తం అవసరమైతే, వేరే కులాల రక్తం వద్దు. మన కులపు రక్తమే తీసుకోవాలని ఈ గ్రూపు పెట్టమని వివరణ ఉంది. ఇంతకూ ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసిన వాళ్లు ఎవరా అని చూస్తే...అది మా బ్యాంక్ ఆఫీసర్స్‌లో ఎవరో ఏర్పాటు చేసిన గ్రూపు అది.
బ్యాంకు మేనేజర్‌గా ఉన్నందుకు పొరపాటున నన్ను కూడా వాళ్ల కులమే అనుకున్నట్టున్నారు అని నవ్వుకున్న. అరగంటలోనే నన్ను ఆ గ్రూపు నుండి తీసేశారు. పర్సనల్‌గా మాత్రం సారీ అనుకోకుండా మిమ్మల్ని యాడ్ చేశాము. మీది మా కులమే అనుకున్నాము, తరువాత కాదని తెలిసింది అని వివరణ ఇచ్చారు.
మరి ఆపదలో వాళ్ల కులం రక్తం దొరకకుంటే సావనైన చస్తరుగానీ, వేరే కులం రక్తం మాత్రం వద్దనుకునే అతిపెద్ద మూర్ఖుల గ్రూపన్న మాట యిది. నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు.
నాకు ఇక వాట్సాప్ ఓపెన్ చెయ్యాలంటే భయమేస్తున్నది. ఏ గ్రూపు ఎప్పుడు నన్ను వెలేస్తుందో అర్థం కావడం లేదు. నాకిప్పుడు వాట్సాప్‌లో మా వెనుకబడిన ఊరి వాడలన్నీ కనిపిస్తున్నాయి.
ఒక్కో గ్రూపు ఒక్కో మోడ్రన్ వాడలా ఉంది.
కాకుంటే అన్నీ నన్ను వెలేసే కుల కొత్తగోడల వాడలే.
మనిషిని మనిషిగా గౌరవించే ఒక కొత్త మనుషుల గ్రూపు కోసం నా అన్వేషణ కొనసాగుతూనే ఉంది.
దాన్ని నేనే క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నా.

5312
Tags

More News

VIRAL NEWS