జన విలయం


Sun,July 7, 2019 02:23 AM

Prople
జనం..జనం.. ఎటు చూసినా జనప్రభంజనం.. జనాభా ఇంతై.. ఇంతింతై.. జగమంతా జనమయమై పోతు న్నది. ప్రపంచ జనాభా అదుపూ అడ్డూ లేకుండా పెరిగిపోతున్నది. నివసించే భూమి పెరుగక, వనరులు తరిగి పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మనిషి అవసరాలు తీర్చ గలిగే సంపద , సేవలు అంతరించిపోయి అందరికీ అందని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రపంచమంతా వనరుల సమస్య పెరిగి దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదల దోపిడీలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా మూలంగా పర్యావరణ పరిస్థితులు గతి తప్పుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల పయనం అంతా అగమ్యగోచరమై కడుపునింపే పిడికెడు మెతుకుల కోసం రోజంతా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా జనసంఖ్య 1987 జూలై 11 నాటికే 500 కోట్లకు చేరింది. అదే రోజును ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. అప్పటినుంచి ప్రపంచ జనాభాను కట్టుదిట్టం చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని అన్ని దేశాల్లో చర్యలు మొదలయ్యాయి. జనాభా నియంత్రణ కోసం సురక్షిత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ అభివృద్ధికి దోహద పడాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖచిత్ర కథనం.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409
Proples1
ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాల రూపకల్పనకు జనాభాలెక్కలు అవసరం. అటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. లెక్కల ఆధారంగానే సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్లే జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఉంటాయి. ప్రస్తుత ప్రపంచ జనాభా 7,71,35,04,651 కోట్లకు చేరుకుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంటే, భారత్ ద్వితీ య స్థానంలో ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 40 శాతం చైనా, భారత్‌లే ఆక్రమించా యి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ముంబయి 7వస్థానంలో నూ, కోల్‌కతా 10వ స్థానంలోనూ ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్‌లు అత్యధిక జనాభా కలిగిన వంద నగరాల్లో నిలిచాయి.

రానున్నది జన ప్రళయమే

పెరుగుతున్న జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా ఐరాస అభిప్రాయపడింది. భార త్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని ఐరాస తెలిపింది. ప్రస్తుతం 770 కోట్లు దాటిన ప్రపంచ జనాభా మరో మూడు దశాబ్దాలలో 1000 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్బీ) స్పష్టం చేస్తున్నది. గడచిన 65 ఏళ్లుగా జనాభా వృద్ధిపై అంచనాల్ని ఏటా వెలువరిస్తున్న ఆ సంస్థ 20 50 నాటికి ఇండియా 170.8 కోట్లతో జన ప్రళయమవుతుందని చెబుతున్నది. దాదాపు 142 కోట్లతో అత్యధిక జనసంఖ్య కలిగిన దేశం చైనా, మరో ఏడేళ్లకు 144 కోట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతానికి 137 కోట్ల జనాభా గల ఇండియా సైతం, అదే కాలానికి సుమారు అంతే జనసంఖ్య సాధించి చైనాతో పోటీ పడుతుందని ఐరాసకు చెందిన సామాజిక అంశాల అధ్యయన విభాగం నివేదిక వెల్లడించింది. అంటే 2050 నాటికి చైనాను మించిన జనాభాతో మన దేశానికి మహా ఉపద్రవం తప్పదన్నమాట. ప్రపంచ జనాభాలో తొలి స్థానంలో ఉన్న చైనా గడచిన 40 ఏండ్ల క్రితమే ఒక్కరు ముద్దు, ఆపై వద్దు అంటూ కుటుంబనియంత్రణ చర్యలు చేపట్టి విజయం సాధించింది. కానీ, 1950 నుండే కుటుంబనియంత్రణ అంటూ పథకాలు ప్రవేశపెట్టి వాటికి కోట్ల రూపాయలు కేటాయించినా మన దేశం సాధించింది శూన్యమే.

ఇబ్బడి ముబ్బడిగా పెరిగి...

క్రీ.శ. 1000వ సం॥లో ప్రపంచ జనాభా 40 కోట్లు మాత్రమే. 1850లో మొదటిసారి ప్రపంచ జనాభా వందకోట్లను దాటింది.. అక్కడి నుంచి కేవలం 150 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య 650 కోట్లను దాటింది. అంటే మూడు రెట్లు ఎక్కువ అన్నమాట. ఇదే లెక్కన వచ్చే ముప్పై సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అదే భారతదేశంలో చూస్తే.. 17 50లో మన దేశ జనాభా పన్నెండున్నర కోట్లు మాత్రమే. చైనాది 18 కోట్లు. 1941 నాటికి ఇండియా 38.9 కోట్లు ఉంటే అయ్యింది. చైనాది 50 కోట్లకు చేరింది. 2015 నాటికి చైనా 137 కోట్లతో ఉంటే మనం 130 కోట్లకు చేరుకున్నం. ఇప్పుడు చైనా జనాభా 142 కోట్లుగా ఉంటే మనం 137 కోట్లకు చేరాం. ఇలా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో దేశంలో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు 366 ఉంటే ప్రపంచ జనాభా జనసాంద్రత 50గా ఉంది. ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు 2.53గా ఉంటే.. ఒక్క భారత్‌లోనే అది 2.66గా ఉందంటే మన జనాభా పెరుగుదల ఎంత ప్రమాదకర స్థితికి చేరిందో అంచనా వేయవచ్చు.

చైనా ఎర్ర జెండా ప్రభావం

ప్రపంచ జనాభాలోని 20 శాతం పైగా ప్రజలు ఒక్క చైనాలోనే ఉన్నారు. భారత్‌లో అది 18 శాతానికి పైమాటే. జనసంఖ్యపరంగా అతిపెద్ద పది దేశాల్లో సగం- ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ప్రథమ స్థాయిలో ఉన్న చైనా తన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న జనాభాను అదుపు చేయడానికి కుటుంబ నియంత్రణతో ఎర్రజెండాను చూపుతున్నది. అవసరాల్నిబట్టి జననాల వేగాన్ని నియంత్రించేందుకు నిర్వహణ పరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది. కుటుంబనియంత్రణ విషయంలో చాలా కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నది. పిల్లలు లేని వారికి అనేక రాయితీలు కల్పిస్తున్నది. ఒక బిడ్డ కలిగిన వారికి విద్య, ఉపాధి, వైద్యవసతుల విస్తరణ వంటి ప్రోత్సాహకాలనూ అమలు చేస్తున్నది. అలా కాదని కు.ని. పాటించని దంపతులపై అదనంగా పన్నుల విధింపు వంటి కఠిన చర్యలను అమలు చేస్తున్నది. దీనివల్ల మన దేశంతో పోలిస్తే జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గి పోయింది. అదే సమయంలో మన దేశంలో ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం.

ఏడాదికి ఒక ఆస్ట్రేలియా సృష్టి

జనం విపరీతంగా పెరగడం ఏ దేశానికైనా అన్ని విధాలా అరిష్టమే. ఈ విషయమై ఐక్యరాజ్యసమితి తదితర అంతర్జాతీయ సంస్థలు ఎంతగా చెప్తున్నా ఆ హెచ్చరికను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టిన ఫలితం, ఇతర దేశాలకంటే భారత్‌లో ఇప్పటికే ప్రస్ఫుటమవుతున్నది. వివిధ దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో భారతదేశం మొదటిస్థానంలో ఉంది. అంతెందుకు, ప్రపంచంలోని అనేక దేశాల జనాభాకంటే మన దేశంలోని కొన్ని రాష్ర్టాల జనాభా అధికం అంటే జనాభా పెరుగుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ జనాభా అమెరికా, జపాన్ సహా ఏడు దేశాల జనసంఖ్యతో సమాన మన్నది కఠోర సత్యం. మన దేశం ప్రతి ఏడాది ఒక ఆస్ట్రేలియాను సృష్టిస్తున్నదంటే అతిశయోక్తికాదు.

అధిక సంతానం అనర్థమే

ప్రపంచ జనాభా పెరుగుదల విషయంలో ఇప్పటికీ అధిక సంతానమే ముఖ్యకారణం అనడంలో సందే హం లేదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో సంతానం విషయం లో అదుపు లేదన్నది వాస్తవం. కు.ని. పాటిస్తే పాపం చేసినట్లు భావించే అజ్ఞానపు ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయంటే ప్రపంచం ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం వంటి దేశాల్లో కొన్ని సామాజిక వర్గాల్లోనూ ఈ పద్ధతి ఇంకా అమల్లో ఉంది. దీంతో ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని కనడం, వారిని పోషించలేక ఆర్థిక, సామాజిక ఇబ్బందులకు గురవ్వడం సర్వసాధారణమై పోయింది. దేశానికే కాదు- తల్లికి, బిడ్డకు కూడా అనర్థ దాయకంగా పరిణమించే అధిక సంతానం సమస్య ఎప్పటికైనా ఇబ్బందికరమే. గర్భం ధరించరాదని నిర్ణయించుకున్నా సురక్షిత కు.ని. పద్ధతులు నేటికీ తెలియని, తెలిసినా అవలంభించ లేని ఇల్లాళ్లు ప్రపంచంలో 22.5 కోట్లమంది ఉన్నారని గణాంక నిపుణులు భావిస్తున్నారు.

కుటుంబ నియంత్రణ మానవ హక్కు

దేశ జనాభా గడచిన 68 ఏండ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఎన్ని నియంత్రణ పథకాలు ఏర్పాటు చేసినా జన విస్ఫోటాన్ని మాత్రం నియంత్రించలేకపోయాం. 1966లోనే కుటుంబ నియంత్రణ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, ఆ తరువాత జాతీయ జనాభా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చినా ఆచరణలో మాత్రం పురోగతిని సాధించలేకపోయాం. కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేసే సంపూర్ణ అధికారం రాష్ట్రప్రభుత్వాలకు కల్పించడం, సరిపడా మొత్తాల్ని కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు సకాలంలో కేటాయించడం, స్త్రీ-పురుషుల వివాహ వయస్సుల స్థిర నిర్ణయం ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా జనాభాను నియంత్రించడానికి ప్రయత్నించాల్సి ఉంది. జనసంఖ్య పెరుగుదలను అరికట్టడంలో రాష్ర్టాలకు ఆర్థిక సహకారం అందజేసేలా జాతీయ జనాభా స్థిరీకరణ నిధి (ఎన్పీఎస్‌ఎఫ్) మన దేశంతో చాలాకాలం క్రితమే ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఆ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థకు సరైన ఆర్థిక సహకారం అందకపోవడంతో అది అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. జనాభాను నియంత్రించాలనే సంకల్పం, ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగితేనే జనాభా నియంత్రణ సాధ్యమన్నది జగమెరిగిన సత్యం. జనాభా పెరుగుదల మూలంగా ఎదురయ్యే పెను విస్ఫోటనం నుంచి బయటపడాలన్న గట్టి పట్టుదల అందరిలోనూ వెల్లివిరిస్తేనే రాబోయే మహా సంక్షోభ స్థితినుండి బయట పడగలుగుతాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ మానవ హక్కు అని వారందరికీ తెలియజెప్పేలా ప్రత్యేక సదస్సును గత ఏడాది నుండి ఐరాస ఇదే జనాభా దినోత్సవం సందర్భంలో నిర్వహిస్తుండటం విశేషం! ఆరోగ్యకర పద్ధతుల్ని వచ్చే మూడేండ్లలో అదనంగా 12 కోట్లమంది వనితల దరిజేర్చడమే లక్ష్యంగా, ఈ సమావేశానికి ఎఫ్పీ 2020 అని నామకరణం చేశారు.
Proples5

కొంత మేరకు బెటర్

ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఏటా అధ్యయనం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పాపులేషన్ ఫండ్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2019 పేరుతో ఓ నివేదిక తీసుకొచ్చింది. అందులో భారత్‌లో జనాభా పెరుగుదల రేటు 0.4 శాతం తగ్గినట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో 137కోట్ల జనాభా ఉండగా.. 2001-11 మధ్యకాలంలో పాపులేషన్ గ్రోత్ రేట్ 1.64 శాతంగా నమోదైంది. అయితే 2010-19కి వచ్చేసరికి ఆ పర్సెంటేజీ 0.4 శాతం మేర తగ్గింది. జనాభా పెరుగుదల తగ్గడానికి మహిళల్లో వచ్చిన చైతన్యమే కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. చాలామంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే, బాల్య వివాహాలు మాత్రం ఏటా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.గతంలో 18 ఏండ్లలోపు తల్లులు అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే, ఈ దశాబ్దంలో ఆ సంఖ్య సగానికి తగ్గిందని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేస్తున్నది. తాజా నివేదిక ప్రకారం ఇకపై భారత్‌లో జనాభా పెరుగుదల సమస్య కాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యావంతులు, సామాజిక అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. దశాబ్దకాలంలో భారత్‌లో జననాల రేటు చాలావరకు తగ్గిందని యూఎన్ రిపోర్టు చెబుతున్నది. 1991లో వెయ్యికి 30 మంది తగ్గగా ప్రస్తుతం అది 20కి చేరింది. సంతాన సాఫల్య రేటు..

టీఎఫ్‌ఆర్ కూడా సగానికి తగ్గింది. 1970లో 5గా ఉన్న టీఎఫ్‌ఆర్ ప్రస్తుతం 2.2కు పరిమితమైంది. సగటు టీఎఫ్‌ఆర్ రేటు 2.1 కాగా.. 24 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతాన సాఫల్యత రేటు 1.8గా ఉండటం విశేషం. జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరుగుతుండటం ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ర్టాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఆ రాష్ర్టాల్లో పాపులేషన్ ఏ మాత్రం తగ్గడం లేదు. దక్షిణాది రాష్ర్టాల్లో మాత్రం జనాభా పెరుగుదల స్థిరంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేస్తున్నది. ఉత్తరాదిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల రేటు కలవరపెడుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా రాష్ర్టాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్.. టీఎఫ్‌ఆర్ 3కు పైగా ఉంది. నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ విషయంలో మహిళలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.

Proples3

పట్నమెల్లిపోతున్న పల్లెలు

భారతదేశంలో త్వరలో పల్లెలు మాయం కావచ్చు. అవును మన దేశంలో పల్లెలు చాలా వేగంగా ఖాళీ అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి తేల్చింది. భారతీయ ఆత్మ గ్రామాల్లోనే ఉందని, దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని గాంధీ చెప్పిన మాటలకు త్వరలోనే కాలం చెల్లబోతున్నదన్నమాట. జనాభా వృద్ధిరేటు, వయసు, వలస, పట్టణీకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం వలస, పట్టణీకరణ అంశాల ఆధారంగా 2050 నాటికి మన దేశ పట్టణ జనాభా గ్రామీణ జనాభాను మించిపోతుందట. 2050 నాటికి దేశంలో పట్టణ జనాభా 87.7 మిలియన్లకు చేరుకుంటుందని, గ్రామీణ జనాభా 78.3 మిలియన్లకు తగ్గిపోతుందని ఐరాస తెలిపింది. 2050 నాటికి పట్టణ జనాభా 52.8 శాతంగా, గ్రామీణ జనాభా 47.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2050 నాటికి పట్టణ జనాభా వృద్ధిరేటు 1.54గా ఉంటే గ్రామీణ జనాభా వృద్ధిరేటు కేవలం 1.06గా ఉండనుందని ఐరాస తెలిపింది.భారత్‌లో 1950-2015 మధ్య పట్టణ జనాభా 17.1 శాతం నుంచి 29.2 శాతానికి పెరిగింది. 2035 నాటికి పది లక్షలకు పైగా ఉన్న పట్టణాల సంఖ్య రెట్టింపు కానుంది. ఇదే సమయంలో 1950-2015 మధ్య గ్రామీణ జనాభా 82.9 శాతం నుంచి 67.2 శాతానికి తగ్గింది. పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెల్లడానికి పారిశ్రామిక వృద్ధి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో జనాభా పెరుగుదల రేటు అసాధారణంగా ఉంది. 1950లో 10 లక్షల జనాభా ఉంటే ఇప్పుడు ఏకంగా 26 రెట్లు పెరిగింది.

Proples1

మనమే నం-1 కానున్నామా?

2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ మేరకు ఐరాసకి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల సంస్థ అనుబంధ విభాగం ప్రపంచ జనాభా అంచనాలు-2019 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2027 నాటికి చైనా జనాభాను భారత్ దాటేస్తుంది. 2019-50 మధ్యనాటికి భారత్‌లో జనాభా 27.3 కోట్లు అదనంగా పెరు గుతుంది. ఈ శతాబ్దం చివరివరకు భారతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుంది.

Proples4

ఐక్యరాజ్యసమితి నివేదిక ఏం చెబుతున్నది?

పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా ఐరాస అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది. భారతదేశం 1.3 బిలియన్ (130 కోట్లు) జనాభాతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందని ఐరాస 2017 నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభా 7.6 బిలియన్ (760 కోట్లు)కు చేరుకుందని, 2030 నాటికి 8.6 (860 కోట్లు) బిలియన్‌కు చేరుకుంటుందని యూఎన్ 2017 నివేదిక తెలిపింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 1.4 బిలియన్ల తో చైనా, 1.3 బిలియన్ తో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు దేశాలుగా పేర్కొంది. ప్రపంచ జనాభాలో చైనా 19%, భారత్ 18% జనాభాను కలిగి ఉన్నాయి. భారత్ మరో 7 ఏళ్లలో అంటే 2024 సంవత్సరానికల్లా చైనా జనాభాను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని యూఎన్ 2017 నివేదిక అంచనా వేసింది.2050 నాటికి ప్రపంచ జనాభా 9.1 బిలియన్లకు చేరుకుంటుందని, అదే సమయంలో వచ్చే 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుంచి 2.1కి పడిపోతుందని తమ గణాంకాల్లో వెల్లడైందని సమితి తెలియజేసింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే, 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది.

వనరులకు నష్టమే

ఇంతింతై వటుడింతింతై అన్న చందంగా నానాటికీ పెరుగుతున్న జనాభాతో ప్రకృతి వనరులు తగ్గుతున్నాయి. సహజ వనరుల్ని పొదుపుగా వాడుకునేందుకు ఎవరూ ప్రయత్నించటం లేదు. కాబట్టి వాటి ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకునే లా చేయాలి. మన వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో అకాల వర్షాలు పంటలను మింగేస్తున్నాయి. మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం గగనమవుతున్నది. ఋతుపవనాలు గతి తప్పి కొత్త వ్యాధులు ప్రాణాలు తీస్తున్నాయి. అడవులు హరించి, జంతువులను మట్టుపెట్టి పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుంటే జీవకళ కనుమరుగవుతుంది. ఇది మానవజాతికే గొడ్డలి పెట్టు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి.

కుటుంబ నియంత్రణకు అనువైన పద్ధతులు

1. పిల్లలను కనడం ఆలస్యం చేయడం.
2. బిడ్డకు, బిడ్డకూ మధ్య విరామం ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవడం.
3. అసలు బిడ్డలను కనకపోవడం.

- ఇప్పటి సమాజంలో స్త్రీవిద్య, ఆర్థిక స్వావలంబన అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరు కొద్దిగా నియంత్రణ పాటించినట్లైతే సంతానోత్పత్తి రేటు కచ్చితంగా తగ్గుతుంది.
- వ్యక్తులు పాటించే నియంత్రణ కన్నా ప్రభుత్వాలు పాటించే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైంది.
- జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్ళు కూడా సమర్థనీయమే. 30, 31 ఏళ్ళ వయసులో వివాహం చేసుకునే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- ఉపాధ్యాయులు, అధ్యాపకులు గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. వైద్య, ఆరోగ్య శాఖ చొరవ తీసుకోవాలి. ఆడపిల్ల అయినా, మగపిల్లాడు అయినా సమానమనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి. ఫలితంగా మగబిడ్డ గురించి ఎదురు చూడకుండా ఎవరైనా సరే, అనుకుని ఒక్కబిడ్డతోనే ఆగిపోతారు.
- 18 ఏళ్లలోపే పెళ్లిళ్ళు చేసుకోవడం, 13 నుంచి 19 సంవత్సరాల్లోనే పిల్లల్ని ఎక్కువగా కనడం వంటివి జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయని ఓ అంచనా.
- ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనాభా నియంత్రణకు సమావేశాల్ని నిర్వహించాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలి. జనాభా నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

Proples6

2027 నాటికి అత్యధిక జనాభా కలిగే మొదటి 5 దేశాలు (అంచనా)

- భారత్ 150 కోట్లు

- చైనా 110 కోట్లు

- నైజీరియా73.3 కోట్లు

- అమెరికా 43.4 కోట్లు

- పాకిస్తాన్40.3 కోట్లు


Proples4

ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు

- ప్రస్తుతం భారత్ జనాభా 137 కోట్లయితే, చైనా జనాభా 143 కోట్లు.
- ప్రస్తుత ప్రపంచ జనాభా 770 కోట్ల నుంచి 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చు.
- 2010 నుంచి లెక్కలు తీస్తే 27 దేశాల్లో జనాభా ఒక్క శాతం తగ్గుతూ వస్తున్నది.
- కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో జనాభా తగ్గడానికి సంతాన సాఫల్యత తగ్గిపోవడం, ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు పెరగడమే కారణం.
- 2050 నాటికి చైనాలో జనాభా అత్యధికంగా తగ్గిపోతుంది. ఏకంగా 2.2 శాతం తగ్గుదల ఉంటుంది. అంటే చైనా జనాభా 3.14 కోట్లు తగ్గితే అదే సమయంలో భారత్‌లో జనాభా 27.3 కోట్లు పెరగనుంది.
- 2050 నాటికి జనాభా పెరిగే తొమ్మిది దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తుంది.
- 2050 నాటికి 65 దాటినవారు చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతీ 11 మందిలో ఒకరు 65 ఏళ్లకు పైబడి ఉంటే 2050 నాటికి ప్రతీ 6గురిలో ఒకరు 65 ఏళ్ల వయసు దాటినవారే ఉంటారు.
- భారత్‌లో 0-14, 10-24 ఏళ్ల వయస్కులు 27శాతం మంది ఉండగా.. 15-64 వయస్కులు 67శాతం మంది; 65 ఏళ్లు అంతకు మించి పైబడినవారు ఆరు శాతం ఉన్నారు.
- 1994లో ప్రతి లక్ష మందికి తల్లి మరణాల నిష్పత్తి 488 ఉండగా, 2015నాటికి 174కు తగ్గింది.
- నివేదికలో మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించిన మూడు కీలకాంశాలపై సమాచారం పొందు పరిచారు. అవి... ఆరోగ్య సంరక్షణ, జీవిత భాగస్వామితో లైంగిక సంపర్కం, గర్భనిరోధక మాత్రల, ఇంజెక్షన్ల వాడకం.
- రోజూ ప్రపంచవ్యాప్తంగా 500 మంది బాలికలు, మహిళలు గర్భధారణ, ప్రసవాల సమయంలో మృత్యువాత పడుతున్నారు. సరైన ఆరోగ్యసేవలు అందకపోవడం, అత్యవసరం సమయంలో ఆదుకోవడానికి తక్షణ వైద్యసేవలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.

1067
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles