దైవ రహస్యం


Sun,June 30, 2019 12:36 AM

నారదుడు దేవతలలో ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే అతను స్వర్గానికి భూమికి అనుసంధానం లాంటివాడు. భూలోక, స్వర్గలోక సంచారి. భూమిలో జరిగే విషయాల్ని స్వర్గలోకంలో చెబుతారు. స్వర్గ లోకంలోని విషయాల్ని భూవాసుల కంటిస్తాడు. నిరంతరం నారాయణ జపంలో తేలియాడుతూ ఉంటాడు.ఒకరోజు నారదుడు శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి తలవంచి నమస్కరించాడు. స్వామీ! నిరంతరం నీ నామజపంలో నేను పునీతుణ్ణి అన్నాడు.విష్ణువు నారదా! అంతేకాదు నువ్వు భూలోకంలో నా భక్తుల్ని చూసి వాళ్ళతో సంబంధం కలిగి ఉండడం వల్ల కూడా ఎంతో అదృష్టవంతుడివి. అక్కడ నీకు పవిత్రమైన అనుబంధం అనివార్యంగా సమకూరుతూ ఉంటుంది. సృష్టి స్థితిలయల్తో సంబంధమున్న వ్యక్తివి నువ్వు అన్నాడు.
Daiva-rahasyam

నారదుడికి మహావిష్ణువు చెప్పిన మాటల ఆంతర్యం అంతుబట్టలేదు. మీ మాటల్లో ఏదో మార్మికం ధ్వనిస్తున్నది అన్నాడు. విష్ణువు నీకు అసలు రహస్యం బోధ పడాలంటే వింధ్య పర్వతం మీద ఒక మహావృక్షం ఉంది. ఆ వృక్షానికి ఒక తొర్ర ఉంది. అక్కడ ఇప్పుడే గుడ్డు పగిలి కళ్ళు తెరిచిన ఒక పిట్ట ఉంది. దాని దగ్గరకు వెళ్ళు. నీకు విషయం బోధపడుతుంది అన్నాడు.నారదుడు ఆశ్చర్యంగా అసలు రహస్యం గ్రహించడానికి వెంటనే ఆ వింధ్య పర్వతంపై ఉన్న వృక్షం తొర్రలోని పిట్ట దగ్గర వాలాడు. ఆ పిట్ట లేతగా ఉంది. రెక్కలు కదిలించలేని స్థితిలో ఉన్నది. దాన్ని అసలు రహస్యం నిన్ను అడగమన్నాడు దేవ దేవుడు. ఏమిటది? అని దాని తలను మృదువుగా నిమిరాడు. అది కళ్ళు విప్పి నారదుణ్ణి చూసి వెంటనే కళ్ళు మూసి చనిపోయింది. ఆ దృశ్యంతో ముని కలత చెందాడు.వెంటనే మహావిష్ణువు దగ్గర ప్రత్యక్షమై ఏమిటిది స్వామీ! ఇలా జరిగింది అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి ఆ పర్వతం కింద ఉన్న గ్రామంలో మొదటి ఇంట్లో ఆవు లేగదూడను కనింది. వెళ్ళి దాన్ని అడుగు అన్నాడు. నారదుడు వెంటనే అక్కడికి వెళ్ళి సరిగా నిలబడలేని లేగదూడను ప్రేమతో నిమిరి మహావిష్ణువు చెప్పి రహస్యమేమిటి? అన్నాడు తెల్లటి కళ్ళతో తేరిపారజూసి ఆ దూడ నేలమీద పడి చనిపోయింది. బాధతో విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏమిటి స్వామి! మళ్లీ ఇలా జరిగింది అన్నాడు.విష్ణువు ఆందోళన పడకు. సహనం వహించు. మాళవ రాజుకు ఇప్పుడే ఒక కొడుకు జనించాడు. అక్కడికి వెళ్ళి ఆ పసివాణ్ణి అడుగు అన్నాడు.మొదట నారదుడు సందేహించాడు. ఆ కుర్రవాడు కూడా నేను చూసిన వెంటనే కన్నుమూస్తే! అని మనసులో సందేహపడ్డాడు. అయినా నారాయణమూర్తి మాటను కాదనలేను కదా! అనుకొని మాళవరాజును కలిశాడు. తనకు కొడుకు కలిగిన వేళా విశేషమనుకొని వచ్చిన నారదుడికి నమస్కరించి పూజించి వచ్చిన కారణమడిగాడు. నీ కొడుకును ఏకాంతంగా చూడాలన్నాడు నారదుడు. పసివాడితో ఏకాంతం ఏర్పాటు చేశాడు రాజు. నారదుడు భయం భయంగా విష్ణు రహస్యం గురించి అడిగాడు. పసివాడు చిరునవ్వు నవ్వి నారద మహర్షీ! మీరు మొదట కలిసిన పక్షి పిల్ల, రెండోసారి కలిసిన ఆవు దూడ వాటి గుండా వచ్చిన ఆత్మ నన్ను చేరింది. జీవన రూపాంతర ప్రక్రియలో ఇవి భాగాలు. ఇవి అనశ్వరాలు కావు. కానీ క్షణం మెరిసి ప్రకృతిలో లీనమయ్యాయి. ఈ విచక్షణ కలిగిన దైవత్వాన్ని అందుకోగలిగిన శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. అటువంటి మానవులు నిత్యం దైవస్మరణలో ఉంటే ధన్యులు. అటువంటి భక్తులతో నిత్య సంబంధాలు కలిగిన మీరు ఒక్కరే దేవతల్లో అదృష్టవంతులు. ఇదే దైవ రహస్యం అన్నాడు.పసివాని మాటల్తో నారదుడు పరవశించాడు.

-సౌభాగ్య

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles