ఇ-కామర్స్‌లో కుబేరుడు పేటీయం విజయ్!


Sun,July 7, 2019 01:18 AM

PAYTM
పేటీయం మొబైల్ వాలెట్‌ను ప్రారంభించిన కొత్తలో వినియోగదారులు మొదట ఆకర్షితులు కాలేదు. కొన్నాళ్ల తర్వాత వారి ఆలోచనలకు అనుగుణంగా సేవలందించి ఇ-కామర్స్ రంగంలోనే సంచలనం సృష్టించాడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. పేటీయం ఇప్పుడు దేశంలోనే ది బెస్ట్ మొబైల్ వాలెట్‌గా గుర్తింపు పొందింది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ పెట్టుబడులు పెట్టే స్థాయికి అది ఎదిగింది.

విజయ్ శేఖర్ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ దగ్గరి చిన్న పల్లెటూరులో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. చాలా చురుగ్గా ఉండేవాడు. విజయం ఊరికే వస్తుందా? దాని కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. ఎంతో చెమటోడ్చాలి. అప్పుడే విజయం దాసోమవుతుంది. జీరోగా ఉన్న వ్యక్తిని బిలియనీర్‌ను చేస్తుంది. ఇ-కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి మొబైల్ వాలెట్లకు ఓ దారి చూపాడు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ.

ఏదో ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉండాలనుకునేవాడు కాదు విజయ్. తానే సొంత కంపెనీ ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి కల్పించాలనేది ఆయన లక్ష్యం. అందుకే ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే ఓ స్టార్టప్ ప్రారంభించాడు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశాడు. ఆ తర్వాత వన్ 97 అనే కంపెనీని స్థాపించాడు. విజయ్ వన్ 97 కంపెనీ పెట్టినప్పుడు మొబైల్‌కు ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితంగా అందించడం మొదలు పెట్టాయి నెట్‌వర్క్ కంపెనీలు. వివిధ నెట్‌వర్క్ కంపెనీల యూజర్లకు షార్ట్ మెస్సేజ్ సర్వీస్(ఎస్‌ఎంఎస్) ద్వారా కొన్ని సర్వీసులను అందించేందుకు మొదలు పెట్టిందే వన్ 97. అయితే నెట్‌వర్క్ కంపెనీలు సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కంపెనీని నడపడానికి అప్పు తేవాల్సి వచ్చింది. కంపెనీ పెట్టిన మూడేండ్లకు తిరిగి చూసుకుంటే విజయ్ జేబులో మిగిలింది 10 రూపాయలు మాత్రమే. ఇలాగైతే కష్టమని భావించిన విజయ్ కంపెనీలోని 40 శాతం వాటా అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. కొన్ని సందర్భాల్లో సమస్యలే వాటికి పరిష్కారాలను సూచిస్తుంటాయి. తన కంపెనీ నష్టాల్లో ఉన్నా ఏ మాత్రం కుంగిపోకుండా వినూత్నంగా ఆలోచించాడు. తర్వాత మెల్లగా సరికొత్త ఐడియాలను కంపెనీలో అమలు చేయడం ప్రారంభించాడు. దీంతో నెమ్మదిగా కంపెనీ లాభాల బాట పట్టింది. ఇంతలో విజయ్‌కి మరో ఆలోచన వచ్చింది. మొబైల్ పేమెంట్ వాలెట్‌ను తీసుకువస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.
PAYTM1
అనుకున్నదే తడువుగా బోర్డు మెంబర్స్‌కు తన ఆలోచనను గురించి చెప్పాడు. కానీ, బోర్డు మెంబర్స్ విజయ్ ఆలోచనను నమ్మలేదు. అంతేకాదు ఈరోజుల్లో మొబైల్ వాలెట్‌ను ఎవరు ఉపయోగిస్తారని ఎద్దేవా చేశారు. పెట్టుబడి పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయితే విజయ్ ఓసారి హాంకాంగ్ వెళ్లినప్పుడు అక్కడ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్‌మాను కలిసే అవకాశం వచ్చింది. దీంతో తన మొబైల్ వాలెట్ ఆలోచన అతడితో పంచుకున్నాడు. ఆ ఐడియా జాక్‌మాకు నచ్చడమే కాదు.. విజయ్ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాడు. వెంటనే తన ఆలోచనకు కార్యరూపమిచ్చాడు. ఆ విధంగా పేటీయం సంస్థ మొదలయింది. పేటీయంకు మొదట వినియోగదారులు ఆకర్షితులు కాలేదు. ఇటువంటి స్టార్టప్‌ను వినియోగించడం ఇదే మొదటసారి కావడంతో ఎవరూ పేటీఎంను నమ్మలేదు. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించినా పేటీఎంను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందుకురాలేదు. దీంతో వినియోగదార్లలో నమ్మకాన్ని పెంచడం కోసం ఏమేం చేస్తే నమ్మకం కుదురుతుందో తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశాడు. 24 గంటల కస్టమర్ కేర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. వినియోగదార్లకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాడు. అదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ నోట్ల రద్దే పేటీఎంకు కలిసివచ్చింది.

ప్రజల దగ్గర నగదు రూపంలో డబ్బులు లేకపోవడంతో అందరూ పేటీయం వాలెట్‌నే ఆశ్రయించారు. పేటీఎం ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్, షాపింగ్, టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రీచార్జ్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సేవలకూ ఈ స్టార్టప్‌నే వేదికగా మార్చాడు. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనడంలో విజయ్ శేఖర్ శర్మ విజయం సాధించాడు. ఏ వస్తువునైనా కొనడానికి వినియోగదారులకు నాణ్యతతోపాటు నమ్మకం కావాలి. వినియోగదారులు కోరుకున్న విధంగానే కాకుండా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా మొబైల్ ఇ-కామర్స్ పేటిఎం వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాడు. ఆ సమయంలోనే పేటీయం కంపెనీకి 700 శాతం లాభాలు వచ్చాయి. ఒక్కసారిగా విజయ్ బిలియనీర్ అయ్యాడు. తర్వాత పేటీయంలో ఎన్నో కొత్త ఫీచర్లను, ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు విజయ్. వారెన్‌బఫెట్ పేటీయంలో 3 శాతం షేర్లు కొన్నారు. రూ.2300 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2020 నాటికి 2,100 కోట్లు ఆర్జించాలనే లక్ష్యంతో విజయ్ పనిచేస్తున్నాడు. ఇంతటి ఘన విజయం సాధించడానికి ముందు విజయ్ శేఖర్ శర్మ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles