బఫెట్ లంచ్ ఖరీదు రూ. 23 కోట్లు !


Sun,June 9, 2019 02:01 AM

BUFFET
ప్రపంచ సంపన్నుల్లో దిగ్గజం ఆయన. సంపాదనలోనే కాదు సాయం చేయడంలోనూ ఆయన ముందుంటాడు. మనిషి గొప్పతనం అతని సంపాదనలో కాదు. ఔదార్యంలో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తిత్వం కలిగిన మహోన్నతుడు వారెన్ బఫెట్. ఆయన పేరు వినగానే అందరిలో ఓ రకమైన ఉద్విగ్నత పేరుకుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టైర్లెతే వారెన్ బఫెట్ పేరు వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని కోట్లు వెచ్చించి మరీ కొనుక్కుంటున్నారు. వేలం పాట ద్వారా ఆ చాన్స్ దక్కించుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు పోటీ పడుతున్నారు.

90 ఏండ్లు దాటినా ఇప్పటికీ తన జీవనశైలిలో ఎటువంటి మార్పు లేకుండా 40 ఏండ్ల నుంచి ఒకేలా గడుపుతున్నారు. రోజులో 80 శాతం సమయాన్ని పుస్తకాలు చదవడానికే కెటాయిస్తుంటారు.

ప్రపంచ కుబేరులంతా బఫెట్‌తో కలిసి లంచ్ చేయడం కోసం కోట్లు కుమ్మరిస్తున్నారంటే ఓ కారణం ఉంది. బఫెట్‌తో భోజనం చేసే సమయంలో వ్యాపారాలను అభివృద్ధికి అవసరమైన రహస్య సూత్రాలను పంచుకుంటారట. గతంలో ఆయనతో లంచ్ చేసిన ఎంతోమంది వ్యాపార దిగ్గజాలు ప్రస్తుతం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నారు. అందుకోసమే వారెన్ బఫెట్‌తో లంచ్ అనగానే సంపన్న వర్గాల వారందరూ ఆసక్తి చూపుతుంటారు. లంచ్ చేసేందుకు ప్రత్యేకంగా వేలం నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. కలలు కనడం వేరు... వాటిని నిజం చేసుకోవడం వేరు. చాలామంది స్టాక్ మార్కెట్‌లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు అవసరమైన కృషి చేయరు. బఫెట్ మాత్రం తనదైన శైలిలో స్టాక్ మార్కెట్‌ను లొంగదీసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ సంపన్నుల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. అసలు ఆయన స్టాక్ మార్కెట్‌లో అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ఎటువంటి షేర్లను ఎన్నుకుంటే లాభాలు గడించవచ్చు? అనే ప్రశ్నలకు బఫెట్‌తో కలిసి లంచ్ చేసే చాన్స్ దక్కించుకునే వారికి మాత్రమే సమాధానాలు దొరుకుతాయి. సమాధానాలు తెలుసుకున్న వారు అపర కుబేరులైనట్లే. అంతేకాదు, ఆయనతో భోజనం చేసేందుకు ఎంత మొత్తం వెచ్చించారో అంతకు పదిరెట్లు సంపాదించేందుకు వారెన్ బఫెట్ అందించే వ్యాపార మెళకువలు ఉపయోగపడుతాయని వారు నమ్ముతారు.

వేలం ఎందుకంటే !

వారెన్ బఫెట్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పవర్ లంచ్ పేరుతో గత 20ఏండ్లుగా వేలం నిర్వహిస్తున్నది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బఫెట్ దాతృత్వ సంస్థ ైగ్లెడ్ ఫౌండేషన్‌కు కేటాయించనున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, నిరుపేద వారికి అవసరమైన సేవలను అందించేందుకు ఖర్చు చేస్తుంటారు. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దీని ద్వారా ైగ్లెడ్ ఫౌండేషన్‌కు (30 మిలియన్ డాలర్లు) రూ.208 కోట్లు వచ్చాయి. విశేషమేమిటంటే వేలం పాటలో గెలిచిన వాళ్లు వారితోపాటు మరో ఏడుగురు వ్యక్తులను కూడా బఫెట్‌తో భోజనం చేయవచ్చు. ఈ ఏడాది వేలం రూ.17,47,000తో ప్రారంభమైంది. ఇప్పటికే రూ. 23 కోట్ల వరకూ చేరుకున్నది. బిడ్డింగ్ ముగిసే వరకు ఎంతకు వెళుతుందో వేచి చూడాలి. 2018లో జరిగిన పవర్‌లంచ్ వేలం రూ.22 కోట్లు కాగా, 2012లో ఓ వ్యక్తి రూ.24 కోట్లు చెల్లించి బఫెట్‌తో కలిసి భోజనం చేశాడు. మరో విశేషమేమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్ అయిన స్మిత్ అండ్ వోలెన్‌స్కీ స్టీక్ హౌజ్‌లో లంచ్ ఏర్పాటు చేస్తారు.

జ్ఞానాన్ని చక్రవడ్డీలా భావిస్తాడు

ప్రపంచ ధనికుల జాబితాలోనే అగ్రస్థానంలో ఉన్న వారెన్ బఫెట్ చిన్నతనం నుంచే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆనాడు సేల్స్‌మన్, పేపర్ బాయ్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఈనాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 11ఏండ్ల ప్రాయంలోనే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించడం ఆరంభించారు. 16 ఏండ్ల వయసులో వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టి రూ. 36లక్షలకుపైగా సంపాదించారు. పెట్టుబడి రంగంలోని విజయ రహస్యాలను తెలుసుకున్నారు. అత్యంత చిన్న వయసులోనే ఆ రంగంలో రాణించారు. తెలివితేటలుంటే ప్రపంచంలో డబ్బు సంపాదించడం కంటే మరొక సులువైన పని లేదని నిరూపించాడు వారెన్ బఫెట్. 90ఏండ్లు దాటినా ఇప్పటికీ తన జీవనశైలిలో ఎటువంటి మార్పు లేకుండా 40 ఏండ్ల నుంచి ఒకేలా గడుపుతున్నారు. రోజులో 80 శాతం సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తుంటారు. స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్తా పత్రికలు, వీక్లీ, మంత్లీ వంటివి రోజుకు 500పేజీలకుపైగా చదువుతుంటారు. ఎక్కువగా చదవడం వల్ల జ్ఞానం చక్రవడ్డీలా పెరుగుతుందని భావిస్తుంటారాయన. అందుకోసమే వారెన్ బఫెట్ అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు.

678
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles