కల్లు తాత!


Sun,July 7, 2019 01:02 AM

90 ఏండ్లు దాటినా కల్లుగీత పని

kallu
చెట్టు లెక్కగలవా ఓ నరుడా? తాటి చెట్టులెక్కగలవా? చెట్టులెక్కి.. ఆ చిటారు కొమ్మన కల్లు తీయగలవా? ఓ నరుడా తాటి కల్లు గీయగలవా? అనే పాట ఈ తొంభైయేండ్ల తాతను చూస్తే కచ్చితంగా అనిపిస్తుంది!
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం భీమనపల్లికి చెందిన బొమ్మగాని బొర్రయ్యకు తొంభైయేళ్లు దాటాయి. ఈ వయసులో కృష్ణా రామా అనుకుంటూ మనవలు, మనవరాండ్లతో కాలక్షేపం చేయాల్సిన అతను గత 75 ఏండ్ల నుంచి తాటికల్లు గీస్తున్నాడు.

ఒక్కొక్క తాటిచెట్టు సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందునా చిటారు కొమ్మన కల్లు పారుతుంది. యువకులకే కల్లు గీయడం సాధ్యం కావడంతో చాలామంది ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు. బొర్రయ్య చేత కల్లు తాగాలని గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అనుకుంటారట. తాను ఉన్నన్ని రోజులు ఇలాంటి కల్లు ప్రియులకు కల్లు పోస్తూ కుటుంబానికి అంతో ఇంతో ఆసరా అవ్వాలని ఈ వయసులో కూడా పనిచేస్తున్నాడు.
kallu1
ముప్ఫైయేండ్లకే రోగాలు నొప్పులు అంటూ ఆపసోపాలు పడుతున్న నేటితరానికి తాను ఏ నొప్పీ ఎరుగకుండా కల్లు పోస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇదంతా ఎలా సాధ్యం? ఇంత హుషారుగా ఎలా పనిచేస్తున్నావు? అని బొర్రయ్యను అడిగితే.. నేను చిన్నప్పుడు గట్కతిని బతికిన. ఆ రోజుల్లో మేం జొన్నలు, సద్దలు, కూరగాయలు, వానలకు పండించినం. ఎప్పుడూ తాటి వనాలల్లో ఉండేటోల్లం. రెండు పూటలా తాటి కల్లు తాగి పాలేరు వాగులో ఈతకొట్టేటోల్లం. చెలకలల్లో పశువుల పేడతో ఎరువులు వేసి జొన్నలు, శెనుగలు పండించినం. మా తాతల కానుంచి మేము కళ్లు గీసెవాల్లం. నాకు ఊహ ఒచ్చిన కానుంచి తాటి చెట్లు ఎక్కి ముంజలు కొట్టే వాన్ని, తరువాత కళ్లు గీయటం నేర్చుకున్న, మా కులవృత్తిని మానొద్దని నా కొడుకులకు నేర్పించిన. వాల్లు కూడా కళ్లు గీస్తరు. ఎక్కడికి పోవాలన్నా నడిచి వెల్లెవాళ్లం. లేదంటే ఎడ్ల బండ్ల మీద పోయేవాళ్లం. అప్పటి తిండే తల్లి పాలవలే బలంగా చేసింది. అందుకే యువకులను సైతం వెనకేసి తాటిచెట్లెక్కి కల్లు గీస్తున్నా అంటున్నాడు.

- దేశోజు ఎల్లా చారి

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles