ఆ రాష్ర్టాలకు అండగా పార్కు!


Sun,June 30, 2019 03:31 AM

ఆరావలి ప్రాంతం.. ఎటు చూసినా కొండలు, గుట్టలు.. అవే అక్కడి గ్రామాలను రక్షిస్తాయి. కానీ, మైనింగ్ మాఫియా వాటిని విచక్షణా రహితంగా వాడుకున్నది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వాలు స్పందించాయి. ఓ అధికారిని నియమించాయి. అతను ప్రత్యేక ప్రాజెక్ట్‌తో ముందుకెళ్లాడు. ప్రజలు మొదట భయపడ్డా అంతిమంగా ఆ అధికారిని అభినందిస్తున్నారు. అతని పేరు విజయ్ దస్మనా.

సుమారు 400 ఎకరాలు. ఎత్తయిన కొండలు. 2009 వరకూ ఆ కొండలు హర్యానా, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ ప్రజలను కాపాడుతూ వచ్చాయి. ఎత్తయిన కొండలు ఉండడం వల్ల వేగంతో వీచే గాలులు అక్కడితోనే ఆగిపోయేవి. అందువల్ల ఆ ప్రజలకు ఆ కొండలంటే అమితమైన ప్రేమ. కొన్ని రోజులు తర్వాత అక్కడ కొందరు మైనింగ్ జరపడం ప్రారంభించారు. గుంటలు తవ్వడం, రాళ్లను పగుల కొట్టడం చేశారు. దీంతో వాతావరణంలో మార్పు వచ్చింది. గాలి, నీరు, ఇసుక కాలుష్యానికి గురయ్యాయి. ప్రజలు కూడా చూస్తూ ఉండి పోయారు. ఇది ఇలానే కొనసాగితే పక్క రాష్ర్టాలకే ముప్పు వాటిల్లుతుంది. దీన్ని ఆపేందుకు 2002లో మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీమ్ కోర్టు నిషేధం విధించింది. దీంతో మిగిలిన 378 ఎకరాలకు కొంత ఉపశమనం దొరికింది. ఈ పనిని అమలు చేయడానికి అధికారులు మరో ఏడేండ్ల గడువు తీసుకున్నారు. ఈ అడవిని ఉన్నతంగా తీర్చి దిద్దాలి. ఇది వాతావరణానికి, ప్రజలకు, జంతువులు, పక్షులకు ఉపయోగపడేదిగా ఉండాలని భావించారు. ఈ పనులన్నీ నిర్వర్తించడానికి విజయ్ దస్మానాను నియమించింది ప్రభుత్వం.
Park

ప్రత్యేక ప్రాజెక్ట్

హర్యానా, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్‌లలో మైనింగ్‌తో కూడిన ఇంతటి అడవిని జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్క్‌గా మార్చే ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దాని బాధ్యతలు అన్నీ విజయ్‌కు అప్పగించింది. అతను ఓ టీమ్‌తో ఐఏజీ ( అయామ్ గుర్గావ్) ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. ఇప్పుడు మైనింగ్ ప్రదేశాన్ని ఆరావళి ఫారెస్ట్‌గా మార్చుతున్నారు. కొన్ని అనవసరపు కొండలను పగులగొట్టి చదును చేశారు. ఒండ్రుమట్టిని నింపారు. ఇట్లా అక్కడ నీటిని పొదుపు చేయడానికి, చెట్లను పెంచడానికి ఆ స్థలాన్ని వాడుకున్నారు. సెంట్రల్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి విలయతి కీకర్ ( ప్రపొసోపీస్ జులిఫెరా) మొక్కలను తెప్పించారు.

జంతువులు, పక్షులకూ..

ఆ టీం సభ్యులు మొక్కలు నాటారు. అవి కూడా తక్కువ సమయంలో పెరిగే మొక్కలు. ఇవి కొన్ని రోజులకు పెరిగి చెట్లుగా మారాయి. ఈ చెట్లు కేవలం మనుషులకే కాకుండా జంతువులు, కీటకాలు, పక్షులకు ఉపయోగపడేవిగా ఉన్నాయి. ఈ చెట్ల నుంచి వచ్చే పండ్లతో పక్షులు, కీటకాలు జీవిస్తున్నాయి. పచ్చదనం పెరగడంతో భూమిలో నీటి శాతం పెరిగింది. వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ వన్యప్రాణులకు బాగా ఉపయోగపడుతున్నది. మొక్కలు నాటి వాటిని పెద్దవిగా చేయడానికి ప్రత్యేకంగా కోర్సులు చేయనక్కర్లేదు. ఇదేం రాకెట్లు తయారు చేసే యంత్రాంగం కాదు. బ్రిటీష్ కాలంలో చాలా రకాల అడవులు ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోవడానికే లేవు. అప్పట్లో అడవులు ఉండేవి అని పుస్తకాల్లో చదువాల్సి వస్తుంది. అని విజయ్ అంటారు. ఇట్లా ఐఏజీ టీం మొత్తానికి అనుకున్న పని పూర్తి చేసింది. రాబోయే పది నెలల్లో రాజస్థాన్ ఇతర ప్రదేశాల నుంచి విత్తనాలు సేకరించి నర్సరీ తయారు చేయాడానికి సిద్ధ్దమవుతున్నారు ఈ టీం సభ్యులు. ఈ విధంగా నర్సరీలో మొలకెత్తుతున్న మొక్కల్తో మొదటి యేడాది 35 జాతులు, రెండో యేడాది 58, మూడో యేడు 85, నాలుగు 130, చిరవరికి ఆరావళి అడవులకు చెందిన 160 జాతులు ఇలా మొత్తం 200 జాతుల మొక్కలను నాటారు. మొక్కలకు నీరు అందేలా డ్రిప్ సదుపాయం కల్పించాడు అజయ్. ఇలా చిన్న మొక్కలను మూడేండ్ల వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటే తర్వాత అవే మానవ జాతిని కాపాడుతూ వస్తాయి.

అన్ని పార్కులకు భిన్నంగా..

కొండలను పగులకొడుతుంటే ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు అక్కడ పరిస్థితిని చూసి ఆనందిస్తున్నారు. ఎందుకూ పనికిరాని స్థలాన్ని పార్కులా మార్చడంతో అది ప్రజలను ఆరోగ్యంగా ఉంచుతున్నది. ఈ పార్కులో వాకింగ్ చేస్తూ అక్కడ వీచే చల్లని గాలిని పీలుస్తుంటే శరీరంలో ఉండే రోగాలు సైతం మాయమవ్వాల్సిందే అంటున్నారు ఆరావళి గ్రామ ప్రజలు. ఎటు చూసినా పచ్చదనం, పక్షుల రాగాలతో పార్కులో ఉన్నంత సేపు మైమరచిపోవల్సిందే. అదే అరావళి పార్కు పత్యేకత.

756
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles