భలే విద్యార్థులు


Sun,July 7, 2019 01:22 AM

BAAMMALU
అనసూయ దేశ్‌ముఖ్ వయసు 90 సంవత్సరాలు. చిన్నపుడు చదువుకోవాలంటే పలక, పుస్తకాలు కొనడానికి ఆర్థిక సమస్యలు అడ్డొచ్చాయి. పదేళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడంతో చదువుకునే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడామె చదువుకుంటున్నారు. ఆమె కాదు చాలామంది ఆమె వయసు దగ్గరివాళ్లు అందరూ కలసి స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. ఒకప్పుడు ఆ బామ్మలంతా ధ్రువపత్రాలపై వేలిముద్రలు వేసినవారే. ఇపుడు మాత్రం మనవళ్లతో పాటు ఓనమాలు నేర్చు కుంటున్నారు. చదువుకోవాలనే తపన ఉండాలే కానీ విద్యకు వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు.

ముంబై దగ్గర్లోని థానే జిల్లాకు చెందిన ఫంగానే గ్రామం ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉండేది. గ్రామ పంచాయితీ నిధులు పక్కదారి పట్టడంతో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. నీటికోసం మహిళలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బిందెలు చేతపట్టుకొని కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి నీటిని తెచ్చుకునేవారు. 2013వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా అడుగుపెట్టిన యోగేంద్ర బంగర్‌కు ఈ సమస్యలు స్వాగతం పలికాయి. ఎలాగైనా మహిళల కష్టాలను తీర్చాలని కంకణం కట్టుకున్న యోగేంద్ర స్థానిక ట్రస్ట్ సాయంతో ఇంకుడు గుంతలు తవ్వించారు. మంచినీటి సౌకర్యం కల్పించి వారి దాహార్తిని తీర్చారు.
BAAMMALU1
హెడ్ మాస్టర్ యోగేంద్ర మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం చూపించారు కానీ.. మరోవైపు వారిలో చదువుకోవాలన్న కోరిక కలగానే మిగిలిపోయిందనే విషయాన్ని గమనించారు. 2016లో శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా శివచరిత్ర పుస్తకాన్ని చదవాలని అంతా ఆరాటపడ్డారు. కానీ చదువురాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే యోగేంద్రను ప్రత్యేకంగా మహిళల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయించింది.

2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున వనితల విద్య కోసం ప్రత్యేకంగా తడకలతో రెండు గదుల పాఠశాలను నిర్మించారు. మరాఠీ వర్ణమాల ఆయీ పదంతో మొదలవుతుంది. ఆ పదాన్ని ఆజీగా మార్పు చేసి.. ఆ పాఠశాలకు ఆజీబైచిశాల అని పేరుపెట్టారు. ఫంగానే గ్రామంలో పదోతరగతి చదివిన శీతల్ మోర్ అనే మహిళను వారికి పాఠాలు చెప్పేందుకు నియమించారు. గులాబీ రంగు చీరలను యూనిఫామ్‌గా పెట్టడంతో ఆ చీరలు ధరించి.. స్కూల్ బ్యాగు చేతిలో పట్టుకొని.. బెల్ మోగగానే బడివైపు అడుగులేస్తారు ఈ బామ్మలు. స్కూల్ గేట్ వద్దకు రాగానే అందరూ క్రమశిక్షణగా క్యూలో నిలబడి లోపలికి ప్రవేశిస్తారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడాల్సిన వయసులో పలకా బలపం చేతపట్టి మరాఠీ వర్ణమాలను అభ్యసిస్తున్నారు. ఈ బామ్మలలో చాలామంది వరకు ఎప్పుడూ బడి మొహం చూడనివారు. స్కూల్ లో 27 మంది ఉండగా అందులో 60 నుంచి 90ఏళ్ల వయసున్నవారున్నారు. వారిలో సీతాబాయి దేశ్ ముఖ్ అనే వృద్ధురాలి వయసు 90ఏళ్లు. అందరికన్నా వయసులో ఈమెనే పెద్ద. సీతాబాయికి ఎనిమిదేళ్ల వయసున్న మనవరాలు అన్షుక ఉంది. అన్షుక కూడా సీతాబాయితో కలిసి స్కూలుకు వస్తుంది. ఇద్దరూ కలిసి ఓనమాలు దిద్దుతారు. ఇచ్చిన హోం వర్క్ ను ఇంటి దగ్గర ఆసక్తిగా పూర్తి చేస్తారు.
BAAMMALU2
అక్కడ విద్యనభ్యసించే ప్రతీ ఒక్కరూ గొప్ప ఆశయంతో ఉన్నారు. కాంతాబాయి అనే వృద్ధురాలికి భక్తి పుస్తకాలు చదవాలని ఆశ. బాల్యంలోనే చదువుకు దూరమైన ఆమె.. ఇప్పుడు ఎంతో శ్రద్ధగా బడిబాట పట్టింది. భక్తి పుస్తకాలు చదివే స్థాయికి ఎదిగేవరకు స్కూల్‌కు తప్పనిసరిగా వస్తానంటున్నది. పాఠశాలలో అందరికన్నా ముందు వరుసలో కూర్చొనే జనాబాయ్ కేదార్ తన జీవితంలో స్కూల్‌లో అడుగుపెట్టలేదు. అజీబైచీశాల బడిలో అక్షరాలు దిద్దే అవకాశం రావడంతో ఆమె ముఖంలో వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ పాఠశాల విద్యకు దూరమైన ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నది. వృద్ధ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ బడి గురించి తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాలవారు కూడా ఈ స్కూల్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆజీబైచీశాల అభివృద్ధి కోసం విరాళాలు అందించేందుకు దాతలు ముందుకొచ్చినా.. హెడ్ మాస్టర్ యోగేంద్ర బంగర్ సున్నితంగా తిరస్కరిస్తారు. పాఠశాల నిర్వహణకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తుస్తున్నారు. స్కూల్‌ను తన కంటిపాపలా చూసుకుంటున్న యోగేంద్ర నిస్వార్థసేవను చూసి అందరూ ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles