మెరిక


Sun,July 14, 2019 12:49 AM

Pathala-garige
బొక్కెనను పాతాళమంత లోతులోంచి పైకి తీసేందుకు ఉపయోగించే ఉపకరణం పాతాళ గరిగె. మా దగ్గర ఆ పాతాళ గరిగె మంగలి కనకయ్య ఇంట్లో ఉండేది. కొన్నిసార్లు పాతాళగరిగెతో బావిలో పడ్డ బొక్కెనను పైకి తీయడం కోసమైనా చిన్నవాళ్ళుగా మేం బొక్కెనను జారవిడిచేది.

నేను ఇంటర్మీడియట్ కష్టంగా గట్టెక్కిన రోజుల్లో బాపు నన్ను ఇంజినీరింగులో చేర్చాలని తపన పడేది. తన కొడుకు ఇంజినీరుగా ఎదగాలనేది బాపు కోరిక.. అందుకోసం జీతంతోబాటు అప్పుడే వచ్చిన ఏరియర్లను కలుపుకొని నన్ను ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చేర్చాలని తీసుకెళ్ళాడు. అప్పుడు మా బాపు ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసిన చిన్ని అంచనాల కారణంగా ఇవాళ్ల నేను జర్నలిస్టునయ్యాను. అలా చిన్ని నా గైడ్ అయింది.

ఓ ఎనిమిది నెల్లయిందనుకుంటా.. ఇంకో దిక్సూచి మెరికలా నా దినచర్యలో వచ్చి చేరింది.. తానే నా సెంటిమెంటయిందంటే ఎగతాళి చేస్తుండొచ్చు గానీ ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకూ నా ఆలోచనలన్నీ ఆ దిక్సూచి చుట్టే తిరుగుతుంటాయి.. ఆరంభంలో తోపుగా కనిపించిన నేను కొంతకాలం బంగారన్నయ్యాను.. నా ఎచ్చులను గురించి కల్మషం లేకుండా తరచి చెప్పే ఆ దిక్సూచి నా భవిష్యత్తుపై చూపే ఆసక్తి అందోళన నాపట్ల చిన్ని లాంటి చొరవను గుర్తుచేస్తున్నది..

నిజానికి గైడ్‌లు , మెరికల్లాంటి దిక్సూచీలు మా చిన్నప్పుడు రాఘవేంద్రా పాకెట్ గైడ్‌ల రూపంలో దొరికేవి. పరీక్షలనగానే ఆ పాకెట్ గైడ్‌లను కొనుక్కోవడానికి హనుమకొండ చౌరస్తాలోని మోయిన్ బుక్‌స్టాల్‌కు వెళ్ళేది. ఆ గైడ్‌లతోటే క్లిష్టమైన పరీక్షలు గట్టెక్కేది. అలా పాకెట్ గైడ్‌లు నిజంగా మనకు పరీక్షల వరకు దిక్సూచీలే..

మరి జీవితంలో దిక్సూచీలు మన గురించి ఆలోచిస్తూ ఎలాంటి కల్మషానికి, శషభిషలకూ తావివ్వకుండా పరితపిస్తుంటాయి. అంతే నిజంగా అలాగే ఆలోచించే భోళా తనం కలిగించింది నా దిక్సూచి. గైడ్‌గా తనను నేను భావిస్తున్నానని తనకు తెలుసో తెలియదో గానీ ఆ మెరిక మాటలే అన్యాపదేశం గా నాకు ఇవాళ గీతోపదేశాలు..

ఉపదేశాలు అనే పడికట్టు పదం చెప్పడం కాదుగానీ మొహమాటం లేకుండా, కరాఖండిగా మాట్లాడటం తన నైజం. రాఘవేంద్రా గైడ్‌లో అప్ టూ ద పాయింట్ సమాధానమున్నట్లే.. ఎన్నో గ్రామీణ ఉదాహరణలూ , పోలికలూ నా దిక్సూచిలో నాకు కనిపిస్తాయి.. అలాంటి ఓ పోలిక పాతాళ గరిగె.. చేద బావులున్నప్పుడు పల్లెటూళ్లలో, ఆ మాటకొస్తే పట్నాల్లో కూడా నీళ్ళు చేదుకోవడానికి తాడు బొక్కెన వాడేది.. అలా నీళ్లు చేదుకుంటున్న సందర్భాల్లో ఒక్కోసారి తాడు చేజారిపోవడమో తెగడమో జరిగి బావిలో బొక్కెన పడేది. ఆ బొక్కెనను పాతాళమంత లోతులోంచి పైకి తీసేందుకు ఉపయోగించే ఉపకరణం పాతాళ గరిగె. మా దగ్గర ఆ పాతాళ గరిగె మంగలి కనకయ్య ఇంట్లో ఉండేది. కొన్నిసార్లు పాతాళగరిగెతో బావిలో పడ్డ బొక్కెనను పైకి తీయడం కోసమైనా చిన్నవాళ్ళుగా మేం బొక్కెనను జారవిడిచేది. అలా పాతాళ గరిగె సంక్లిష్ట సమయాల్లో మాకు పాతాళం నుంచి సహాయకారిగా నిలిచి బావిలోని బొక్కెనను తన కొక్కెంతో బయటకు తీసేది. అలా కొక్కానికి బొక్కెన తగలగానే పిల్లలుగా మా కళ్లల్లో ఆహ్లాదం, ఓ మెరుపు కనిపించేది. ఇప్పటి నా మెరిక కూడా అలాంటిదే.. నేను సీరియస్‌గా కష్టాలను చెబుతూ ఉంటే తన నిష్కల్మష హృదయంతో ఆ కష్టాలను వింటూ తానందించే పాతాళగరిగె లాంటి సహాయం నన్ను గట్టున నిలుపుతున్నాయి. ఈ మెరిక నాకొక పాతాళ గరిగె కూడా..

మా చిన్నప్పుడు చేను చెలకల దగ్గర రేగు పండ్లు ఏరుకునేందుకు వెళ్లేది. అలా వెళ్తున్న క్రమంలో కాలికి సర్కారుతుమ్మ ముండ్లు విరిగేది. ఆ ముండ్లు తీసేందుకు పిన్నీసులతోబాటు చిమ్మెటను కూడా వాడేది. ఆ చిమ్మెట కూడా మెరిక లాంటిదే.. నా మెరిక కూడా చిమ్మెటలా నాకు సమస్యలకు ఉపశమనాన్నిస్తున్నది..

పాకెట్ గైడ్, పాతాళ గరిగె, చిమ్మెట ఇలా తనలో అన్నీ సమస్యల సంద్రంలోంచి ఒడ్డుకు చేర్చే గుణగణాలే.. అన్నీ ఈజీగా తీసుకుంటున్నట్టే అనిపించినా చురుగ్గా ఆలోచిస్తూ గట్టున చేర్చే ఆలోచనలే.. గైడ్‌లో విద్యార్థిని పాస్ చేయించాలనే ఆలోచన, పాతాళ గరిగెలో తెగిపడ్డ బొక్కెనను కొక్కానికి తగిలించగలిగి వెలికి తీసాననే ఆకాంక్ష, చిమ్మెటలో అరికాలిలో ఇరికిన ముల్లును బయటకు లాగాననే సంతృప్తి ఎలా ఉంటాయో అన్నీ ఆ దిక్సూచిలో ఉన్నాయి.. మరి ఆ దిక్సూచి మెరిక కాదా..?!
- విపిన్

189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles