చేయదగ్గ హత్య


Sun,June 30, 2019 01:07 AM

లండన్ నగరంలో చాలా డబ్బు సంపాదించాక ఆల్బర్ట్ సముద్రం పక్కన హెల్మ్‌స్టోన్‌లోని ఓ ఇంట్లో విశ్రాంతి జీవితాన్ని గడపసాగాడు. 68 ఏండ్ల ఆల్బర్ట్‌కి భార్య లేదు. ఆయనతోపాటు పదహారేండ్ల కూతురు ఎల్సా కూడా ఉంటున్నది.వారు ఆ ఊరికి మారాక, డాక్టర్ బ్రూస్ మూడుసార్లు ఆల్బర్ట్ ఇంటికి వచ్చాడు. ఒకసారి ఎల్సాని, రెండుసార్లు ఆల్బర్ట్‌ని చూడటానికి. అన్ని సందర్భాల్లోను జలుబే కారణం. ఆల్బర్ట్‌కి ఆయన నచ్చడంతో తరచూ భోజనానికి ఆహ్వానిస్తున్నాడు. ఓ రాత్రి భోజనానంతరం ఇద్దరూ స్టడీరూంలో వైన్ తాగుతూంటే ఆల్బర్ట్ ప్రశ్నించాడు.ఈ ఉదయం దినపత్రికలో ఓ హత్య గురించి చదివాను. అది నాకు ప్రశ్నార్థకంగా మారింది. మనుషులు పోస్ట్‌మార్టంలో తేలిగ్గా బయటపడే ఆర్సనిక్ లాంటి విషాన్ని ఎందుకు వాడతారు?ప్రధాన కారణం అజ్ఞానం. ఏ డాక్టరూ ఆ పొరపాటు చేయడు. ఐతే, ప్రతీ డాక్టర్‌కి కూడా సరైన విషమేదో తెలీదు.సరైన విషమంటే?మార్కెట్లో తేలిగ్గా కొనగలిగే రెండు మందులు ఉన్నాయి. ఆ రెండూ ప్రమాదకరమైనవి కావు. కాబట్టి, ప్రిస్కిప్షన్ లేకుండా కొనవచ్చు. వాటి ఖరీదు కూడా తక్కువ. ఐతే, ఓ గ్లాసు నీళ్ళల్లో ఈ రెండు మందులనీ రెండు పావు స్పూన్లు కలిపి తాపిస్తే ఆ మనిషి గంటలో మరణిస్తాడు. పోస్ట్‌మార్టంలో అతని శరీరంలోని ఆ విషాన్ని కనుక్కోలేరు డాక్టర్ బ్రూస్ చెప్పాడు.
ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడూ వినలేదు. నిజమా? ఆల్బర్ట్ ప్రశ్నించాడు.


అవును నేనా మందుల పేర్లు అడక్కూడదనుకుంటాను? ఐనా, వాటి పేర్లు నాకు దయచేసి చెప్తారా? తప్పకుండా. మీరు మంచివాళ్ళు. వాటిని ఎవర్నీ హత్య చేయడానికి ఉపయోగించనని, ఆ పేర్లు ఎవరికీ చెప్పనని మాటిస్తే చెప్తాను డాక్టర్ బ్రూస్ కోరాడు. అలాగే మాటిస్తున్నాను. నేను శాంతిగా ఉన్నాను. ఎవరినీ చంపాల్సిన అవసరం నాకు లేదు. డాక్టర్ బ్రూస్ లేచి స్టడీరూం తలుపు తెరచి బయటకి చూసి, తలుపు మూసి మళ్ళీ తన కుర్చీలో కూర్చుని చెప్పాడు. మన మాటలు వినడానికి బయట ఎవరూ లేరని రూఢీ చేసుకున్నాను... ఆయన చెప్పిన ఆ రెండు మందుల పేర్లనీ ఆల్బర్ట్ తన నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. ఒకటి ఓ పేజీలో, ఐదారు పేజీల తర్వాత మరోటి రాసుకున్నాడు.మర్నాడు ఆల్బర్ట్ ఆ రెండు మందులని రెండు మందుల దుకాణాల్లో ఒక్కోటి ఒక్కో ఔన్స్ చొప్పున కొన్నాడు. ఆరు పెన్నీలకే అంత మందు రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కోపం వస్తే తన ఇరుగు పొరుగు అందరినీ చంపేంత విషం అనుకున్నాడు.పద్ధతి మనిషైన ఆల్బర్ట్ రెండు పెద్ద తెల్ల కాగితాలని తీసుకుని వాటిని చిన్న చదరాలుగా చింపాడు. ప్రతీ చదరపు కాగితంలో మొదటి మందుని పావు స్పూను వేసి మడిచి పేకెట్‌గా కట్టాడు. తర్వాత రెండు నీలం రంగు పేపర్లని తీసుకుని వాటినీ అలాగే కత్తిరించి, రెండో మందుని పావు స్పూన్ చొప్పున పోసి పొట్లాలు కట్టాడు. ఇంకా కొంత మందు మిగిలితే దాన్ని నిప్పులో పోసేసాడు. ఆ పొట్లాలని ఓ ఖాళీ సిగరెట్ పెట్టెలో ఉంచి, బల్ల సొరుగులో పెట్టి దానికి తాళం వేసాడు.అలా ఆయన దగ్గర నలభై ఎనిమిది మందిని చంపేంత విషం ఉంది. తనకున్న ఆ శక్తికి ఆయన రహస్యంగా ఆనందించాడు.
Cheyadagga-hatya

కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓసారి ఎల్సా తన తండ్రిని అడిగింది. సొరుగులోని సిగరెట్ పెట్టెలో ఆ పొట్లాలేమిటి నాన్నా? పోస్ట్‌కార్డ్‌లు తీసుకోడానికి దాన్ని తెరిచినప్పుడు చూసాను. అవేమిటో నీకు చెప్తాను. కానీ, నేను చెప్పేది నువ్వు ఎవరికీ చెప్పనని మాటివ్వాలి ఆల్బర్ట్ కోరాడు. ఆమె మాట ఇచ్చాక డాక్టర్ బ్రూస్ తనకి ఏం చెప్పాడో ఆ మాటలనే తన కూతురికి చెప్పాడు.

మరికొన్ని సంవత్సరాలు గడిచాక రాబర్ట్‌నించి అతనికో ఉత్తరం వచ్చింది. ఆయన ఆల్బర్ట్ తండ్రి మిత్రుడు. స్నేహితుడి వ్యాపారానికి రాబర్ట్ అనేకసార్లు ఆర్థిక సాయం చేసాడు. ఆయనకి పిల్లలు లేకపోవడంతో తన తదనంతరం తన ఆస్తిని ఆల్బర్ట్‌కి, అతని తదనంతరం అతని కూతురు ఎల్సాకి రాసానని ఎప్పుడో చెప్పాడు. ఆ ఉత్తరంలో తొంభై ఏళ్ళ రాబర్ట్ తాను మరణానికి సమీపంలో ఉన్నానని, తన ఇల్లు లీజ్ పూర్తయిందని, మరో మూడు వారాలు పొడిగించమంటే ఇంటి యజమాని ఒప్పుకోలేదని, ఎక్కువ డబ్బు ఇస్తానన్నా ఖాళీ చేయమన్నాడని, చివరి దశలో తను హోటల్లో ఉండలేనని, ఆల్బర్ట్ తన నర్స్ జెస్సీతోపాటు తనని అతని ఇంట్లో ఉంచుకుంటాడా అని ఆ ఉత్తరంలో కోరాడు. అంగీకరించడం మినహా తాము ఇంకేమీ చేయలేరని ఆల్బర్ట్‌కి, ఎల్సాకి తెలుసు. రాబర్ట్ తన ఖరీదైన కారులో నర్స్‌తో పాటు ఆల్బర్ట్ ఇంటికి వచ్చాడు. త్వరలోనే ఎల్సా, జెస్సీ స్నేహితులయ్యారు. రాబర్ట్ ఇబ్బంది కరమైన మనిషి. వారం నించి బతకడని డాక్టర్ చెప్తే కార్లోనే పోవచ్చని నేను భయపడ్డాను. డాక్టర్లు చెప్పేవి ఏవీ పాటించడు. వింత మనిషి. జబ్బువల్ల ఈ ప్రవర్తన. కానీ, దాంతో సర్దుకుపోవడం కష్టం. నర్స్ ఎలాంటి రోగితోనైనా సర్దుకుపోవాలి. ఆయన మూడ్ బాగా లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడుతాడు. కానీ, నర్స్‌గా ఆయన అంతిమక్షణం దాకా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు ఆయనకి దూరంగా ఉండు జెస్సీ చెప్పింది. ఔన్స్ గ్లాస్‌ని ఆయన మూడుసార్లు విసిరి కొట్టాడు. దాదాపు అన్ని వస్తువులనీ విసిరి కొడుతుంటాడు. దాంతో డజను ఔన్స్ గ్లాసులని కొనుక్కొచ్చారు. మనం ఆయన విషయంలో శాంతంగా ఉండాలి. ఇంకొన్ని రోజులు మాత్రమే కాబట్టి సర్దుకు పోవాలి. రేపు డాక్టర్ బ్రూస్ వచ్చి ఆయన్ని పరీక్షించి ఏ సంగతీ చెప్తాడు ఆల్బర్ట్ కూతురికి చెప్పాడు.మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇచ్చిన పారిడ్జ్ (గంజి)ని ఆయన గదంతా విరజిమ్మాడు. కొంత ఎల్సా తల్లి ఫొటోమీద కూడా పడింది. బ్రూస్ ఆయన్ని పరీక్షించాక ఆల్బర్ట్ అడిగాడు.ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తే మంచిదా?ఆయన పిచ్చివాడు కాదు. ఇదాయన జబ్బు లక్షణం మాత్రమే. ఎవరికీ ప్రమాదకారి కూడా కాదు. నాకు తెలిసి లివర్ సమస్యతో మూడు రోజుల్లో ఈయన పోతాడు. కాబట్టి, ఈ మూడు రోజుల కోసం మెంటల్ హాస్పిటల్‌కి ఎందుకు? మూడు రోజులైతే సరే ఆల్బర్ట్ అంగీకరించాడు.

అది తప్పు కూడా కావచ్చు. కానీ, ఆయన పరిస్థితినిబట్టి మూడు రోజులని నేను నిర్ణయించాను కానీ, రాబర్ట్ మరో రెండు నెలలు జీవించాడు. ఆ సరికి ఆల్బర్ట్, ఎల్సా, నర్స్ జెస్సీ పిప్పి పిప్పి ఐపోయారు. బట్లర్ మానేసాడు. మరి కొందరు పనివాళ్ళు కూడా మానేస్తారని ఆల్బర్ట్ భయపడ్డాడు. బ్రూస్ ఇలాంటి కేస్‌ని తను ఇంతదాకా చూడలేదని ఆశ్చర్యపోయాడు. ఆల్బర్ట్, ఎల్సా, జెస్సీ ఎలాంటి కపటం లేకుండా రాబర్ట్ మరణం గురించి మాట్లాడుకోసాగారు. అది అందరికీ మంచిదని బాహాటంగా ఒప్పుకోసాగారు. రాబర్ట్‌కి ఎవరూ రెండు గంటలు మించి సేవ చేయలేరు. దాంతో ముగ్గురూ వంతుల వారీగా ఆయన దగ్గర ఉండసాగారు. ఓసారి రాబర్ట్ నిద్ర పోతుండటంతో ఆయన దగ్గరున్న ఆల్బర్ట్ కిందకి వచ్చి పోస్ట్‌కార్డ్ కోసం బల్ల సొరుగు తెరిచాడు. వెంటనే రాబర్ట్ బెల్ మోగింది. తక్షణం ఆయన మేడ మెట్లెక్కి పైకెళ్ళాడు. గదిలోకి అడుగు పెట్టేసరికి రాబర్ట్ కాలి చెప్పు వచ్చి ఆల్బర్ట్ ముక్కుకి తాకి గాయపరిచింది. నువ్వు ఎందుకు ఆలస్యం చేసావు? నాకు విస్కీ, సోడా ఇవ్వు. నేను ఏం కావాలంటే అది తాగొచ్చని డాక్టర్ చెప్పాడు కదా. నీకు నా సంరక్షణ బాధ్యత ఉన్నప్పుడు క్షణం కూడా ఎక్కడికీ వెళ్ళకూడదు అరిచాడు.

అలాగే ఆల్బర్ట్ స్టడీరూంలోకి వెళ్తే తెరచి ఉన్న సొరుగు, అందులోని సిగరెట్ పెట్టె కనిపించాయి. సందేహించకుండా ఓ గ్లాస్ అందుకుని అందులోకి తెలుపు, నీలం రంగు పొట్లాలలోని మందుని వంచి దాంట్లో విస్కీ, సోడాలని నింపాడు. రాబర్ట్ ఒక్క గుక్కలో మొత్తం తాగి గ్లాస్‌ని ఆల్బర్ట్ వైపు విసిరాడు. అదృష్టవశాత్తు అది అతన్ని తాకలేదు. రెండు నిమిషాల్లో రాబర్ట్ నిద్ర పోయాడు. తన డ్యూటీ ముగిసాక కిందకి వచ్చిన ఆల్బర్ట్ తను చేసిన పనికి ఎంత మాత్రం బాధ పడలేదు. ఆయన తన కూతుర్ని హింసించడం అసలు భరించలేక పోతున్నాడు. ఎల్సా, నర్స్ జెస్సీ కూడా బాగా డస్సిపోయారు. తర్వాత బాధ్యత నర్స్ జెస్సీది. ఆమెపైకి వెళ్ళిన గంట తర్వాత కిందకి వచ్చి రాబర్ట్ పోయాడని చెప్పింది. వాళ్ళు ముగ్గురూ ఏ మాత్రం విచారం లేకుండా టీ కలుపుకుని తాగారు. చాలా సంవత్సరాలుగా ఉన్న ఆ మందులోని శక్తి పోనందుకు ఆల్బర్ట్ సంతోషించాడు. డాక్టర్ బ్రూస్ ఎలాంటి అనుమానం లేకుండా అది సహజ మరణంగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు.అంత్యక్రియలయ్యాక ఆల్బర్ట్, బ్రూస్‌ని ప్రశ్నించాడు. ఆయనది సహజ మరణమనే మీరు నమ్ముతున్నారా? అవును మీరు నేను చెప్పేది ఇతరులకి చెప్పననే మాటిస్తే చెప్తాను ఆల్బర్ట్ కోరాడు. అలాగే రాబర్ట్ హత్య చేయబడ్డాడు హత్యా? అవును. ఒకసారి కాదు. మూడుసార్లు.

మూడు సార్లా? అంతేకాదు, ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.మీరు చెప్పే అసాధారణ విషయాలని అర్థమయ్యేలా చెప్తారా? డాక్టర్ బ్రూస్ అయోమయంగా చూస్తూ కోరాడు. నేను రాబర్ట్‌కి ఇచ్చిన విస్కీలో చాలా సంవత్సరాల క్రితం మీరు చెప్పిన విషాన్ని కలిపాను. మా అమ్మాయికి కూడా ఆ విష రహస్యం తెలుసు. ఆమె కూడా అదే సమయంలో ఆ విస్కీ సీసాలోనే విషాన్ని కలిపానని చెప్పింది. మా అమ్మాయి, నర్స్ జెస్సీ మంచిమిత్రులు. రాబర్ట్ తిట్టే తిట్లని భరించలేక జెస్సీకి కూడా ఆ విషం పేకెట్‌ని ఒకటి ఇచ్చి ఉపయోగించమని కోరింది. కానీ, జెస్సీ నిరాకరించింది. ఆయన మరణించాక తను ఆ రోజు నేను విస్కీలో సోడా నీళ్లలో ఆ విషాన్ని కలిపానని చెప్పింది.

అలాగే, మూడుసార్లు హత్య చేయబడ్డాడా? మరి ఆత్మహత్య మాటేమిటి? డాక్టర్ అడిగాడు.ఓసారి కోపంలో ఎల్సా ఆయనకా రెండు విషం పేకెట్లని ఇచ్చి దేంట్లోనైనా కలుపుకుని తాగి చావమని కసిరింది. ఆయన నీళ్ళ గ్లాసు ఖాళీ ఐంది. దాని పక్కనే ఆ తెలుపు, నీలం రంగు కాగితాలు మాకు దాని పక్కనే కనిపించాయి. కాబట్టి, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుపు, నీలం రంగు కాగితాలేమిటి? డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు. చాలా ఏండ్ల క్రితం మీరు నాకు రెండు సాధారణ మందుల గురించి చెప్పి వాటిని కలిపి ప్రయోగిస్తే గంటలో మనిషి పోతాడని చెప్పారు. ఆ మందుల పేర్లు కూడా చెప్పారు. గుర్తుందా? అదేమిటి? అది రహస్యంగా ఉంచుతానని మీరు మాటిచ్చారుగా? డాక్టర్ అడిగాడు. ఆ తప్పే. మీ ముందు ఒప్పుకోడానికి ఇదంతా చెప్పాను. కానీ, ఒక్కరికే చెప్పాను ఆల్బర్ట్ తల వంచుకుని చెప్పాడు. డాక్టర్ చిన్నగా ఆవులించి చెప్పాడు. ఈ విషయంలో మీ ముగ్గురూ బాధ పడకండి. ఆ విషాన్ని కలిపినప్పుడు మీ ముగ్గురిలో ఎవరి మనసూ సరిగ్గా ఆలోచించే స్థితిలో లేదు. నిజానికి ఆ రెండు మందులు కలిపితే ఎలాంటి ప్రమాదం సంభవించదు. బాధ్యత గల ఏ డాక్టరైనా వాటిని బయటికి చెప్తారా? ఆయనది సహజ మరణమే.ఆ సాయంత్రం ఆల్బర్ట్, ఎల్సా, జెస్సీ తేలిక పడ్డ మనసుతో సినిమాకి వెళ్ళారు.
(బేరీ పెయిన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

398
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles