ఆ ఊరొక గ్రంథాలయం..


Sun,June 30, 2019 03:43 AM

అనగనగా ఓ ఊరుంది. పుస్తకాలు చదవడానికి రమ్మని పిలుస్తున్నది. ఊరు పిలవడమేంటి? పుస్తకాలు చదవడానికి అక్కడి వరకూ వెళ్లడం ఎందుకు అంటారా? ఎందుకో వెళ్లొద్దాం పదండి.

రాష్ట్రం : మహారాష్ట్ర
జిల్లా : సతారా
ఊరు : బిలార్
ల్యాండ్ మార్క్: మహాబలేశ్వరం పక్కన..

తాతల కాలం నాటి పుస్తకాలు కావాలా? రాజుల కాలంలో రాసిన పుస్తకాలు చూడాలా? ఇవ్వన్నీ ఇప్పుడెక్కడ దొరుకుతాయి అంటారా? దొరుకుతాయి.. మహారాష్ట్రలోని బిలార్ గ్రామంలో అలాంటి పుస్తకాలెన్నో మనకు కనిపిస్తాయి. అవ్వన్నీ మనల్ని ఆహ్వానిస్తున్నాయి కూడా. ఆ ఊరి వీధుల్లో నడిస్తే లైబ్రెరీలో నడిచిన అనుభూతి కలుగుతుంది. ఏ ఇంటి గుమ్మం తెరిచి చూసినా పుస్తకాల సెల్ఫ్‌లే కనిపిస్తాయి. ర్యాకుల నిండా పుస్తకాలే కనిపిస్తాయి. కామిక్స్, సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలు, నవలలు, ఇంగ్లిష్ పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు అన్నీ ఒకే దగ్గర కనిపేస్తే ఎలా ఉంటుంది? పుస్తకప్రియులకు అంతకు మించిన ఆనందం ఏమైనా ఉంటుందా? అలాంటి సందర్భంలో చదువుకోవడానికి అనువైన చోటు, పుస్తకంలో దించిన తల ఎత్తకుండా లాక్కెల్లిపోయేలా ఉండే వాతావరణం, మనసు హాయినిచ్చే పరిసరాలు ఇవ్వన్నీ ఆ గ్రామంలో ఉంటాయి. అందుకే ఆ ఊరునే పుస్తకాల ఊరు గా పిలుస్తారు. ఇండ్లనే లైబ్రరీలుగా మార్చి విజ్ఞాన భాండాగారంగా పేరుగాంచింది ఆ ఊరు. దేశంలో తొలి విలేజ్ ఆఫ్ బుక్స్‌గా రికార్డు సృష్టించింది.

మహారాష్ట్రలోని మహాబలేశ్వరానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది బిలార్ గ్రామం. మన దగ్గర ఉన్నట్టే సందులూ, భవనాలు, చెట్లూ, చేమలూ ఉంటాయి. కానీ అవ్వన్నీ ఓ ప్రత్యేకం. అన్నీ పుస్తకాల కోసం, పుస్తకాల ప్రియులకోసం. రంగులు అద్దిన గోడలు ఊర్లోకి ఆహ్వానిస్తాయి. గల్లీ గల్లీలో చెట్లూ చేతులు చాచి పిలుస్తాయి. బిలార్ గ్రామంలో సుమారు 2500 జనాభా ఉంది. 600 ఇండ్లు ఉంటాయి. దాదాపు అందరూ రైతులే. ఈ గ్రామంలో మూడేండ్ల క్రితం ప్రభుత్వం పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.మరాఠీ భాషాభివృద్ధి శాఖ అధికారులు ఇక్కడ పర్యటించి తమ ప్రాజెక్ట్ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఫలితంగా 25 మంది రైతులు తమ ఇండ్లను లైబ్రరీలుగా మార్చేందుకు ఒప్పుకున్నారు. రేకుల షెడ్డు నుంచి రెండతస్థుల భవనం ఉన్న అందరూ ముందుకొచ్చారు. కొందరు తమ ఇండ్లను పూర్తిగా లైబ్రరీలుగా మార్చేశారు. అట్లా 25 లైబ్రరీలను ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు. దీంతో 2017లో బిలార్‌లో పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్ట్ మొదలైంది. మహాబలేశ్వరానికి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన వస్తున్నది.
VIllage_Book

ప్రతిదీ ప్రత్యేకమే...

పుస్తకాంచ్ గావ్ ప్రాజెక్ట్ కోసం అధికారులు రైతులను అడగ్గానే తమ వంతుగా ఇండ్లను కేటాయించారు. ఇండ్లను ఇవ్వడమే తమ పనిగా భావించలేదు. గ్రామంలో ప్రతి ఇంటిలో పుస్తక పఠనం మీద ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఇట్లా ఇంటింటికీ ప్రత్యేకమైన అల్మారాలు, షెల్ఫ్‌లు, ర్యాక్‌లు సమకూరేలా చేశారు. గ్రామానికి ఎవరు వచ్చినా వాళ్లకు ప్రశాంతత లభించేందుకు అక్కడ పరిస్థితులను అనుగుణంగా మార్చేశారు. లైబ్రరీల గోడలపై అందమైన రంగులు వేశారు. హాయినిచ్చే సోఫాలూ, ఆనందాన్ని ఇచ్చే రీడింగ్ టేబుళ్లు, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేశారు. గ్రామస్తులే కొన్ని పుస్తకాలను సమర్పించగా, ప్రభుత్వం మరికొన్ని ఈ లైబ్రరీలకు అందించింది.

టౌన్ ఆఫ్ బుక్ స్ఫూర్తితో..

బ్రిటన్‌లోని హే ఆన్ వై అనే పట్టణం అచ్చం ఈ తరహాలోనే ఉంటుంది. అక్కడ ఏ ఇంటికి వెళ్లినా ఓ లైబ్రరీ ఉంటుంది. ఆ పట్టణం స్ఫూర్తితోనే బిలార్ గ్రామంలో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ గ్రామంలో లైబ్రరీల్లో, ఇండ్లలో సుమారు 15వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అదనంగా మరో 30 వేల పుస్తకాలను ప్రభుత్వం అందించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి. కమిక్స్, కథలు, నవలలు, పురాణాలు, చరిత్ర, సైన్స్ ఇట్లా ఎన్నో రకాల పుస్తకాలు దొరుకుతాయి. ఒక్కో లైబ్రరీలో ఒక్కోరకమైన పుస్తకాలు దొరుకుతాయి. అంతే కాదు.. ఏ లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయి పూర్తి సమాచారాన్ని ప్రత్యేకమైన బోర్డుపై ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ గ్రామాన్ని 25 వేల మంది సందర్శించారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మహాబలేశ్వరం వెళ్తే.. మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణించి బిలార్ గ్రామాన్ని చూసి రండి.. పుస్తకాలు చదివి రండి.

724
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles