శెభాష్ మేస్త్రీ


Sun,June 30, 2019 01:19 AM

ఆమె ఒకప్పుడు సాధారణ మహిళే. ఇంటి పనులు, వంట పనులు అన్నీ చూసుకునేది. వీలు దొరికినప్పుడల్లా భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లేది. కానీ అందరిలాగా ఆమె ఆలోచించలేదు. అతి కొద్దిమందిలా ఆమె ఆలోచనలు సమాజ మార్పునకు తపించాయి. ఆ మార్పే ఊరంతటినీ పరిశుభ్రం చేసింది. ఆ మార్పే వందలాది మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నది. తొమ్మిదేళ్ల క్రితం ఆమె ఒక సాధారణ గృహిణి. ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్న స్త్రీ. అంతకు మించి చెప్పాలంటే పరిశుభ్రత కోసం పరితపిస్తున్న మేస్త్రీ. మరుగుదొడ్లను నిర్మిస్తూ వందలాది మంది మహిళలకు ఉపాధినిస్తున్న ఆమె పరిచయమే ఇది..

జార్ఖండ్‌లోని లాథూర్ జిల్లా ఉదయ్‌పూర్‌కు చెందిన సునీతాదేవికి 2010లో వివాహమైంది. ఆమె గృహిణిగా రోజూ తన భర్తకు, అత్త మామలకు సేవ చేస్తూ ఉండేది. గ్రామీణ ప్రాంతం కాబట్టి చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండేది. అంతే కాకుండా గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేసేవారు. తరచూ గ్రామంలో వ్యాధులు ప్రబలేవి. వర్షాకాలం ఇంటికొకరు మంచానికే పరిమితమయ్యేవారు. అప్పుడప్పుడు మృత్యుఘోష కూడా వినిపించేది. వైద్య శిబిరాలు, అవగాహనా సదస్సులు ఎన్ని ఏర్పాటు చేసినా గ్రామస్తుల్లో మార్పు రాలేదు. 2010 ఆగస్టులో నెల రోజుల పాటు తన ఇంట్లోని వారంతా సీజనల్ వ్యాధుల బారిన పడ్డారు. వారందరికీ సేవలు చేయలేక సునీతాదేవి దవాఖానకు వెళ్లాల్సి వచ్చింది. వ్యాధులు ప్రబలడానికి కారణం చెత్త, బహిరంగ మల, మూత్ర విసర్జన అని ఆమె తెలుసుకుంది. తన ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడాన్ని గమనించింది. అప్పుడు ఆమెలో వచ్చిన ఆలోచనే ఊరును మార్చేసింది.

పరిశుభ్రత

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల్ని జయించవచ్చు అని అధికారులు నిర్వహించిన అవగాహనా సదస్సుల్లో విన్నది సునీతాదేవి. తన ఇంటి నుంచే పరిసరాల పరిశుభ్రతను మొదలుపెట్టింది. మొదట ఇంట్లోని చెత్తను, ఇంటి ఆవరణలోని చెత్తనంతా శుభ్రం చేసింది. ప్రతీ రోజు సాయంత్రం స్థానిక మహిళలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. అంతేకాకుండా గ్రామ మహిళలంతా కలిసి గ్రామ వీధుల్లో చెత్తను శుభ్రం చేశారు. అలా సునీతాదేవి ఊరిని పరిశుభ్ర గ్రామంగా మార్చడంలో కీలకపాత్ర పోషించింది. ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం కావడంతో భర్తతోపాటు నిత్యం కూలీ పనులకు వెళ్లేది. ఖాళీ సమయాల్లో పరిశుభ్ర కార్యక్రమాలు నిర్వహించేది.

కూలీ నుంచి మేస్త్రీ..

భవన నిర్మాణ పనుల్లో కూలీగా వెళ్తూ వీలు దొరికినప్పుడల్లా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉండేది. 2014లో వచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ ఆమెను బాగా ఆకట్టుకున్నది. ఆ సమయంలో గ్రామంలో మరుగుదొడ్లు కట్టిస్తాం మేస్త్రీలు ముందుకు రావాలని అధికారులు గ్రామస్తులను అడిగారు. డబ్బులు సకాలంలో ఇస్తారో లేదో అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అప్పుడే సునితాదేవి అధికారులు నిర్వహించే శిక్షణకు ఎంపికైంది. యూనిసెఫ్ సిబ్బంది, స్వచ్ఛభారత్ కార్యకర్తలు, కమ్యూనిటీ అప్రోచెస్ టు టోటల్ శానిటేషన్ నిపుణుల ఆధ్వర్యంలో ఆమె శిక్షణ తీసుకుంది. ఆ విధంగా ఆమె కూలీ నుంచి మేస్త్రీగా మారింది.
Mestri

మరుగుదొడ్ల నిర్మాణం

ట్విన్ పిట్ టెక్నాలజీతో సునీతాదేవి మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆరంభించింది. ఈ పద్ధతి ప్రకారం భూమిలో రెండు ట్యాంకులు నిర్మిస్తారు. దీంతో వాటి వినియోగ కాలం ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా గ్రామంలో సునీతాదేవి మరుగుదొడ్లను నిర్మించింది. ఈ పద్ధతిలో మరుగుదొడ్లు నిర్మించే విధానాన్ని స్థానికంగా కొందరు పురుషులకు కూడా నేర్పించింది. గ్రామంలోని కొందరు మహిళల్ని ఒక బృందంగా ఏర్పరిచింది. వారితో గ్రామంలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మాణంపై అవగాహన పొందేలా కృషి చేసింది.

మహిళలకు శిక్షణ ఉపాధి

ప్రతి గడపకూ వెళ్లి మేస్త్రీలుగా శిక్షణ పొందేందుకు ముందుకు రావాలంటూ మహిళలకు పిలుపునిచ్చింది సునీతాదేవి. గ్రామంలోని 300 మంది మహిళలను మేస్త్రీలుగా తయారు చేసింది. వారంతా ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాల్లో 1500కు పైగా టాయిలెట్లు నిర్మించారు. సునీతాదేవి ఒక్కతే 475 టాయిలెట్లు నిర్మించింది. ఉదయ్‌పూర్ గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండడంలో సునీతాదేవి కృషి ఎంతో ఉన్నది. అంతే కాకుండా మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించినందుకు గాను ఆమె పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మార్మోగిపోయింది. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నది. అంతే కాకుండా, భవిష్యత్‌లో మరికొంత మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సునీతారాణి చెబుతున్నారు.

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles