గట్టిగా పట్టుకున్నది!


Sun,July 7, 2019 01:06 AM

marmika

- సౌభాగ్య

ఒక సన్యాసుల గుంపు తీర్థయాత్రకు బయల్దేరింది. వాళ్ళు దర్శించబోయే తీర్థం చాలా దూరం ఉంది. ఎన్నో రోజుల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నదులు, పర్వతాలు దాటాల్సి ఉంటుంది.

ఆ సన్యాసులందరూ దృఢ నిశ్చయంతో ఆ ప్రయాణం చేయడానికి సంకల్పించి సిద్ధపడిన వాళ్ళే. సన్యాసులంటే సర్వ సంగపరిత్యాగులు కదా! అందుకని వాళ్ళ దగ్గర ఎట్లాంటి సరంజామా లేదు. ప్రతి సన్యాసి దగ్గరా రెండు బొంతలున్నాయి. ఒకటి కట్టుకోవడానికి రెండోది కప్పుకోవడానికి. అంతకు మించి ఎవరూ ఏమీ దగ్గర ఉంచుకోకూడదన్న నియమం కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎవరూ ఆ నిర్ణయాన్ని అతిక్రమించకూడదు.

ఆ సన్యాసుల గుంపు మైదాన ప్రదేశాలు దాటి అడవి మార్గం పట్టారు. మైదాన ప్రాంతంలోని గ్రామాలలో ప్రజలు పెట్టిన అన్నం తిని కడుపు నింపుకున్నారు. అరణ్యంలోకి అడుగు పెట్టాకా కందమూలాలు కాల్చుకుని తిన్నారు.

మధ్యమధ్యలో ఎక్కడైనా వసతి గృహాలు ఉంటే విశ్రాంతి తీసుకున్నారు. ఎండల తీవ్రతకు చెట్ల కింద విశ్రాంతి తీసుకున్నారు. వర్షాలు ఎక్కడ ఎక్కువైతే అక్కడ సత్రాలలో తలదాచుకున్నారు.

ఇట్లా దాదాపు నెలరోజులు ప్రయాణించారు. ఒకరోజు ఒక పర్వత ప్రాంతంలో ఒక నదీ తీరంలో బస చేశారు. ఆ నదిలో స్నానం చేసి పూజాదికాలు నిర్వహించారు.

అంతలో చూస్తూ ఉండగానే నదీ ప్రవాహం పెరిగింది. సమీపంలో కొన్ని ఊళ్ళు ఉన్నట్లున్నాయి. ఆ నది ఆ ఊళ్ల గుండా వచ్చినట్లుంది. వరద ఉధృతి పెరిగి అది ఊళ్ళను ముంచినట్లుంది. నీళ్ళలో కుర్చీలు, పాత్రలు, దుప్పట్లు చెత్తా చెదారం కొట్టుకురావడం మొదలైంది.

సన్యాసుల దృష్టి వాటిపై పడింది. వాటిలో అవసరమైనవి అందుకుందామన్న కోరిక కూడా కొందరికి కలిగి ఉండవచ్చు.
సన్యాసులలో పెద్దవాడు. ఒకసారి ఈ ప్రవాహాన్ని చూడండి. దాంట్లో పడి కొట్టుకుపోతున్న వస్తువుల్ని చూడండి. మన జీవితాలు కూడా అలాంటివే. జీవితం ప్రవాహం లాంటిది. అన్నీ సాగిపోయేవే అన్నాడు.

అయితే సన్యాసుల్లో ఒక లావుపాటి అతను ఉన్నాడు. అతని పేరు త్యాగి. అతను పెద్దవాడైన సన్యాసి మాటల్ని పట్టించుకోలేదు. నదిలో దూరంగా ఒక బొంత కొట్టుకురావడం చూశాడు.

నా బొంతమరీ పాతదయిపోయింది. కొత్తదయితే కొంతకాలం పనికిరావచ్చు. నేను నదిలో దిగి ఆ కొట్టుకువస్తున్న బొంతను తీసుకుంటాను అన్నాడు. సన్యాసి పెద్ద త్యాగీ! మనది కాని దాని పట్ల మనకు వ్యామోహం పనికి రాదు అన్నాడు.
నేను మరీ ఎక్కువ ఆశించడం లేదు. కప్పుకోవడానికి మంచి బొంతను కోరుకోవడంలో తప్పు లేదు కదా! అని తన దగ్గరున్న రెండు బొంతల్ని పక్కనున్న సన్యాసుల కిచ్చి నదిలోకి దిగాడు.

త్యాగి ఆ బొంత దగ్గరకు వెళ్ళిదాన్ని పట్టుకున్నాడు.. కానీ దాంతోబాటు ప్రవాహంలో పడి కొట్టుకు పోసాగాడు.
సన్యాసులు త్యాగీ! నువ్వు ఆ బొంతను వదిలేసి ఇటు వైపు వచ్చెయ్ అన్నారు.

త్యాగి నేను ఆ బొంతను వదిలినా అది నన్ను వదలడం లేదు అంటూ కనిపించనంత దూరం కొట్టుకుపోయి మాయమైపోయాడు.

ఇంతకూ అది నీళ్ళలో కొట్టుకొస్తున్న తోడేలు. దాన్ని త్యాగి పట్టుకోబోతే అదే అతన్ని పట్టుకుంది.
మిత్రుడి అకాల అదృశ్యానికి సన్యాసులు బాధపడ్డారు. అందుకే వివేకవంతలన్నారు
మనం గట్టిగా పట్టుకున్నది మనల్ని గట్టిగా పట్టుకుంటుంది.

నేను మరీ ఎక్కువ ఆశించడం లేదు. కప్పుకోవడానికి మంచి బొంతను కోరుకోవడంలో తప్పు లేదు కదా! అని తన దగ్గరున్న రెండు బొంతల్ని పక్కనున్న సన్యాసుల కిచ్చి నదిలోకి దిగాడు. త్యాగి ఆ బొంత దగ్గరకు వెళ్ళిదాన్ని పట్టుకున్నాడు.. కానీ దాంతోబాటు ప్రవాహంలో పడి కొట్టుకు పోసాగాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles