పద్య రత్నాలు-10


Sun,July 7, 2019 12:40 AM

kalahasthi

పాదపూజనే పరమోత్కృష్టం!

ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో
ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!
- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్ర్తాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ!
Bhaskara

ఇంటి యజమాని విలువ ఇది!

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర
త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
- భాస్కర శతకం

తాత్పర్యం:ఏ కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుంది. ఎలాగంటే, గండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవు. ఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదా. గృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే మరి.
Krishna

హరిసేవను మించింది లేదు!

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజ నాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
- కృష్ణ శతకం

తాత్పర్యం: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది!
narasihma

ఏది శాశ్వతం? ఏది అశాశ్వతం?

ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు గోచిమాత్రంబైన గొంచుబోడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడి వారికి బరమ సుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- నరసింహ శతకం

తాత్పర్యం:ఎవరూ వెయ్యేండ్లు జీవించరు. ధనం శాశ్వతం కాదు. చనిపోయాక భార్యాపిల్లలు వెంటరారు. సేవకులూ మరణాన్ని తప్పించలేరు. బంధువులైనా బతికించలేరు. బలపరాక్రమమూ పనికిరాదు. వెర్రికుక్కల వంటి భ్రమలను విడిచి పెట్టాలి. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక విషయాలను వదిలేసి, శాశ్వతమైన ముక్తికోసం స్వామి భజన చేయడం ఉత్తమోత్తమం!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles