తొలి మహిళా ఖ్వాజీ హకీమా ఖాటూన్


Sun,July 7, 2019 01:09 AM

QUAZI
ఖ్వాజీ.. ఈ మాట వినగానే ఇస్లాం మతంలో పెండ్లిళ్లు చేసేవారు గుర్తుకువస్తారు. సాధారణంగా ఖ్వాజీలుగా పురుషులే వ్యవహరిస్తుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఇస్లాంలోనూ మహిళా ఖ్వాజీలు రంగప్రవేశం చేస్తున్నారు. మహిళలు ఖ్వాజీలుగా వ్యవహరించడాన్ని ఇస్లాంలోని ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం సమర్థిస్తున్నది. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్‌కు చెందిన హకీమా ఖాటూన్ ఖ్వాజీగా మారి వివాహాలు జరిపించడంతో పాటు ఇస్లాంలో తొలి మహిళ ఖ్వాజీగా గుర్తింపు పొందారు.

2019 జనవరి 5న, కోల్‌కతాలోని బుర్ద్వాన్ ప్యాలెస్‌లో ఓ ముస్లిం జంటకు పెండ్లి జరిగింది. కానీ దానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా నిఖాను ఖ్వాజీ (Quazi) జరిపిస్తారు. ఇక్కడ కూడా ఖ్వాజీనే వివాహం జరిపించారు. కానీ, ఆ ఖ్వాజీ ఓ మహిళ. ఆశ్చర్యంగా ఉంది కదా. మనల్ని విస్మయానికి గురి చేసే మరో విషయం ఏమిటంటే.. ఒక మహిళా ఖ్వాజీ సహాయంతో పెండ్లి జరిపించుకోవడం కోసం ఆ జంట దాదాపు ఎనిమిది నెలలు ఎదురు చూసింది. ఆరు నెలల క్రితం జరిగిన ఈ పెండ్లి గురించి ఇప్పుడెందుకని ఆలోచిస్తున్నారా? అప్పుడు జరిగిన ఈ పెళ్లే ఇప్పుడు మహిళా ఖ్వాజీల (female quazis) ప్రాధాన్యం పెరగడానికి కారణమైంది.

ముంబైలో కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న బ్రిటిష్ మహిళ మాయా రేచెల్ మెక్ మెనస్, అదే నగరానికి చెందిన షామూన్ అహ్మద్‌కు గతేడాది నిశ్చితార్థమైంది. ఆ తర్వాత వారు తమ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించారు. వారి డ్రీమ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ప్లాన్ అంతా సిద్ధమైంది.కానీ తమ పెండ్లిని జరిపించే బాధ్యతను ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే ప్రశ్న వారిలో తలెత్తింది. అప్పటికి కొద్ది రోజుల ముందే మాయ ఖ్వాజీలుగా శిక్షణ పొందుతున్న మహిళల గురించి ఎక్కడో చదివారట. అందుకే తన పెండ్లిని మహిళా ఖ్వాజీ సహాయంతోనే జరిపించుకోవాలని భావించారు. షామూన్ కూడా దానికి ఒప్పుకున్నారు.

అప్పటి నుంచి మహిళా ఖ్వాజీ కోసం వారి వెతుకులాట ప్రారంభమైంది. రోజులు, నెలలు గడుస్తున్నా వారికి ఒక్క మహిళా ఖ్వాజీ కూడా దొరకలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాతగానీ వారి ఎదురుచూపులకు ఫలితం దక్కలేదు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన మహిళా ఖ్వాజీ 40 ఏళ్ల హకీమా ఖాటూన్ గురించి మాయ, షామూన్లకు తెలిసింది. వెంటనే ఆమెను సంప్రదించడం, పెండ్లి తేదీని నిర్ణయించడం, పెండ్లి జరగడం చకచకా జరిగిపోయాయి. ఆ పెండ్లి తర్వాత మహిళా ఖ్వాజీల గురించి చర్చలు జరగడం మొదలైంది. ఎందుకంటే ఓ మహిళా ఖ్వాజీ చట్టబద్ధమైన రీతిలో మొదటిసారిగా జరిపించిన వివాహం ఇదే.

సాధారణంగా ఇస్లాంలో పురుషులే ఖ్వాజీలుగా వ్యవహరిస్తారు. నిఖా, తలాక్ లాంటి వ్యవహారాలన్నీ వారే చూసుకుంటారు. కానీ వారికున్న పురుషాహంకారం, లింగ వివక్ష కారణంగా మహిళలకు చాలా విషయాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. దీనివల్ల బాల్యవివాహాలు, అర్ధాంతరమైన ట్రిపుల్ తలాక్‌లు జరుగుతున్నాయి. అదే మహిళా ఖ్వాజీలైతే మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తారనే భావన చాలామందిలో పెరుగుతున్నది. నిజానిజాలు తెలుసుకొని వారికున్న సందేహాలను తొలిగించుకొన్న తర్వాతే వారు వివాహం చేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు ఎక్కడా మహిళలకు అన్యాయం జరగని రీతిలో చూసుకొంటున్నారు. పైగా పెండ్లి జరిపించడానికి చాలా తక్కువ మొత్తం తీసుకుంటున్నారు. ఇవన్నీ మహిళా ఖ్వాజీల వైపు చూసేలా చేస్తున్నాయి.
QUAZI1
ప్రస్తుతం మహిళా ఖ్వాజీలు ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. భారతీయ మహిళా ముస్లిం ఆందోళన్ (బీఎంఎంఏ) సంస్థ ఈ విషయంలో చేస్తున్న కృషిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ సంస్థే మహిళలు ఖ్వాజీలుగా మారడానికి శిక్షణను ఇస్తున్నది. 2007లో మొదలైన ఈ సంస్థ ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, బాధిత మహిళలకు తోడుగా నిలబడుతున్నది. ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళే హకీమా ఖాటూన్. 2016లో బీఎంఎంఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్‌కు చెందిన మహిళ ఆమె. ఆమెతో పాటుగా శిక్షణ పొందిన 15 మంది మహిళలు ఖ్వాజీలుగా పనిచేస్తున్నారు. అయితే వారెవ్వరికీ ఇంతవరకు వివాహం చేసే అవకాశం రాలేదు. ఆ అవకాశం పొందిన మొదటి వ్యక్తి హకీమా. ప్రస్తుతం మరో 26 మంది మహిళలు ఖ్వాజీలుగా శిక్షణ పొందుతున్నారు.

మహిళలు ఖ్వాజీలుగా బాధ్యతలు చేపట్టడాన్ని ఇస్లాం మతపెద్దల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం ఖురాన్‌ను ధిక్కరించినట్టే అని వారు చెబుతున్నారు. అయితే మహిళా ఖ్వాజీలకు తోడుగా మరో వర్గం నిలబడుతున్నది. మహిళలు ఖ్వాజీలుగా వ్యవహరించడం తప్పేమీ కాదని, ఇది మత నియమాలను ఉల్లంఘించినట్టు కాదని వారు చెబుతున్నారు. మహిళా ఖ్వాజీల సంఖ్య పెరగడం వల్ల ముఖ్యంగా నిఖా, ఏకపక్షంగా చెప్పే తలాక్‌లకు చరమగీతం పాడొచ్చని వారు భావిస్తున్నారు.
మహిళా ఖ్వాజీలకు శిక్షణ ఇవ్వడానికి బీఎంఎంఏ ప్రత్యేకమైన సిలబస్ తయారు చేసింది. ఇక్కడ శిక్షణ పొందే ఖ్వాజీలు ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని మహిళాకోణం నుండి అధ్యయనం చేస్తారు. అంతేకాదు భారత రాజ్యాంగంపై అవగాహన పెంచే విధంగా కరిక్యులమ్ ఉంటుంది. అంటే ఏ పనిచేసినా చట్టబద్ధంగా, ఖురానుకు లోబడి వీరు చేస్తారన్నమాట. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఒడిషా రాష్ర్టాల్లో 15 మంది మహిళలు ఖ్వాజీలుగా పనిచేస్తూ వివాహ సంబంధమైన సమస్యల్లో చిక్కుకున్న మహిళలకు అండగా నిలుస్తున్నారు.

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles