మర్చిపోయాను!


Sun,June 30, 2019 12:55 AM

హలో సర్ హలో చెప్పండి, ఎవరు? అన్నాను. సర్, నా పేరు శ్రీను ఏ శ్రీను!? ఏమిటి పని? ఎవరో నాకు గుర్తు రావడం లేదు. మిమ్మల్ని సాయంత్రం పేరడైజ్‌లో కలుసుకోవచ్చా సర్!
దయచేసి కాదనకుండా రండి! అవతలి కుర్రాడి కంఠంలో అభ్యర్థన. పేరడైజ్‌లోనా! ఎందుకు? అయోమయంగా అడిగాను. అన్నీ చెబుతాను సర్. రండి,ప్లీజ్! అన్నాడు.సరే... వస్తాను! ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాను. శ్రీను పేరుతో చాలా మంది తెలుసు. కానీ, ఈ కుర్రాడు ఎవరో ఎంత ఆలోచించినా తట్టడం లేదు. పైగా కలవడానికి హోటల్‌కి ఎందుకు రమ్మంటున్నట్టు!? సరే చూద్దాం అనుకుంటూ ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాను.

సాయంత్రం ఐదు గంటలు అవగానే నా కేబిన్ నుండి బయటపడి టీ తాగుదామని పార్లర్ దగ్గర ఆగాను. గత 10 సంవత్సరాలుగా సాయంత్రం నా టీ అక్కడే! తనూ నేనూ ఎప్పుడు బయటకి వచ్చినా అక్కడే టీ తాగడం చూసి, నా భార్య రాధ ఒకసారి అడిగింది... ఎప్పుడూ టీ ఇక్కడే తాగుతారు. కారణం ఏముందండీ? ఏమో రాధ... నాకు ఒక్కసారి బాగుంది అనిపిస్తే, అదే కంటిన్యూ చేస్తాను. మీ అలవాటు వల్ల నేను సేఫ్! అంది నవ్వుతూ. పెట్రోల్, రేషన్ సరుకులు, కూరగాయలు, హోటల్... ఇలా ఒక్కొక్క వాటికి ఒక్కో చోట ఫిక్స్ అయిపోయాను. ఏదేమైనా వేరేచోటికి వెళ్ళను. అదేమిటో, నాకు అదో అలవాటు. హోటల్ అనుకోగానే, ఉదయం ఎవరో ఒక కుర్రాడు చేసిన ఫోన్‌కాల్ గుర్తొచ్చింది.
అసలు తనెవరు. ఎందుకు రమ్మంటున్నాడు? ఇంతలో ఫోన్ మోగింది. లిఫ్ట్ చేస్తే అతనే... సర్, మీ కోసం వెయిట్ చేస్తున్నాను! సరే, వస్తున్నాను అనేసి, బైక్ స్టార్ట్ చేసాను.
Marchipoyanu-

ఆ టైమ్‌లో కస్టమర్స్ ఎవరూ ఉండరు. గుడ్ ఈవినింగ్ సర్ ముఖం మీద స్వచ్ఛమైన చిర్నవ్వుతో పలుకరించాడు డోర్ బోయ్. గుడ్ ఈవినింగ్ అబ్బాయ్ అన్నాను... తనంత కాకపోయినా నేనూ అందంగానే నవ్వాను. నాతో పాటు రాధ ఉండి ఉంటే ఆ కుర్రాడికి విష్ చేస్తారేమిటి!?అని ఆశ్చర్యపోయేది! మనకన్నా కింది స్థాయి వాళ్ళని పలకరించడం సంస్కారం కాదని వాళ్ళ కార్పొరేట్ కాలేజ్ లో నేర్చుకుందేమో! వాచ్ మేన్‌ని కూడా ప్రేమగా పలుకరించడం మా ఇంట్లో నేర్చుకున్నాను. నాన్న సరేసరి. ఉగాదికి అటెండర్‌ను భోజనాలకి పిలిచి బట్టలు పెట్టి మరీ పంపించేవారు. లోపల ఏసీ చల్లగా పలుకరించింది. ఎవరూ ఉన్నట్లు లేరు. అటూ ఇటూ చూసాను. ఫోన్ చేసిన కుర్రాడు కూడా కనిపించలేదు.కాల్ చేద్దామా అనుకుంటుండగానే డోర్ తెరుచుకున్న శబ్దం వినిపించింది. చూస్తే, పాత వెయిటర్ కనిపించాడు. ఇంతకు ముందు చాలాసార్లు తనే నాకు ఫుడ్ సర్వ్ చేశాడు. గత నెల రోజులుగా కనిపించడం లేదు. సర్ నమస్కారం! అన్నాడు చేతులు జోడించి. నమస్కారం! ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు. ఇక్కడ మానేసావేమో అనుకున్నాను! అన్నాను. సర్ కూర్చోండి అన్నాడు. ఒక కుర్రాడు ఇక్కడే నాకోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు. అందుకే వచ్చాను అన్నాను.మీకు ఫోన్ చేసింది నేనే సర్! అన్నాడు పాత వెయిటర్. నువ్వా!? ఏమిటి విషయం? అడిగాను కూర్చుంటూ.చేతులు ప్యాంట్ జేబులోకి పోనిచ్చి ఏదో వస్తువు తీసి నా ముందు పెట్టాడు. నా ముఖంలో భావాలను గమనిస్తూ సర్, గుర్తుందా? ఇది మీదే అన్నాడు. అప్పుడు చూసాను. అదొక పర్సు. ఓపెన్ చేస్తే,లోపల అమ్మ ఫొటో. గుర్తుపట్టాను.

అవును... ఇది నాదే! అన్నాను తనవైపు అనుమానంగా చూస్తూ.ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది!? గత నెలలో నేను అరకు వెళ్ళినప్పుడు, అక్కడెక్కడో పడిపోయింది. సమయానికి నా కొలీగ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే బాగా ఇబ్బంది పడుండేవాణ్ణి!తను చిన్నగా నవ్వుతున్నాడు. లేదు సర్! గత నెల 4 తేదీన హోటల్‌కి వచ్చినప్పుడు మీరు దీన్నిక్కడే మర్చిపోయారు! అన్నాడు ప్రశాంతంగా.నాకు మతిమరపు ఎక్కువ. ఏదో ఆలోచిస్తూ అన్నీ మర్చిపోతుంటాను. ఆఫీస్‌కి వెళ్తూ బ్యాగ్, బ్యాంక్‌కి వెళ్తూ అకౌంట్ బుక్, షాపింగ్‌కి వెళ్తూ ఏటీఎం! ఇలా చెప్పుకుంటే, ఎన్నో ఘనకార్యాలు! బైక్ కవర్లో పిల్లల కోసం తెచ్చిన స్వీట్స్ వారం వరకూ మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా మతిమరుపుకు మందు రాధనే! అన్నీ గుర్తు చేస్తుంటుంది. అలాగా? థాంక్యూ! మరి ఈ నెల రోజులూ ఏమైపోయావ్. అందులో నంబర్ ఉంది కదా. ఫోన్ చేసి చెప్పాల్సింది అన్నాను.క్షమించండి సర్. ఆ రోజు మీరు అప్పటికే వెళ్లిపోయారు. పర్స్ టేబుల్‌పైన ఉంటే చూసాను. లోపల చూస్తే డబ్బులు, మీ ఆధార్ కార్డు కనిపించాయి. మీరు రెగ్యులర్‌గా ఇక్కడికే వస్తారు కదా. వచ్చినప్పుడు ఇచ్చేద్దాం అని పాకెట్‌లో పెట్టుకున్నాను. పనిలో పడి పర్సు విషయమే మర్చిపోయాను. సాయంత్రం ఇంటి దగ్గరనుండి అమ్మను ఆటో గుద్దేసిందని ఫోన్ వస్తే, ఉన్నపళంగా హాస్పిటల్‌కి వెళ్ళాను సర్! ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఆగాడు. అయ్యో... ఆమెకి ఎలా ఉంది ఇప్పుడు? ఆత్రంగా అడిగాను.

కుడికాలు మోకాలు దిగువున విరిగింది సర్. ఆటో వాడు గుద్దేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆచూకీ తెలీలేదు. ముక్కూ ముఖం తెలియని వాళ్ళు హాస్పిటల్ లో జాయిన్ చేసి, నాకు ఫోన్ చేశారు. తను కోలుకునేసరికి నెల రోజులు పట్టింది. అమ్మ ట్రీట్‌మెంట్ కోసం మొత్తం నలభై వేలు వరకూ ఖర్చు అయింది సర్. మాది ఒడిషా కావడం వల్ల ఇక్కడ రేషన్ కార్డు కూడా లేదు. సొంతంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మీ డబ్బులు అమ్మను మామూలు మనిషిని చేశాయి అన్నాడు.ఆ కుర్రాడి కళ్ళలోకి చూసాను. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నిండా 18 ఏళ్లు ఉండవు. ఎంత బాధ్యత!? తల్లి పట్ల, సమాజం పట్ల! ఎక్కడో తప్పిపోయింది అనుకున్న నిజాయితీ కళ్ల ముందు కనిపించినట్లు అనిపించింది. పర్సు తెరిచాను. చాలా నోట్లు ఉన్నాయి.ఈ పర్సు గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. అసలు పర్సు నీకు దొరికింది అనే విషయం కూడా నాకు తెలీదు. తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏముంది!? పైగా తిరిగి ఇవ్వడానికి ఇంత డబ్బు నీకు ఎక్కడిది?నాన్న చిన్నప్పుడే కిడ్నీ వ్యాధితో చనిపోయారు సర్. నన్ను అమ్మ ఎంతో క్రమశిక్షణగా పెంచింది. తను కోలుకున్నాక డబ్బులు ఎక్కడివి అని అడిగింది. మీ పర్సు విషయం చెబితే, తన గొలుసు, నా ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు సర్దింది సర్. నేను మేనేజర్ దగ్గర కొంత డబ్బు అడ్వాన్స్‌గా తీసుకున్నాను. నిన్ననే మళ్లీ హోటల్‌లో జాయిన్ అయ్యాను సర్. మా అమ్మ మీకు క్షమాపణ చెప్పి, పర్సు ఇచ్చి రమ్మంది!ఎప్పుడూ నా మతిమరుపును తిట్టుకునే వాణ్ణి. మొట్టమొదటిసారి మతిమరుపు వల్ల అత్యవసరంలో ఉన్న ఆ కుర్రాడి తల్లికి జరిగిన మేలు తెలుసుకొని ఎంతో రిలీఫ్ ఫీలయ్యాను. అమ్మ ఫొటో, ఆధార్ కార్డ్ మాత్రమే తీసుకొని, పర్సుని అక్కడే ఉంచేసి లేచాను. ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళి చేతులు చాచి తనని మనసారా కౌగిలించుకున్నాను. నాకెందుకో చాలా ఆనందంగా ఉంది! నేను యూనివర్సిటీ గోల్ మెడల్ సాధించినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేను.బయటికి వెళ్లిపోతుంటే, వెనుక నుండి ఆ కుర్రాడు అన్నాడు మీ పర్సు మళ్లీ వదిలేసి వెళ్తున్నారు సర్. తీసుకోండి!
నేను వెనుదిరిగి నవ్వుతూ మర్చిపోయానయ్యా! అనేసి, బైక్ దగ్గరికి నడిచాను. ఈ సంఘటన రాధకు చెబితే ఎలా స్పందిస్తుందో! మనసులో అనుకున్నాను. ఏమో నాకసలే మతిమరుపు!

-సాంబమూర్తి లండ, సెల్: 9642732008

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles