మాయమైన మెరుపుతీగ


Sun,June 30, 2019 03:27 AM

16 ఏండ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన ఆమెది కేవలం 3 ఏంఢ్ల సినీ ప్రస్థానం. చేసింది 20 సినిమాలే అయినా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అగ్రకథానాయికగా ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆమె చేసిన ప్రతీ చిత్రం ఒక సంచలనమే అయ్యింది. అతి తక్కువ సమయంలోనే సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగి ప్రేక్షకుల మదిలో కలల రాణిగా స్థానం సంపాదించుకుంది. టీనేజ్ స్టార్‌గా అతిలోక సుందరి శ్రీదేవిని మరిపించే అందంతో వెండితెరపై వెలుగులు జిమ్మి, 19 ఏండ్లకే అభిమానులను శోకసంద్రంలో వదిలేసి ఒంటరిగా నింగికెగిసిన దివ్యభారతి చివరిపేజీ.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

అది 1990 సెప్టెంబర్ 14వ తేది..తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించిన బొబ్బిలిరాజా చిత్రం విడుదలైన రోజు. వీధుల నిండా సినిమా పోస్టర్లు. ఆ పోస్టర్ల మీద ఒక అందాలతార. చూడగానే శ్రీదేవినా? అనే అనుమానం వచ్చే రూపురేఖలు. మళ్లీ మళ్లీ ఆగి పరిశీలనగా చూస్తే గానీ పోల్చుకోలేని రూపం. అవును ఆమె శ్రీదేవికాదు. మరెవరు? శ్రీదేవి చెల్లెలేమో? కావచ్చు. కాదు కాదు. ఆమె కాదు. మరెవ్వరూ? ఒకసారి సినిమా చూస్తే తెలిసిపోతుందిగా... అడుగులన్నీ సినిమా థియేటర్ల వైపే పడుతున్నాయి. సినిమా సూపర్‌హిట్. అందులో నటించింది శ్రీదేవి కాదు. ఆమె పేరు దివ్యభారతి. వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ముంబైకి చెందిన అమ్మాయి. తొలిచిత్రమే బొబ్బిలిరాజా. అయినా ఎలాంటి బెరుకులేని నటన. సినీ ప్రపంచమంతా ఒక్కసారి అమెవైపు చూసింది. వరుస అవకాశాలు తలుపు తట్టాయి.నిజానికి దివ్యభారతి అంతకు రెండేండ్ల ముందే సినిమాల్లోకి రావలసి ఉండే. ప్రముఖ సినిమా నిర్మాత నందుతులానీ ఆమెను తొలిసారి చూశాడు. అప్పటికీ దివ్యభారతి తొమ్మిదో తరగతి మాత్రమే చదువుతుంది. తను నిర్మించే చిత్రం కోసం ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశాడు. అయితే అనుకోకుండా ఆ పాత్ర రద్దు అయ్యింది. గోవింద కథనాయకుడిగా నటించిన రాధ కా సంగమ్ కోసం సంతకం చేసింది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అందులోనూ చేయలేకపోయింది. అయితే జుహిచావ్లాను ఆ పాత్రకు ఎంపిక చేయడానికే దివ్యను తప్పించారట. అప్పటికీ ఇండస్ట్రీలో ఉండే గూడుపుఠానీలు తెలియని దివ్య తన సీనియర్ నటి అన్న ఒకే ఒక కారణంతో ఆ సినిమా నుండి తప్పుకుందట. ఆ తర్వాత తెలుగు నిర్మాత రామానాయుడు తన తనయుడు హీరోగా తెరకెక్కించిన బొబ్బిలిరాజాలో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడం, ఆ సినిమా సక్సెస్‌కావడంతో అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. కట్ చేస్తే..ఆ తర్వాత ఆమె చేసిన తమిళ సినిమా అంతగా ఆడనప్పటికీ అవకాశాలు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
Divyabharathi

దివి నుంచి భువికి నడిచొచ్చిన దేవకన్యలా.. పాలరాతి శిల్పం లాంటి దేహంతో, మత్తెక్కించే చూపులతో అచ్చు శ్రీదేవిని పోలి ఉండడం ఆమెకు వరమైతే, నటన విషయంలోనూ, ఎక్స్‌పోజింగ్ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో తక్కవ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరయింది. ఒకానొక దశలో శ్రీదేవి స్థానాన్ని దివ్యభారతి భర్తీ చేయబోతుందనే సినీవర్గాల్లో గుసగుసలు వినిపించాయి. తెలుగులో తక్కువ సమయంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు వంటి అగ్ర నాయకులతో కలిసి నటించడం. దాదాపుగా అన్నీ హిట్లుగానే నిలవడం ఆమెకు కలిసి వచ్చింది. ఆయా చిత్రాల్లో దివ్యభారతి కనబర్చిన నటన తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఓవైపు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉండగానే.. నషీరుద్దిన్ షా, సన్నీడియోల్ వంటి స్టార్ల సరసన విశ్వామిత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకొంది. ఇది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో హిందీ నుంచి కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. షోలా ఔర్ షబ్నమ్, దీవానా, దిల్ హై తో హై వంటి హిట్లను తన ఖాతాలో వేసుకొంది. ఈ జోరులోనే కేవలం మూడేండ్ల కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 20 చిత్రాలను చేసి శ్రీదేవి లాంటి అగ్రతారకే సవాల్ విసిరింది.

రహస్య వివాహం

1991లో విశ్వాత్మా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దివ్యభారతి ఆ చిత్ర విజయంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ ఏడాది తెలుగులో మూడు చిత్రాలు చేసిన ఆమె హిందీ చిత్రాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. అదే సమయంలో షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక-నిర్మాత సాజిద్ నడియాడ్వాలా పరిచయమయ్యాడు. స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తన మార్కును ప్రదర్శిస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. కొద్దిరోజులు వారిద్దరూ కలిసి తిరిగినట్టు మీడియా కూడా గుర్తించింది. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో 10 మే 1992న రహస్యంగా పెండ్లి చేసుకున్నారంటారు. ఈ పెండ్లి సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, ఒక కాజీ, దివ్యభారతి కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య, సంధ్య భర్త సమక్షంలో జరిగిందని చెబుతారు. కేవలం 18 ఏండ్ల వయస్సులో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేని స్థితిలో అతన్ని చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదంటారు. అయితే తన కెరీర్ పరంగా ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో తన పెళ్లిని రహస్యంగా ఉంచినప్పటికీ బాలీవుడ్‌లో గుప్పుమంది. అదే సమయంలో దివ్యభారతి నటించే చిత్రాల విషయంలో సాజిద్ అభ్యంతరాలు లేవనెత్తడంతో వారిద్దరి మధ్య వ్యకిగత విభేదాలు తలెత్తినట్లు చెబుతారు. దీంతో దివ్యభారతి కొంత మానసిక రుగ్మతకు గురైనట్టు వార్తలు వచ్చాయి. నిర్మాత వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వాటిని సాజిద్ కొట్టిపడేశాడు. మీడియాతో మాట్లాడిన సాజిద్ మేము మా పెళ్లి విషయాన్ని దాచివుంచాం. దివ్య కెరీర్‌పై ప్రభావం పడకూదనే అలా చేశాం అని చెప్పారు. ఇప్పటికీ ఆయన దివ్యభారతి కుటుంబంతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఇటీవలె తన మొదటి భార్య, నటి దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి 80వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన తన రెండవ భార్య వర్థా నడియావాలాతో హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆయన ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఆమె చనిపోయిన 11 ఏండ్ల తరువాత సాజిద్ మరో వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించింది.1992-93 మధ్య కాలంలో ఆమె 11 సినిమాల్లో నటించింది.

1993 ఏప్రిల్ 5న

చెన్నైలో షూటింగ్ ముగించుకొని ముంబైలోని తన నివాసానికి చేరుకొన్నది. ఆ సమయంలోనే మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటే అలసిపోయినందున దానిని క్యాన్సిల్ చేసుకొన్నది. అనంతరం తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్‌లను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. తన భర్తతో కలిసి వచ్చిన నీతాతో ఆందోళన్ అనే సినిమా కోసం తన దుస్తుల డిజైనింగ్ గురించి చర్చించింది. నీతా భర్త శ్యామ్ ఓ సైకియాట్రిస్ట్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో తరచుగా అందరూ కలిసి పార్టీలు జరుపుకోవడం సాధారణమైన విషయం. ఈ పర్యాయం కూడా మందు పార్టీ చేసుకున్నారు. ముగ్గురు ఎంజాయ్ చేస్తూ మద్యం సేవిస్తున్నారు. ఓ పక్క వంటమనిషి తినడానికి స్నాక్స్ చేస్తున్నారు. మద్యం సేవిస్తూ నీతా దంపతులు టెలివిజన్ చూస్తుండగా.. దివ్య బాల్కనీలోకి వెళ్లి గోడ చివరన కూర్చున్నది. ఉదయం కాఫీ తాగుతూ కూడా అక్కడ కూర్చుని పరిసరాలను ఎంజాయ్ చేయడం దివ్యకు ఎంతో ఇష్టం. ఆ బాల్కనీకి గ్రిల్స్ లేవు. ఎప్పుడూ కూర్చునే ప్లేస్ కావడంతో ఆమె అంతగా ఆలోచించకుండానే అక్కడ కూర్చుని నీతాతో మాట్లాడుతుంది. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చిన దానిలా బయటకు చూస్తున్నదల్లా ముందుకు తిరగబోయింది. అక్కడ అదుపు తప్పడంతో కింద పడిపోయింది. ఐదో అంతస్థు నుంచి కిందపడటంతో దివ్యభారతికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు వచ్చేసరికి ఊపిరితోనే ఉన్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు. నిజంగా ఆమె అదుపు తప్పి పడిపోయిందా? లేక కావాలనే పడిపోయిందా? ఎవరన్నా నెట్టివేశారా? ఎన్నో ప్రశ్నలు. దివ్య భారతి మరణంపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఆమెను ఎవరో హత్యచేసి పై నుంచి పడేశారని కొంత మంది, తాగిన మైకంలో జారిపడి చనిపోయిందని కొంతమంది అన్నారు. భర్త సాజిద్ నడియడ్ వాలాను అనుమానిస్తూ లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి.
Divyabharathi1

అయితే ఈ పుకార్లన్నింటినీ కొట్టిపడేస్తూ ఆమె తండ్రి ఓం ప్రకాశ్ భారతి ఆమె మరణానికి సంబంధించిన విషయాన్ని ఇటీవలె బయట పెట్టారు. ఓ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. నాకు ఎవరి మీదా అనుమానం లేదు. నటి దివ్యభారతిని ఎవరూ కావాలని చంపలేదు. అలా అని ఆమె ఆత్మహత్య కూడా చేసుకోలేదు. అతిగా మద్యం సేవించనూ లేదు. అర్ధగంటలో ఎంత తాగుతాం చెప్పండి అని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యభారతి డిప్రెషన్‌కు గురైందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఎలాంటి మానసిక సంఘర్షణకూ గురి కాలేదు. ఎలాంటి సమస్యనైనా కూల్‌గా పరిష్కరించుకునేది. అవసరమైతే ఎదుటి వాళ్లకే చుక్కలు చూపించే దృఢమైన మనస్తత్వం తనది. ఆమె పెండ్లి విషయంలో మాకు మొదట అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత అంగీకరించాము. అంతేకాదు మా అల్లుడు ఇప్పటికీ మా కుటుంబంతో సఖ్యతగానే ఉన్నాడు. నిజానికి దివ్యభారతి మరణం ఓ ప్రమాదంలా జరిగిపోయింది. బాల్కనీలో కూర్చున్న దివ్యభారతి ఇటు తిరిగే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బలు తగిలాయి. అప్పటికి ఆమె ప్రాణం పోలేదు. దాంతో మేము ఆమెను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దివ్యభారతి ఉండే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్లకు గ్రిల్స్ ఉండేవి. ఏం దురదృష్టమో కానీ ఆమె ఫ్లాట్‌కే గ్రిల్స్ లేవు. ప్రతీ రోజు కింద కార్లు పార్కు చేసి ఉంచే వారు. ఆ రోజే ఒక్క కారు కూడా పార్క్ చేసి లేదు. ఐదో అంతస్థు నుంచి నేరుగా నేల మీద పడిపోయింది. ఆమె మరణం మమ్మల్ని తీరని విషాదంలోకి నెట్టింది. దివ్య భారతి లేదనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం అని తండ్రి ఓం భారతీ బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు.

2315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles