ఏది సత్యం? ఏదసత్యం?


Sun,June 30, 2019 07:38 AM

నిజం చెప్పులు వేసుకొనే లోపు.. అబద్దం ప్రపంచమంతా తిరిగి వస్తుంది అనేది వాస్తవం. పుకారుకు స్పందించినంత తొందరగా వాస్తవ విషయాలకు జనాలు స్పందించడం లేదు. అందులోనూ నెటిజనులు ఇంకా స్పీడు. ఫలానా దగ్గర పాము కనిపించింది అంటే.. పాము కనిపించడమే కాదు.. పడగవిప్పి ముగ్గురు నలుగురిని కాటేసింది కూడా అన్న ధోరణి ఉంటుంది మనోళ్లలో. ఒక వ్యక్తినిగానీ.. వ్యవస్థను గానీ దెబ్బతీసేందుకు కావాలని పనిగట్టుకొని దుష్ప్రచారం చేసేవాళ్లు కొందరైతే.. పనీపాట లేకపోవడంతో సరదా కోసం తప్పుడు విషయాలను విస్తరింపజేస్తుంటారు మరికొందరు. సామాజిక మాధ్యమాల పుణ్యామా అని ఫేక్ వార్తలకు హద్దులేకుండా పోతున్నది. దీనిని కట్టడి చేసేందుకు.. ఫేక్ రాయుళ్ల భరతం పట్టేందుకు
కొన్ని సంస్థలు.. పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నాయి. ఫేక్ ఏది? ఫ్యాక్ట్ ఏది? వీటిని ఎలా నియంత్రణలోకి తీసుకురావాలి? వంటి విషయాల సమగ్ర సమాచారంతో ఫేక్‌న్యూస్ విజృంభనపై ముఖచిత్ర కథనం.

-దాయి శ్రీశైలం, సెల్: 8096677035

నకిలీ మకిలీలు పరిధి మించి ప్రచారం అవుతున్నాయి. కువైట్‌లో రికార్డు స్థాయిలో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అని ఒక వార్త రాగానే.. అబ్బో మనం 40 డిగ్రీలకే తట్టుకుంటలేం. వాళ్లు 62 డిగ్రీలకు ఎలా తట్టుకుంటారు? అనే చర్చ జరుగుతుంది. గురువాయూర్ గుడిలోకి చెప్పులతో వెళ్లిన మోదీ అని మరో వార్త. గుడి గురించి అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయం నచ్చదు. ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం గుడిలోకి చెప్పులేసుకొని వెళ్తారా? అంటూ కోప్పడుతారు. కానీ తర్వాత తేటతెల్లమైన విషయం ఏంటంటే.. కువైట్‌లో నమోదైంది అని చెప్పుకున్న 62 డిగ్రీల ఉష్ణోగ్రత వార్తగానీ.. ఆలయంలోకి చెప్పులేసుకొని వెళ్లిన మోదీ విషయంగానీ వాస్తవం కాదు. అవి నకిలీ వార్తలు. ఫొటోషాప్‌లో ఎడిట్‌చేసి అలా ప్రచారం చేశారు కొందరు.
Shadow

-హైదరాబాద్ జుమ్మెరాత్ బజార్‌లో ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసుల దాడి. తలకు తీవ్ర గాయాలు. హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు. సోషల్‌మీడియా ద్వారా రాష్ట్రమంతటా హల్‌చల్ చేసిన వార్త ఇది.
-ఒక ఎమ్మెల్యే అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తారా? ఎవరు చెప్తే ఇలా చేస్తున్నారు? ఇటు పోలీసులకు.. అటు ప్రభుత్వానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు సెంట్రల్‌లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అని మరచి బీజేపీ ఎమ్మెల్యేలను కొడితే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? రండీ.. దమ్ముంటే మమ్మల్నీ వచ్చి కొట్టండి.. ..ఇలాంటి స్పందనలు.. ఎమోషన్స్ నాన్‌స్టాప్‌గా వచ్చాయి. 30 నిమిషాల తర్వాత.. రాజాసింగ్ గారు.. ఏ రాయి అయితే ఏముంది నెత్తి పగలగొట్టుకోవడానికి అనుకున్నారేమో? నా నెత్తి నేనే పగులగొట్టుకుంటా. ఏమన్నా అంటే మీ పేరు చెప్తా ఎమ్మెల్యే గారికి ఎన్ని అబద్దాలొస్తాయో?.. రాయితో రాజకీయం చేద్దామనుకున్నారు .. వంటి ప్రతిస్పందనలు అంతే స్పీడ్‌గా వచ్చాయి. ఏమైంది?..
రాజాసింగ్ ఆరోపించిన దాంట్లో వాస్తవం లేదనీ.. రాయితో అతడే తన తలపై బాదుకొని లాఠీచార్జిగా చిత్రీకరించి.. విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను కూడా షేర్ చేశారు. రాజాసింగ్ గురించి వచ్చింది ఫేక్‌న్యూస్ అని తెలియడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

పాతబస్తీలో జై శ్రీరామ్ అన్నందుకు హిందూ యువతిపై ముస్లిం యువకుల దాడి వాట్సప్.. ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన న్యూస్ ఇది. హైదరాబాద్‌లో హిందువులకు రక్షణ లేదా? పాతబస్తీలో అల్లర్లు జరగాలనుకుంటున్నారా?
మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడం వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది? .. అంటూ కామెంట్ చేస్తూ ఈ వార్తను దేశం సరిహద్దులు దాటించే ప్రయత్నం చేశారు చాలామంది. 20 నిమిషాల తర్వాత.. ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు మహిళ పేరును వాడుకుంటారా? ఎక్కడో కుటుంబ కలహాలతో జరిగిన సంఘటనకు మతం రంగు పులిమి విద్వేషాలను ప్రోత్సహిస్తారా? .. వంటి కౌంటర్లు వచ్చాయి.

అసలు ఏమైంది? ఏది నిజం?

ఆమెది హర్యానా. వరకట్న వేధింపుల వల్ల అత్తింటివారి హింసకు గురైన యువతి ఫొటోలు అవి. దానిని ప్రశాంతమైన పాతబస్తీకి ముడిపెట్టి.. తెలంగాణలో అల్లర్లు రెచ్చగొట్టడానికి మతం రంగు పులుముతూ కొందరు చేసిన విఫల ప్రయత్నం.

ఒకే కాన్పులో 17 మందికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన వార్త ఇది. క్రికెట్ జట్టు కోసమేమో? పాపం అంతమందికి పాలు పట్టాలంటే కష్టమే అంతమంది ఒకేసారి పుట్టడం సాధ్యమేనా? .. అంటూ రకరకాల కామెంట్లు పెట్టారు.

తర్వాత తెలిసిన విషయం ఏంటంటే..

కేథరిన్ బ్రిడ్జి అనే అమెరికన్ మహిళ ఒకేసారి 17మందికి జన్మనిచ్చింది అనేది ఫేక్ న్యూస్. ఫొటో మార్ఫింగ్ చేసి దానిని వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్ అనే వెబ్‌సైట్‌లో సెటైరికల్‌గా రాయడంతో ఇది నిజమే అనుకున్నారు. కానీ తర్వాత ఇది ఫేక్ అని తెలిసి సైలెంట్ అయ్యారు.

టీటీడీ చైర్మెన్‌గా హిందువేతరులా?

పొలిటికల్ సర్కిళ్లల్లో ఎక్కువగా షేర్ అయిన వార్త ఇది. పవిత్ర టీటీడీ చైర్మెన్ పదవిలో హిందువునే కూర్చుండబెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించే ప్రభుత్వం అవసరమా? తిరుమలను దెబ్బతీయడమే జగన్ లక్ష్యమా? .. ప్రశ్నల వర్షంతో సోషల్‌మీడియా అంతా తడిసిపోయింది. వెంటనే.. వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదని ఎవరు చెప్పారు? అతను హిందువు అనడానికి వంద రుజువులు చూపిస్తాం. కాదు అని ఒక్క రుజువైనా చూపించండి టీటీడీ చైర్మెన్‌గా హిందువేతరులను నియమిస్తారు అనడం సంప్రదాయాల మీద అవగాహన లేకపోవడమే .. అంటూ కౌంటర్ మొదలైంది. విషయం ఏంటంటే.. అది ఫేక్‌న్యూస్. వైవీ సుబ్బారెడ్డి అంటే యెహోవా విన్సెట్ సుబ్బారెడ్డి అని మధుపూర్ణిమ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ప్రచారం జరిగింది. అది తప్పు అని రుజువు చేశారు ఎంతోమంది నెటిజన్లు.

మన దగ్గరే ఎక్కువ

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే నకిలీ వార్తలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సర్వేలో తేలింది. 22 దేశాల్లో సర్వే చేయగా మన దేశంలోనే సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ వినియోగదారుల్లో 64 శాతం మందికి ఏదో ఒక రూపంలో నకిలీ వార్తలు ఎదురైనట్లు సర్వేలో తేలింది. ఇది ప్రపంచ సగటు కన్నా 7% అధికంగా ఉందట. ఈ పరిస్థితికి అక్షరాస్యత కూడా ఒక కారణంగా చెప్తున్నారు. తాము ఏదైనా సృష్టించగలం అనే ఆలోచన ఉన్నవాళ్లు చేసే పనిగా పేర్కొన్నారు.
Shadow1

ఎక్కువగా ఫేక్‌తున్నదెవరు?

యువతతో పోల్చుకుంటే వృద్ధులు, సంప్రదాయ వాదులే ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలను ఎక్కువగా షేర్ చేస్తున్నారట. న్యూయార్క్ యూనివర్సిటీ, ప్రిన్స్ టన్ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. లింగ భేదం, జాతి, ఆదాయం, విద్య వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఈ నకిలీ వార్తలను ఎక్కువగా వ్యాప్తిచేస్తారట. 3,500 మందిపై చేసిన ఈ అధ్యయనంలో 8.5% మంది ఫేక్‌న్యూస్ షేర్ చేయగా 65 ఏళ్ల వారిలో 11% మంది ఫేక్‌న్యూస్ పోస్ట్ చేశారు. 18-29 ఏళ్లలోపు వారిలో కేవలం 3% మంది మాత్రమే ఫేక్ న్యూస్ షేర్ చేసినట్లు వారు తెలిపారు. ఉదారవాదుల కంటే సంప్రదాయవాదులు ఎక్కువగా ఫేక్ న్యూస్ వ్యాపింప జేస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది.

తీవ్రమవుతున్నది

ఫేక్‌న్యూస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. మహారాష్ట్రలోని ఓ జిల్లాలో ముసుగు దొంగలు తిరుగుతున్నారు, ఇలా మీ వీధిలో కనిపిస్తే జాగ్రత్త అంటూ నకిలీ వార్తను విచ్చలవిడిగా ప్రచారం చేశారు కొందరు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో అర్థంకాక.. ఎవరైనా కొత్తవారు వస్తే అనుమానం వచ్చి చితకబాదారు. కేవలం ఒక నకిలీ వార్త ప్రభావమిది. దీనిమీద పోలీస్ కేసు కూడా నమోదయింది. 2018లో వాట్సాప్ లోని నకిలీ వార్తల వాళ్ళ 31 మంది చనిపోయినట్లు పోలీసు గణాంకాలు చెప్తున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థంచేసుకోవచ్చు.

ఫేక్‌ను పట్టేస్తాయి

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే సమాచారంలో ఏది సరైనదో, ఏది నకిలీదో గుర్తించలేక నెటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. వీటి పని పట్టేందుకు వివిధ సంస్థలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ఫ్యాక్ట్‌లీ అనే సంస్థ ఫేక్‌న్యూస్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నది. దీంతోపాటు ట్రిపుల్ ఐటీలోని ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ ఎక్స్రటాక్షన్ డాటా విజువలైజేషన్ స్టార్టప్ సంస్థ గ్రామినేర్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ ఈ సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనుక్కుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫేక్ ఓ మీటర్‌ను అభివృద్ధి చేసింది. ఇదొక వెబ్ ఇంజిన్. ఏదైనా ట్వీట్ లేదా వార్తా శీర్షిక ప్రామాణికతను రంగుల ఆధారంగా చూపించే శాతాన్ని బట్టి గుర్తించవచ్చు. అధిక శాతం ఎరుపు రంగులో కన్పిస్తే తప్పుడు సమాచారం అన్నమాట. అదే అధిక శాతం ఆకుపచ్చ రంగు వస్తే నకిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పానిష్, చైనీస్‌తో సహా అన్ని భాషల్లో ఇది పనిచేస్తుంది.

డిజిటల్ లిటరసీ లోపమే

ఫేక్‌న్యూస్ ఇండియాలో ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. తప్పుడు వార్తలు, కథనాలు, సమాచారంతో అనేక దారుణాలు జరిగాయి. మూకదాడులు, మూకహత్యలకు ఈ ఫేక్ న్యూస్ కారణమైంది. నకిలీ వార్తలు ముఖ్యంగా రెండు రకాల వ్యక్తులు చేస్తున్నారు. ఆకతాయిలు, పొలిటికల్ ఎజెండా ఉన్నవాళ్లు. ఆకతాయిలు సరదా కోసం చేస్తుంటారు. పొలిటికల్ ఎజెండా ఉన్నవాళ్లు వ్యక్తులను.. వ్యవస్థను దెబ్బతీసేందుకు ఈ రకమైన వార్తలు సృష్టిస్తున్నారు. దీనికంతటికీ కారణం డిజిటల్ లిటరసీపై అవగాహన లేకపోవడం. మా వంతుగా బాధ్యతతో డిజిటల్ లిటరసీని పెంపొందిస్తున్నాం. వాట్సప్ వంటి సోషల్‌మీడియాల ద్వారా వచ్చే ఫేక్ న్యూస్‌పై కూడా అవగాహన కల్పిస్తున్నాం.

-దిలీప్ కొణతం, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్

ఎందుకు చేస్తారు?

సోషల్‌మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టించేవారిలో వ్యక్తిగత ప్రయోజనం కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా సెన్సేషనలిజం. సంచలనాలు సృష్టించి గుర్తింపు పొందాలన్న ఆలోచనతో కొందరు ఫేక్‌వార్తలు సృష్టిస్తే.. మరికొందరు తమకన్నీ తెలుసు అనే భావనతో చేస్తుంటరని చెప్తున్నారు. ఇలాంటి వాటికి స్పందనలు బాగుంటాయి కాబట్టి.. వ్యక్తుల ఎమోషన్స్‌ను ఆసరగా చేసుకొని కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. దీనికి వాట్సప్‌ను ఆయుధంగా వాడుతున్నారు. అందుకే వాట్సప్ వంటి సోషల్‌మీడియా యాప్స్‌లో మంచి కంటే చెడు సందేశాలే ఎక్కువగా సర్య్కులేట్ అవుతున్నాయి.

నకిలీని పట్టేస్తుంది


ఫేక్‌న్యూస్‌ను అడ్డుకోవడానికి వాట్సప్ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా whatsapp checkpoint tipline ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ స్టార్టప్ సంస్థ అయిన ప్రొటో దీనిని రూపొందించింది. వాట్సప్ whatsapp checkpoint tipline ద్వారా వాట్సప్‌లో వచ్చిన సమాచారం నిజమైనదేనా? కాదా? అనేది తెలుస్తుంది. నకిలీ వార్తనా? నిజమైనదా తెలుసుకోవాలంటే మీకు వచ్చిన మెసేజ్‌ను +919643000888 నెంబర్‌కు వాట్సప్ చేయాలి. ఆ మెసేజ్‌ను ప్రోటో స్టార్టప్ ప్రతినిధులు వెరిఫై చేస్తారు. అది నిజమా? అబద్ధమా? తప్పుడు ప్రచారమా? అనేది మార్క్ చేస్తారు. టెక్ట్స్ రూపంలో వచ్చే మెసేజ్‌లు లేదా, వీడియోలు, వీడియో లింకులు ఏవైనా మీరు దానికి షేర్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాళీ, మలయాళం భాషల్లో సేవలు లభిస్తున్నాయి.
ఐడెంటిటీ కోసమే: వీరెందర్ చెన్నోజు, సైకాలజిస్ట్
Shadow2

ఫేక్‌న్యూస్ నకిలీ వార్తలు ఇప్పుడు ప్రపంచానికి ఓ పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఈ ఫేక్‌న్యూస్ ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నది. అయితే మేము పరిశీలించిన దాన్నిబట్టి చెప్పేది ఏంటంటే.. పర్సనల్ ఐడెంటిటీ కోసమే ఫేక్‌న్యూస్ సృష్టిస్తుంటారు. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లో నుంచి ఇది పుట్టుకొస్తుంది. చిన్నప్పట్నుంచి తాము ఎదిగిన పరిస్థితులు.. పేరెంటింగ్ లోపం వల్ల తాము కూడా సమూహంలో ఒక భాగం అని నిరూపించుకునేందుకు కొందరు తాపత్రయ పడుతుంటారు. అలాంటివారు సృష్టించేవే ఫేక్‌న్యూస్. ఇంకా చెప్పాలంటే ఫేక్ పర్సనాలిటీ కలిగినవాళ్లు చేసేది.

ఫేక్: ఐపీఎస్ ఆఫీసర్ చందనదీప్తికి మ్యారేజ్ అయింది. పిల్లలు కూడా ఉన్నారు.

ఫ్యాక్ట్: నాకు పెండ్లి కాలేదు. నా గురించి అబద్దపు వార్తలు సృష్టించి ఎవరో స్ప్రెడ్ చేశారు. ఇదేం బుద్ధి? అని స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.


ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. అతి వేగంగా విస్తరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఫేక్‌వార్తలు చాలా ఉన్నాయి. అలాంటి టాప్-10 ఫేక్ వార్తలు ఏవంటే..

-నగరంలో హై అలర్ట్. అదృశ్యమవుతున్న మహిళలు

-జనసేన ఓటమితో దివాళా తీసి రోడ్లపై బిర్యానీ అమ్ముకుంటున్న కల్యాణ్ దిలీప్

-700 సార్లు భగవద్గీత చదివిన బ్రిటన్ ప్రధాని థెరిస్సా

--స్కూటీ కొనుక్కోవడానికి అమ్మాయిలకు 75000 ఇస్తున్న మోదీ ప్రభుత్వం

-మట్టి ముద్దలే హైతీ ప్రజల ఆహారం

-మెడలో పాము వేసుకొని హల్‌చల్ చేసిన యోగీ ఆదిత్యనాథ్

-ఇస్లాం మతంలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చెల్లెలు

-బీరు కావాలంటూ బ్యాలెట్ బాక్స్‌లో పోస్ట్ చేసిన గ్రామస్తులు

-అమెరికన్ 100 డాలర్ నోటుపై అంబేద్కర్ చిత్రపటం ముద్రణ

-అయోధ్య రామమందిరం గురించి సుప్రీంకోర్టు ఆన్‌లైన్ పోల్ నిర్వహణ

శిక్ష తప్పదు

పనిగట్టుకొని నకిలీ వార్తలు సృష్టిస్తూ వాటిని ప్రజలపై రుద్దాలనే ప్రయత్నం చేసేవాళ్లు ఇక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. బాధ్యతారహితమైన ప్రమాదకర సందేశాల వ్యాప్తిలో ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. పాతబస్తీలో హిందూ యువతిపై దాడి అనే ఫేక్‌న్యూస్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దానిని సర్క్యులేట్ చేసిన తొమ్మండుగురిపై కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా సోషల్‌మీడియా ద్వారా పోస్టులు చేసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాబట్టి ఎవరైనా సరే.. నకిలీ వార్తల ద్వారా పబ్బం గడుపుకోవాలంటే మాత్రం పోలీసులు చూస్తూ ఊరుకోరు. జైల్లో పెట్టి తగిన శిక్ష వేసే చట్టాలు ఉన్నాయి అందువల్ల షేర్ చేసేముందు.. అది ఫేకా? ఫ్యాక్టా? అని ఆలోచించుకోవాలి.
Shadow3

సత్యమా? అసత్యమా మేం చెప్తాం

ఏదైనా మెసేజ్ వస్తే దానిని ఊరికే షేర్ చేయడం కాకుండా అది ఫేకా? ఫ్యాక్టా? అనేది తెలుసుకోవాలి. గూగుల్‌లో సెర్చ్‌చేస్తే దాని గురించి తెలుస్తుంది. అయినా అనుమానంగా ఉంటే Factly వెబ్‌సైట్‌కు గానీ.. ఫేస్‌బుక్ పేజీకి గానీ.. 096031 32132 నంబర్‌కు వాట్సప్‌గానీ చేస్తే మేం దానిపై స్టడీ చేసి వెంటనే చెప్పేస్తాం. ఎలాంటివి ఫేక్‌న్యూస్ అవుతున్నాయో తెలుసుకోవడానికి telugu.factly.in ని సందర్శించవచ్చు. ఏది సత్యం? ఏది అసత్యం? అనేవి కూడా మేం దాంట్లో పేర్కొన్నాం. నకిలీ వార్తలను పట్టేసే ఏకైక తెలుగు వెబ్‌సైట్ ఫ్యాక్ట్లీ. నకిలీ వార్తలు ప్రజలకు చేరొద్దు.. నమ్మొద్దని ఫేస్‌బుక్‌తో కూడా టైఅప్ అయి ఫేక్‌న్యూస్ పని పడుతున్నాం.
-రాకేష్‌రెడ్డి దుబ్బుడు, ఫ్యాక్ట్లీ ఫౌండర్

879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles